
కుల ధ్రువీకరణ పత్రం కావాలంటే ఇకపై రెవెన్యూ ఆఫీస్.. సచివాలయం.. మీ సేవా కేంద్రం అంటూ తిరగాల్సిన అవసరం లేదు. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. వాట్సాప్‌లోనే అప్లై చేసి క్యాస్ట్ సర్టిఫికెట్ పొందొచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సేవను మరింత సులభతరం చేసింది.
ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కుల ధ్రువీకరణ పత్రాన్ని సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం 9552300009 నంబర్‌కు ముందుగా వాట్సాప్‌లో “Hi” అని మెసేజ్ పంపాలి.
ఆ తర్వాత కనిపించే ఆప్షన్లలో రెవిన్యూ సర్వీస్( Revenue Services)ను ఎంచుకోవాలి. అందులో Re-Issuance of Integrated Certificates ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం ఆధార్ నంబర్ నమోదు చేస్తే మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. తర్వాత అడిగిన వివరాలను నమోదు చేసి, నిర్ణీత రుసుము రూ.40 చెల్లిస్తే క్యాస్ట్ సర్టిఫికెట్ PDF రూపంలో మొబైల్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇప్పటికే కుల ధ్రువీకరణ పత్రం జారీ అయి ఉన్నవారికి కూడా ఈ సేవ ఉపయోగపడుతుంది. అవసరమైన ప్రతిసారీ కొత్తగా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. వాట్సాప్ ద్వారా సర్టిఫికెట్‌ను తిరిగి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, ఇతర అవసరాల కోసం కుల ధ్రువీకరణ పత్రం అవసరమయ్యే వారికి ఈ సేవ ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా డిజిటల్ సేవలకు అలవాటుపడిన యువతకు ఇది మరింత సౌకర్యంగా మారనుంది.
సింపుల్‌గా చెప్పాలంటే.. వాట్సాప్‌లో Hi → Revenue Services → Re-Issuance of Integrated Certificates → Aadhaar → OTP → వివరాలు → రూ.40 చెల్లింపు → PDF డౌన్‌లోడ్. అంటే.. సర్టిఫికెట్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే రోజులు పోయినట్టే!