విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలోకి BRS ఎంట్రీతో ఏపీలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ రాజుకుంది. కేంద్రంపై విసుర్లు.. ప్రభుత్వాల మధ్య మాటల వేడి.. విపక్షాల కౌంటర్లతో సమస్య రాజకీయ రంగు పులుముకుంటోంది. ఈ అంశాన్ని టేకప్ చేయడం వెనుక BRS వ్యూహం ఏంటనే చర్చా జరుగుతోంది. విశాఖ ఉక్కు… రాజకీయ పార్టీలకు కిక్కు ఇస్తోందా..? తెలంగాణలో అధికారంలో ఉన్న BRS జోక్యంతో సమస్య పొలిటికల్ టర్న్ తీసుకుందా..? ఈ ప్రశ్నల చుట్టూనే ప్రస్తుతం ఏపీ రాజకీయం వేడెక్కుతోంది. రెండేళ్లుగా స్టీల్‌ప్లాంట్ కార్మికులు చేస్తున్న ఉద్యమానికి ఏపీ BRS నేతలు విశాఖ వచ్చి మద్దతిచ్చారు. ప్రైవేటీకరణ కోసం చేపట్టిన బిడ్డింగ్‌లో పాల్గొనాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించిన తరుణంలో గులాబీ పార్టీ నేతల రాక.. కాక రేపుతోంది. కేంద్రం చర్యల వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించిన ఏపీ BRS అధ్యక్షుడు తోట చంద్రశేఖర్.. స్టీల్‌ప్లాంట్ భూములు అదానీకి దోచిపెట్టడానికే అని తేల్చేశారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో బీఆర్ఎస్ తీరును ఏపీ బీజేపీ తప్పుపట్టింది. ఏపీ సీపీఐ మాత్రం తెలంగాణ సర్కార్ చర్యలను ప్రస్తావిస్తూనే.. వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించింది. స్టీల్ ప్లాంట్ విషయంలో బీఆర్ఎస్ తీరును ప్రశ్నించారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్.
ఏపీలో పాగా వేసేందుకు బీఆర్ఎస్ రాజకీయ ఎత్తుగడ..? ఇంతకీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలోకి బీఆర్ఎస్ ఎందుకు ఎంట్రీ ఇచ్చింది..? విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకునే ఆలోచనా.. లేక ఈ అంశం ఆధారంగా ఏపీలోనూ బీఆర్ఎస్ పాగా వేసే రాజకీయ ఎత్తుగడ ఉందా..? స్టీల్ ప్లాంట్ దాదాపు 30 వేల మంది కార్మికులతో ముడిపడి ఉన్న అంశం కావడంతో బీఆర్ఎస్ వేగంగా పావులు కదుపుతున్నట్టు ఏపీలోని పార్టీలు అనుమానిస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం