పవన్‌పై ఏపీ మంత్రుల ముప్పేట దాడి.. బోడిలింగం ఎవరో గాజువాక, భీమవరం వెళితే చెబుతారంటూ సెటైర్లు..

|

Dec 29, 2020 | 4:39 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేతలు మూకుమ్మడి దాడి చేస్తున్నారు. నివర్ తుపాను కారణంగా పంట నష్టపోయిన..

పవన్‌పై ఏపీ మంత్రుల ముప్పేట దాడి.. బోడిలింగం ఎవరో గాజువాక, భీమవరం వెళితే చెబుతారంటూ సెటైర్లు..
Follow us on

Andhra Pradesh Politics: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేతలు మూకుమ్మడి దాడి చేస్తున్నారు. నివర్ తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జనసేన ఆధ్వర్యంలో సోమవారం నాడు కృష్ణా జిల్లా గుడివాడ, పెడన, మచిలీపట్నంలో ‘జై కిసాన్‌’ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోపు రైతులకు సాయం అందించకుంటే శాసనసభను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో స్పందించిన మంత్రులు.. పవన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయనను టార్గెట్ చేస్తూ కౌంటర్లు వేస్తున్నారు.

బోడిలింగం ఎవరో వాళ్లు చెబుతారు..
తనను బోడి లింగం అంటూ సంబోధించిన జనసేనాని పవన్‌పై మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘బోడి లింగం ఎవరో గాజువాక, భీమవరం వెళితే చెబుతారు.. గుడివాడ, బందరులో శివలింగాలంటే ఎవరో చెబుతారు..’ అంటూ కొడాలి నాని ఎద్దేవా చేశారు. పవన్ బోడి లింగం కాబట్టే గత ఎన్నికల్లో జనం ఆయన్ని కిందపేడేశారని వ్యాఖ్యానించారు. జగన్‌ను శివలింగమని నెత్తిన పెట్టుకున్నారని అన్నారు. పవన్ లాంటి వారు రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. ప్యాకేజీ తీసుకుని స్క్రిప్ట్ చదవి వెళ్లేవాడు పవన్ కళ్యాణ్ అంటూ ఘాటైన విమర్శలు చేశారు.

పార్ట్‌టైమ్ రాజకీయాలొద్దు..
తాజాగా మంత్రి ఆదిమూలపు సురేష్ పవన్‌పై మండిపడ్డారు. ‘రాజకీయాలు చేయాలనుకుంటే రాజకీయాలే చేయండి.. సినిమాలు చేయాలనుకుంటే సినిమాలు చేయండి. సినిమా సెట్టింగ్ రాజకీయాలు ఎప్పుడో పోయాయి.’ అంటూ పవన్‌కు మంత్రి హితోపదేశం చేశారు. లేదంటే తమ నాయకుడు జగన్‌లా పాదయాత్ర అయినా చేయండని సూచించారు. ఇలా పార్ట్‌టైమ్ టైమ్ పొలిటీషియన్‌లా ఉండొద్దంటూ చురకలంటించారు. ‘కరోనా టైమ్‌లో కనబడరు.. మామూలు టైమ్‌లో కనబడరు.. ఏ పార్టీకి సపోర్ట్ చేస్తాడో ఆయనకే తెలియదు. ఆయన పార్టీ నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యేని కూడా కాపాడుకోలేకపోయాడు. ఆయన ఇంకేం రాజకీయాలు చేస్తాడు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

పవన్‌కు మంత్రి మేకపాటి సూటి ప్రశ్న..
ఇక మేకపాటి గౌతం రెడ్డి సైతం పవన్ తీరును తూర్పారబట్టారు. ఆయనకు సూటి ప్రశ్న సంధించారు. గత టీడీపీ ప్రభుత్వం రుణమాఫీ చేసిన విధానంపై ఏ విధంగా స్పందించారంటూ పవన్‌ను మంత్రి గౌతమ్ నిలదీశారు. కోవిడ్ టైమ్‌లో ఎక్కడ ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ముట్టడిస్తామన్న పవన్ కళ్యాణ్ మాటలను ఎవరూ విశ్వసించరని అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం సీఎం జగన్ ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగారని మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పుకొచ్చారు.

వారికి క్షమాపణలు చెప్పాలి..
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రమంత్రులైన కొడాలి నాని, పేర్ని నానికి క్షమాపణలు చెప్పాలని మంత్రి అవంతి డిమాండ్ చేశారు. మంత్రుల గురించి మాట్లాడేప్పుడు కొంచెమైనా విచక్షణ ఉండాలని చురకలంటించారు. ఆరు నెలలకు ఒకసారి దర్శనమిచ్చే పవన్.. రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. రైతులకు జగన్‌ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉందని మంత్రి అవంతి పేర్కొన్నారు.