రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. సాగు నీటి కష్టాలకు చెక్.. వచ్చే జూన్‌ నాటికి ఆ ప్రాజెక్ట్‌లన్నీ పూర్తి!

ఎల్‌నీనో కరువు పరిస్థితులను తట్టుకుని.. రైతులకు వ్యవసాయానికి కావాల్సిన నీటిని అందించేందుకు రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల పునరుద్దరణకు ఏపీ ప్రభుత్వం నడుకట్టింది. వచ్చే జూన్‌ నాటికి రాష్ట్రంలోని పెండింగ్‌లో ఉన్న ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి వాటి ద్వారా సాగు నీరు అందించాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మేరకు అవసరమైన నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. సాగు నీటి కష్టాలకు చెక్.. వచ్చే జూన్‌ నాటికి ఆ ప్రాజెక్ట్‌లన్నీ పూర్తి!
Ap Irrigation Revival

Updated on: Nov 11, 2026 | 6:21 PM

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఎత్తిపోతల పథకాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి జూన్ నాటికి వాటి ద్వారా నీరు విడుదల చేసేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఖరీఫ్‌కు పునరుద్ధరణ పరిధిలో ఉన్న 789 ఎత్తిపోతల పథకాల మరమ్మతులన్నీ ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో వాటి స్థితిగతులను పరిశీలించి, వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ, నిర్వహణ, ఇరిగేషన్ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు తదితర అంశాలపై చంద్రబాబు బుధవారం క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు.

జలహారతి కార్పొరేషన్ ద్వారా నిరంతర పర్యవేక్షణ

రాష్ట్రంలో 789 ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణకు రూ.632.07 కోట్లు అవసరమవుతాయని అధికారులు సీఎంకు వివరించారు. వీటి పునరుద్ధరణ ద్వారా 7.49 లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగునీటి సదుపాయం కల్పించవచ్చని తెలిపారు. ఇక ఎత్తిపోతల పథకాల నిర్వహణకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఎత్తిపోతల పథకాల పర్యవేక్షణ బాధ్యతను జలహారతి కార్పొరేషన్ ద్వారా చేపట్టాలని, ఇందుకోసం కార్పొరేషన్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు సీఎం. అవసరమైతే ప్రతి జిల్లాకు ఒక చీఫ్ ఇంజినీర్ లేదంటే సూపరింటెండింగ్ ఇంజినీర్‌ను నియమించి పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు.

ఇరిగేషన్ భూముల్లో 903.1 మెగావాట్ల సౌర విద్యుత్

జలవనరుల శాఖ పరిధిలో అందుబాటులో ఉన్న 5,565 ఎకరాల భూమిలో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు 4,061 ఎకరాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వీటి ద్వారా 877.3 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని వివరించారు. ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పరిధిలో 84 ప్రాంతాలను గుర్తించగా, వాటిలో 110 ఎకరాలను సౌర విద్యుత్ ప్లాంట్లకు వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. దీని ద్వారా 25.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని తెలిపారు. మొత్తంగా 4,171 ఎకరాల భూమిని సౌర విద్యుత్ ప్లాంట్లకు వినియోగించడం ద్వారా 903.1 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని అధికారులు వివరించారు.

కేవలం భూములకే పరిమితం కాకుండా కాలువలపై కూడా సౌర విద్యుత్, జలవిద్యుత్ ఉత్పత్తి అవకాశాలను పరిశీలించాలని సీఎం సూచించారు. సాగు సీజన్‌లో ఎత్తిపోతల పథకాలకు నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా ప్రణాళిక రూపొందించడంతో పాటు మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేయడం ద్వారా ఆదాయం పొందే విధానాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. రవాణా, విద్యుత్ ఉత్పత్తి, సౌర విద్యుత్, వ్యవసాయ రంగాలను అనుసంధానం చేయడం ద్వారా సంపద సృష్టికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మంగా తీసుకున్న 36 సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధులను వెంటనే విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నిర్దేశించుకున్న గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. వచ్చే రెండున్నరేళ్లలో ప్రభుత్వం నిర్దేశించుకున్న 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us