మహాకవి గురజాడ ఇంట్లో పాముల సంచారం.. పరిశుభ్రతపై అధికారులకు వినతి

| Edited By: Srikar T

Jul 25, 2024 | 6:24 PM

నవయుగ వైతాళికుడు, మహాకవి గురజాడ అప్పారావు అంటే తెలియని వారుండరు. నాటినుండి నేటితరం వరకు స్ఫూర్తిగా నిలిచారు గురజాడ. 1861 సెప్టెంబర్ 21 న జన్మించిన గురజాడ అప్పారావు గొప్ప సంఘసంస్కర్త. సమాజం కోసం ఎంతో పాటు పడ్డ గురజాడ అప్పారావు తన రచనలతో సామాన్యులను సైతం ప్రభావితం చేశారు. ఆయన రచనలన్నీ సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా సాగాయి. కృష్ణ జిల్లా గురజాడ నుండి ఉత్తరాంధ్రకు వలస వచ్చిన గురజాడ తల్లిదండ్రులు తొలినాళ్లలో విశాఖ జిల్లా ఎస్ రాయవరంలో నివాసం ఉండేవారు.

మహాకవి గురజాడ ఇంట్లో పాముల సంచారం.. పరిశుభ్రతపై అధికారులకు వినతి
Gurajada House
Follow us on

నవయుగ వైతాళికుడు, మహాకవి గురజాడ అప్పారావు అంటే తెలియని వారుండరు. నాటినుండి నేటితరం వరకు స్ఫూర్తిగా నిలిచారు గురజాడ. 1861 సెప్టెంబర్ 21 న జన్మించిన గురజాడ అప్పారావు గొప్ప సంఘసంస్కర్త. సమాజం కోసం ఎంతో పాటు పడ్డ గురజాడ అప్పారావు తన రచనలతో సామాన్యులను సైతం ప్రభావితం చేశారు. ఆయన రచనలన్నీ సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా సాగాయి. కృష్ణ జిల్లా గురజాడ నుండి ఉత్తరాంధ్రకు వలస వచ్చిన గురజాడ తల్లిదండ్రులు తొలినాళ్లలో విశాఖ జిల్లా ఎస్ రాయవరంలో నివాసం ఉండేవారు. తరువాత అక్కడ నుండి ఉద్యోగరీత్యా విజయనగరం వలస వచ్చారు. గురజాడ తండ్రి గజపతిరాజుల సంస్థానంలో రెవెన్యూ సూపర్ వైజర్‎గా పనిచేసి విజయనగరంలోనే స్థిరపడ్డారు. అలా విజయనగరం వచ్చిన గురజాడ స్థానిక ఎంఆర్ కాలేజ్‎లో చదువుకొని అదే కాలేజ్‎లో ఉపాధ్యాయుడిగా చేరారు. అక్కడ తెలుగు భాష ఉద్యమకారుడు గిడుగు రామ్మూర్తి గురజాడకు సహోద్యోగిగా ఉండేవారు. గురజాడ, గిడుగు ఇద్దరు ప్రాణస్నేహితులుగా మెలిగారు. ఎంఆర్ కళాశాల నుండి 1886లో మహారాజా సంస్థానంలో చేరిన గురజాడ మహారాజా ఆనంద గజపతిరాజు, రాణి అప్పలకొండయాంబ, రాణి లలితాంబిక వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు.

ఆ క్రమంలోనే గురజాడ అనేక రచనలు చేశారు. ఆయన రాసిన రచనలు తెలుగుతోపాటు ఇంగ్లీష్, హిందీ, ఫ్రెంచ్ వంటి ఇతర భాషల్లోకి కూడా అనువదించారు సాహితీవేత్తలు. వాటిలో ప్రధానంగా కన్యాశుల్కం, దిద్దుబాటు, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ వంటి రచనలు సమాజాన్ని ఎంతో మేలుకొల్పాయి. కన్యాశుల్కం నాటకం ఇప్పటికీ అందరినీ ఆలోచింపజేస్తుంది. చివరిగా మహారాజా సంస్థానంలో ఉద్యోగం చేస్తుండగానే రాణి లలితాదేవి వద్ద నుండి గురజాడ అప్పారావు కోట జంక్షన్ వద్ద ఉన్న ఇంటిని 2,500/- కు కొనుగోలు చేశారు. అలా ఆ ఇంట్లో ఉన్న సమయంలోనే అనారోగ్యంతో 1915, నవంబర్ 30న అకాలమరణం చెందారు. ఆయన మరణానంతరం భావితరాలకు స్ఫూర్తిగా నిలిచేలా ఆయన నివాసాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని చారిత్రక భవనంగా గుర్తించి ఆయన వాడిన వస్తువులు ఆ గృహంలో ఉంచి సందర్శకులకు అందుబాటులో ఉంచారు.

నిత్యం అనేక మంది సందర్శకులు గురజాడ గృహానికి వచ్చి సందర్శిస్తుంటారు. అంతటి చారిత్రక గురజాడ నివాసంలో ఇప్పుడు నిత్యం పాములు సంచరిస్తున్నాయి. ఆ గృహంలో ఉద్యోగిగా ఉన్న గురజాడ మునిమనవడు గురజాడ ప్రసాద్‎తో పాటు సందర్శనకు వచ్చే సందర్శకులు సైతం పాములు చూసి హడలెత్తిపోతున్నారు. గురజాడ నివాసం ప్రక్కన ఉన్న వ్యర్థాల కారణంగా గురజాడ గృహంలోకి పాములు వస్తున్నట్లు గుర్తించి జిల్లా కలెక్టర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ దృష్టికి తీసుకెళ్లారు గురజాడ కుటుంబీకులు. గురజాడ కుటుంబీకుల సమాచారం మేరకు స్పందించిన జిల్లా కలెక్టర్ తగు చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అయితే గురజాడ గృహం ప్రక్కన గురజాడ స్థలంలో గురజాడ విగ్రహం ఏర్పాటుచేసి పార్క్ ఏర్పాటుచేయాలని, అప్పుడు ఇలాంటి సమస్యలు తలెత్తవని అంటున్నారు గురజాడ అభిమానులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..