
సర్పంచి ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రచారం చేయాలి.. ఓట్లు అడగాలి.. ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలి! కానీ ఈ గ్రామంలో మాత్రం సీన్ రివర్స్. సర్పంచి పదవికి ఏకంగా బహిరంగ వేలం నిర్వహించారు. చివరకు ఓ వ్యక్తి రూ.1.20 కోట్లు చెల్లించేందుకు ముందుకు వచ్చి సర్పంచి పదవిని దక్కించుకున్నట్లు సమాచారం. ఈ వింత వ్యవహారం ఇప్పుడు కాకినాడ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ పంచాయతీలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక శివాలయంలో బుధవారం రాత్రి గ్రామానికి చెందిన కొందరు పెద్దలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సర్పంచి పదవికి బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలంలో ముగ్గురు పాల్గొనగా.. చివరకు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రూ.1.20 కోట్లకు పదవిని దక్కించుకున్నట్లు తెలిసింది. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. దుర్గాడ సర్పంచి స్థానం జనరల్ మహిళకు కేటాయించారు. అయినప్పటికీ వేలం ప్రక్రియలో ముగ్గురు పాల్గొన్నట్లు సమాచారం.
వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని గ్రామంలోని ఆలయాల అభివృద్ధికి ఖర్చు చేయాలని పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. వేలంలో నిర్ణయించిన వ్యక్తి కాకుండా మరెవరైనా ఎన్నికల్లో పోటీ చేసినా, అత్యధికంగా పాట పాడిన వ్యక్తినే గెలిపించాలని తీర్మానించినట్లు సమాచారం. వార్డు సభ్యుల స్థానాలను కూడా ఏకగ్రీవం చేయాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. ఒకవేళ ఎన్నికలు జరిగే పరిస్థితి వస్తే.. కమిటీ నిర్ణయించిన మెజారిటీ సభ్యులను గెలిపించేలా వ్యవహరించాలని తీర్మానించినట్లు తెలిసింది.
దుర్గాడ గ్రామంలో సర్పంచి పదవికి వేలం నిర్వహించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ రెండుసార్లు ఇలాగే వేలం నిర్వహించినట్లు స్థానికంగా చెబుతున్నారు. ఇప్పుడు మూడోసారి రూ.1.20 కోట్ల భారీ మొత్తానికి వేలం జరగడం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ఆలయాల అభివృద్ధి కోసం నిధులు సమకూర్చాలన్న ఉద్దేశమని గ్రామ పెద్దలు చెబుతున్నట్లు సమాచారం. మరోవైపు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికల్లో పదవులను వేలం వేయడంపై చర్చ మొదలైంది. అసలు సర్పంచి పదవికి ధర నిర్ణయించడం ఎంతవరకు సమంజసం? అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.