
ఏపీలో స్థానిక సంస్థల ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో 1వ తేదీన పోలింగ్ ముగియగా, నవంబర్ 3న ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఆ రోజు తుపాను ప్రభావంతో చీరాలలో భారీ వర్షం కురవడంతో కౌంటింగ్ ప్రక్రియను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. దాంతో తాజాగా నేడు అక్కడ ఓట్ల లెక్కింపు చేపట్టారు.
ఈ కౌంటింగ్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ తొలి విజయాన్ని అందుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కూటమి పార్టీలు, వైసీపీల మధ్య హోరాహోరీ పోరు సాగుతుండగా.. కాంగ్రెస్ పార్టీ చీరాల మున్సిపాలిటీలో ఖాతా తెరిచింది. చీరాల 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు ఘన విజయం సాధించారు.
ఈ 25వ వార్డులో బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో, వైసీపీ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు. ఇక 22వ వార్డును టీడీపీ అభ్యర్థి కైవసం చేసుకోగా, అక్కడ కాంగ్రెస్ రెండో స్థానంలో, వైసీపీ మూడో స్థానంలో నిలిచాయి.ఇక చీరాలలో కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ కౌటింగ్ జరగనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.