పార్టీకి విధేయంగా ఉన్నందుకు అందలం.. బచ్చలి కుటుంబానికి ఎంపీపీ పదవి..

సత్యసాయి జిల్లా తనకల్లు మండల పరిషత్ అధ్యక్షురాలిగా మల్లిరెడ్డిపల్లి పంచాయతీ పెద్దపల్లికి చెందిన బచ్చిలి రమాదేవి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి అండగా ఉంటున్న బచ్చిలి కుటుంబానికి ఈ అవకాశం దక్కింది. మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ 9, వైసీపీ 5 స్థానాలు గెలుచుకోగా, వైసీపీ ఎంపీటీసీలు ఎన్నిక సమావేశానికి హాజరుకాలేదు.

పార్టీకి విధేయంగా ఉన్నందుకు అందలం.. బచ్చలి కుటుంబానికి ఎంపీపీ పదవి..
Bachili Ramadevi

Updated on: Nov 20, 2026 | 3:46 PM

సత్యసాయి జిల్లా తనకల్లు మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) పదవి మల్లిరెడ్డిపల్లి పంచాయతీ పెద్దపల్లికి చెందిన బచ్చిలి రమాదేవిని వరించింది. ఈ మేరకు ఆమె ఏకగ్రీవంగా ఈ పదవికి ఎంపికయ్యారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీకి అండగా ఉంటూ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న కార్యకర్త కుటుంబానికి ఈ అవకాశం కల్పించడంపై పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాల్లో.. 9 టీడీపీ, 5 వైసీపీ సొంతం చేసుకున్నాయి. వైసీపీ ఎంపీటీసీలు ఎవరూ ఎన్నిక సమావేశానికి హాజరుకాలేదు.

తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి బచ్చిలి కుటుంబం పార్టీకి అండగా నిలుస్తూ వస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి మండల పరిషత్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం కల్పించడం పార్టీ పట్ల వారి నిబద్ధతకు దక్కిన గుర్తింపుగా స్థానిక నాయకులు అభిప్రాయపడుతున్నారు. రమాదేవి భర్త బచ్చిలి బ్రహ్మానందరెడ్డి టీడీపీకి మండల పరిధిలో కో-కన్వీనర్‌గా కొనసాగుతున్నారు. పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేస్తున్న కుటుంబానికి రాజకీయంగా తగిన గుర్తింపు లభించిందని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి.

ఈ సందర్భంగా మాజీ మండల పార్టీ కన్వీనర్ బీగం శంకర్ నాయుడు మాట్లాడుతూ.. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడుతూ, కష్టసుఖాల్లో అండగా నిలిచిన వారికి మండల పరిషత్ బాధ్యతలు అప్పగించడం సముచితమని అన్నారు. ఎంపీపీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌కు బచ్చిలి రమాదేవి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us