కోట్లు వస్తాయని ఆశపడి కంగుతిన్న ఇన్సురెన్స్ ఏజెంట్.. ఏం జరిగిందంటే..

| Edited By: Srikar T

Jul 19, 2024 | 10:40 PM

విజయనగరం జిల్లాలో సైబర్ మోసగాళ్ల వలకు చిక్కి లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు ఓ ఇన్స్యూరెన్స్ ఏజెంట్. స్టాక్ మార్కెట్‎లో పెట్టుబడులు పెట్టండి, ధనవంతులు అవ్వండి అని తన మొబైల్‎కి వచ్చిన ప్రకటన చూసి అడ్డంగా బుక్ అయ్యాడు. విజయనగరం జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్ నగర్‎లో నివాసం ఉంటున్న రామకృష్ణ రాజు అనే వ్యక్తి ఇన్స్యూరెన్స్ ఏజెంట్ పని చేస్తున్నాడు.

కోట్లు వస్తాయని ఆశపడి కంగుతిన్న ఇన్సురెన్స్ ఏజెంట్.. ఏం జరిగిందంటే..
Cyber Frauds
Follow us on

విజయనగరం జిల్లాలో సైబర్ మోసగాళ్ల వలకు చిక్కి లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు ఓ ఇన్స్యూరెన్స్ ఏజెంట్. స్టాక్ మార్కెట్‎లో పెట్టుబడులు పెట్టండి, ధనవంతులు అవ్వండి అని తన మొబైల్‎కి వచ్చిన ప్రకటన చూసి అడ్డంగా బుక్ అయ్యాడు. విజయనగరం జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్ నగర్‎లో నివాసం ఉంటున్న రామకృష్ణ రాజు అనే వ్యక్తి ఇన్స్యూరెన్స్ ఏజెంట్ పని చేస్తున్నాడు. ఇన్స్యూరెన్స్ ఏజెంట్‎గా తనకు వచ్చిన కమీషన్ డబ్బుతో పాటు మరికొంత డబ్బు అప్పు చేసి ఏదో ఒక వ్యాపారం చేద్దామని నిర్ణయించుకున్నాడు. ఈ ప్రయత్నంలోనే అనేక రకాల వ్యాపారాల కోసం వెదికాడు. ఆ సమయంలోనే అతని మొబైల్‎కు ఓ వ్యాపార ప్రకటన వచ్చింది. ఆ వ్యాపార ప్రకటనే అతని పాలిట శాపంగా మారింది. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి లక్షలు సంపాదించండి, లక్షలు పెట్టుబడి పెట్టండి కోట్ల రూపాయలు పొందండి అని అతని మొబైల్‎లో వచ్చిన ఆ ప్రకటన చూసిన రామకృష్ణ రాజు ఇదేదో బాగుంది అనుకొని అటువైపు దృష్టిసారించి ఆ ప్రకటనలోని నెంబర్‎కు ఫోన్ చేశాడు. మీరు ఇచ్చిన ప్రకటన చూశానని పెట్టుబడి ఎలా పెట్టాలో చెప్తే నేను పెడతానని సైబర్ నేరగాళ్లను అడిగాడు రామకృష్ణ రాజు.

మీరు ఆన్లైన్ ట్రేడింగ్‎లో డబ్బు పెట్టుబడి పెడితే మీకు లక్షల రూపాయలు వస్తాయని, కొంచెం ఎక్కువగా పెడితే మాతో వ్యాపార భాగస్వాములు కూడా అవ్వొచ్చని మాయమాటలు చెప్పి ముగ్గులోకిదించారు. తరువాత రెండు మూడు రోజులు నమ్మకంగా వ్యవహరించిన సైబర్ నేరగాళ్లు ఒక రోజు ఫోన్ చేసి మీరు మన కంపెనీలో భాగస్వామి అయ్యారని, మీ వాటాగా మీకు ఇరవై కోట్లు డబ్బులు వచ్చాయని నమ్మబలికారు. అయితే ఆ ఇరవై కోట్లు మీరు తీసుకోవాలంటే రూ.43 లక్షలు చెల్లించాలని, ఆ డబ్బు చెల్లిస్తే మీ డబ్బు మీ అకౌంట్లో పడుతుందని మాయ మాటలు చెప్పి రామకృష్ణరాజును నమ్మించారు. అనంతరం వారు చెప్పినట్లే రూ.43 లక్షలు వారిచ్చిన అకౌంట్‎కి డిపాజిట్ చేశాడు. అలా డబ్బు తీసుకున్న సైబర్ నేరగాళ్లు మూడు పనిదినాల్లో డబ్బు మీ అకౌంట్‎కు వస్తుందని నమ్మబలికారు. వారి మాటలు నిజమే అనుకొని సంతోషపడ్డాడు రామకృష్ణ రాజు. అలా ఆ డబ్బు పడక ముందే మరో మూడు రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసి ఇప్పుడు ఆన్లైన్ ట్రేడింగ్‎లో మీకు మరికొన్ని బోనస్ పాయింట్స్ వచ్చాయని ఇప్పుడు మీ అకౌంట్‎లో మరొక రూ.30 కోట్లు ఉన్నాయని చెప్పారు. ఆ రూ.30 కోట్లు కూడా తీసుకోవాలంటే మరొక రూ.30 లక్షలు అక్కౌంట్‎లో వేయాలని చెప్పారు. అది కూడా నమ్మి వారు చెప్పినట్లే మరో రూ.30 లక్షలు సైబర్ నేరగాళ్ల ఖాతాకు బదిలీ చేశాడు రామకృష్ణ రాజు.

ఆ తర్వాత మళ్లీ మూడు రోజులు వెయిట్ చేయాలి అని చెప్పారు. వారు చెప్పినట్లే మూడు రోజులు వెయిట్ చేశాడు. సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు రెండుసార్లు కలిపి మొత్తం యాభై కోట్ల రూపాయలు అక్కౌంట్‎లో పడతాయని ఎదురుచూస్తున్నాడు. మూడు రోజులు కాస్తా వారం రోజులు గడిచింది. ఇక చేసేదిలేక తనకు ఇంకా డబ్బులు పడలేదని వారికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కలవకపోవడంతో తనను సైబర్ నేరగాళ్లు మోసం చేసి డబ్బు కాజేశారని గ్రహించి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు రామకృష్ణ రాజు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈజీ మనీ కోసం మొబైల్ ఫోన్స్‎లో వచ్చే మోసపూరిత యాడ్స్‎ను చూసి నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు విజయనగరం జిల్లా పోలీసులు.