Kakinada: మా ఊర్లో దెయ్యం ఉంది.. అదే ప్రూఫ్ అంటున్న ఆ ఊరి జనం

|

Feb 09, 2024 | 6:14 PM

తమ ఊళ్లో దెయ్యం ఉంది అనే భయపడే పరిస్థితికి వచ్చారు ఊరి జనం. రాత్రయితే చాలు జాగారం చెయ్యడం, ఊరి జనం అంతా కర్రలు పట్టుకుని కాపలా కాయడం. రోజూ ఇదే తంతు నడుస్తోంది. అయితే తాజాగా తమ ఊరికి పట్టిన క్షుద్రపీడను వదిలించడానికి వాళ్లే ఓ రెమిడీ కూడా కనిపెట్టారు. ఇంతకీ ఆ ఊరేంటో, ఆ దెయ్యం భయం కథేంటో తెలుసుకుందాం పదండి....

Kakinada: మా ఊర్లో దెయ్యం ఉంది.. అదే ప్రూఫ్ అంటున్న ఆ ఊరి జనం
Ghost (Representative image)
Follow us on

ఆంధ్రప్రదేశ్, ఫిబ్రవరి 9:  కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో చీకటి పడితే చాలు.. బయటికి రావాలంటేనే గ్రామస్తులు భయపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ ఇంటి ముందు ముగ్గు వేసి పసుపు, కుంకుమ, ఎండుమిర్చితో పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. అప్పటినుంచి ఊరికి భయం పట్టుకుంది. దెయ్యం అనే అనుమాన పిశాచం వాళ్లను పీడించడం మొదలు పెట్టింది. తమ ఊళ్లో దెయ్యం ఉంది అనే భయపడే పరిస్థితికి వచ్చారు ఊరి జనం. దీంతో చీకటి పడితే చాలు…పెద్దవాళ్లు, యువకులు..గ్రామంలో గుంపులు గుంపులుగా కాపలా కాసే పరిస్థితి వచ్చింది. ఇలా ఊరు ఊరంతా రాత్రిళ్లు జాగారం చేస్తున్నారు. విషయం పోలీసుల దాకా వెళ్లడంతో..పెద్దాపురం ఎస్‌ఐ సురేష్‌ గ్రామానికి వచ్చి గ్రామస్తులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. గ్రామస్తులను భయం వీడలేదు. రాత్రయితే చాలు కాపలా కాసే సీన్లు కనిపిస్తూనే ఉన్నాయి.

అమావాస్య రావడంతో గ్రామంలో శివాలయం, నూకాలమ్మ దేవాలయాల్లో ప్రత్యేక హోమాలు చేయడానికి రంగం సిద్ధం చేశారు గ్రామస్తులు. 12 గంటల పాటు ఏకధాటిగా అష్ట భైరవి మహాశక్తి యాగానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో ప్రతి ఇంటి నుంచి పసుపుకొమ్ముకి దారం కట్టి అమ్మవారి ఆలయానికి తీసుకుని రావాలంటూ మైక్‌లో చాటింపు కూడా వేశారు. దుష్టశక్తుల వల్ల ఇబ్బంది పడుతున్న గ్రామస్తుల కోసం అష్ట భైరవ మహాశక్తి యాగం చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ హోమాల ధాటికి ఊరికి పట్టిన క్షుద్ర శక్తుల పీడ వదిలిపోతుందని గ్రామస్తులు నమ్ముతున్నారు.

కాండ్రకోటలో ఇప్పుడు భయం గూడు కట్టుకుంది. గ్రామస్తుల మనసుల్లో దెయ్యం అనే భయం కోట కట్టుకుని కూర్చుంది. ఆ భయానికి విరుగుడు మంత్రం కోసం గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..