Fact Check: ఏపీలో కరోనా కలకలం.. ఇద్దరు కోవిడ్‌తో చనిపోయారా? ప్రభుత్వానికి సమాచారం లేదా? నిజం ఏంటి?

AP Fact Check: సోషల్ మీడియాలో కడప జిల్లాలో ఇద్దరు కరోనా వల్ల మరణించారని, ప్రభుత్వం ఈ విషయాన్ని దాచిపెడుతోందని ప్రచారం జరుగుతోంది. అయితే ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఈ వాదనలను ఖండిస్తూ, నమోదైన కేసులు, మరణాల అసలు కారణాలు, ప్రభుత్వం చేపట్టిన చర్యలపై పూర్తి వివరాలు వెల్లడించింది.

Fact Check: ఏపీలో కరోనా కలకలం.. ఇద్దరు కోవిడ్‌తో చనిపోయారా? ప్రభుత్వానికి సమాచారం లేదా? నిజం ఏంటి?
Andhra Pradesh Covid

Updated on: Jul 10, 2026 | 10:27 AM

సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా “ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది”, “కడప జిల్లాలో ఇద్దరు కోవిడ్‌తో మరణించారు”, “ప్రభుత్వానికి ఇప్పటివరకు సమాచారం లేదు” అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రచారంపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టత ఇచ్చింది.

  • క్లెయిమ్: కడప జిల్లాలో కరోనా తీవ్రంగా వ్యాపించిందని, ఇద్దరు కోవిడ్ కారణంగా మరణించారని, ప్రభుత్వం ఈ విషయాన్ని దాచిపెడుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
  • ఫ్యాక్ట్ చెక్: ఈ ప్రచారం పూర్తిగా అసత్యం అని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ వెల్లడించింది. కడప జిల్లాలో నమోదైన కోవిడ్ కేసులపై ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించిందని, ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. అలాగే దురదృష్టకర మరణాలను వాస్తవాలకు విరుద్ధంగా ప్రచారం చేయడం, ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం చట్టరీత్యా నేరమని హెచ్చరించింది.

కడపలో నమోదైన కేసుల వివరాలు

ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం జిల్లాలో ఐదు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరారెడ్డి (66) – మధుమేహం, అధిక రక్తపోటుతో చికిత్స పొంది జూలై 4న కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. జి. కొండయ్య (67) – మధుమేహం, క్షయవ్యాధితో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో ప్రస్తుతం కడప ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్షత్ (25) – స్వల్ప లక్షణాలతో ఇంటి వద్దే ఐసోలేషన్‌లో ఉన్నారు.

ఎన్. సుబ్బరాయుడు (52) – మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతూ తీవ్ర అనారోగ్యంతో జూన్ 28, 2026న మరణించారు. సయ్యద్ మబాషా (43) – దీర్ఘకాలిక మద్యపాన అలవాటు కారణంగా తీవ్ర అనారోగ్యంతో జూలై 7న మరణించారు.

ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, మరణించిన ఇద్దరూ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, వారి మరణాలను కేవలం కోవిడ్ కారణంగానే జరిగాయని చెప్పడం సరైంది కాదని స్పష్టం చేసింది.

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు

ఆరోగ్య శాఖ ప్రకారం నమోదైన అన్ని కేసులపై సమగ్ర విచారణ నిర్వహించారు. ఎవరికీ ఇటీవల ప్రయాణ చరిత్ర (ట్రావెల్ హిస్టరీ) లేదని గుర్తించారు. దీంతో స్థానికంగా వైరస్ వ్యాప్తి జరిగి ఉండే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.

అలాగే, కాంటాక్ట్ ట్రేసింగ్ వేగవంతం చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో జ్వర సర్వేలు నిర్వహిస్తున్నారు. ఇంటి, సంస్థాగత ఐసోలేషన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేశారు. అవసరమైన ఆక్సిజన్, వెంటిలేటర్ సదుపాయాలను అందుబాటులో ఉంచారు.

వైరస్‌లో కొత్త వేరియంట్ ఉందో లేదో తెలుసుకునేందుకు నమూనాలను పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థ (NIV)కు జన్యు విశ్లేషణ కోసం పంపించాలని నిర్ణయించారు. అలాగే కోవిడ్ నిర్ధారణ అయిన ఇంటర్న్ వైద్య విద్యార్థి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉండి, ఇంటి వద్దే ఐసోలేషన్‌లో ఉన్నారని అధికారులు తెలిపారు.

తప్పుదారి పట్టించే ప్రచారం

సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న “ప్రభుత్వానికి సమాచారం లేదు”, “ఇద్దరు కోవిడ్‌తోనే మరణించారు”, “కరోనా పరిస్థితిని ప్రభుత్వం దాచిపెడుతోంది” అనే వాదనలు తప్పుదారి పట్టించేవి.

వాస్తవానికి కడప జిల్లాలో నమోదైన కోవిడ్ కేసులపై ప్రభుత్వం ఇప్పటికే స్పందించింది. బాధితుల ఆరోగ్య పరిస్థితులు, మరణాల కారణాలపై అధికారిక వివరాలు విడుదల చేసింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఆరోగ్య శాఖ పలు చర్యలు కూడా చేపట్టింది.

Follow Us