Andhra Pradesh: సీఐఐ సమ్మిట్‌లో ఏపీకి పెట్టుబడుల జాతర.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

విశాఖలో జరుగుతున్న సీఐఐ పెట్టుబడుల సదస్సు నేటితో ముగిసింది. ఈ సమ్మిట్‌కు దేశవిదేశాల నుంచి ప్రతినిధులు తరలివచ్చాయి. ఏపీకి ఈ సదస్సు ద్వారా భారీగా పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడుల వివరాలను సీఎం చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. వీటి ద్వారా లక్షలాదిమందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయన్నారు.

Andhra Pradesh: సీఐఐ సమ్మిట్‌లో ఏపీకి పెట్టుబడుల జాతర.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Chandrababu

Updated on: Nov 13, 2026 | 7:43 PM

విశాఖపట్నం వేదికగా రెండు రోజులుగా జరుగుతున్న సీఐఐ సమ్మిట్ సదస్సు ఇవాళ ముగిసింది. దేశ, విదేశాల నుంచి అనేక కంపెనీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడంపై ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ సదస్సు ద్వారా ఏపీకి అనేక పెట్టుబడులు తరలివచ్చాయి. లోకల్ కంపెనీల దగ్గర నుంచి అంతర్జాతీయ పరిశ్రమల వరకు.. క్లీన్ ఎనర్జీ రంగం దగ్గర నుంచి డేటా సెంటర్ల వరకు.. అన్ని రంగాల్లో పరిశ్రమలు ఏపీకి క్యూ కట్టాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకుంది ఏపీ ప్రభుత్వం. రెండు రోజుల సదస్సుకు 450మందికి పైగా విదేశీ ప్రతినిధులు రాగా.. దేశం నుంచి వచ్చిన ప్రతినిధులతో కలిపి మొత్తం 1400 మంది వరకూ హాజరయ్యారు. ఈ సదస్సులో జరిగిన ఒప్పందాలతో పాటు పారిశ్రామికవేత్తలతో చర్చల గురించి సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు.

ఈ సదస్సులో మొత్తం 303 ఎంవోయూలు జరగ్గా.. రూ.9.89లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. క్లీన్ ఎనర్జీ, మాన్యుపాక్చరింగ్, ఐటీ, టూరిజం, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్స్, ఫుడ్ ప్రాసెసింగ్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, పోర్ట్స్, ఏవియేషన్ రంగాల్లో పెట్టుబడులు తరలివచ్చాయి. 2024 జూన్‌లో కూటమి సర్కార్ ఏర్పాటు కాగా..  ఇప్పటికి రెండున్నరేళ్లు అవుతోంది. ఈ రెండున్నరేళ్లలో తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని? వాటిల్లో ఎన్ని కార్యరూపం దాల్చాయనే దానిపైనా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. రెండున్నరేళ్లలో రూ.32.49లక్షల కోట్ల పెట్టుబడులకు MoUలు కుదుర్చుకోగా..  రూ.17.1లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటికే పట్టాలెక్కాయి. ఏంవోయూ కుదర్చుకున్న పెట్టుబడుల్లో దాదాపు 74శాతం పెట్టుబడులు కార్యరూపం దాల్చాయి. CII సమ్మిట్‌తో భారీగాపెట్టుబడులు వచ్చాయని, 714 ప్రాజెక్టులతో 19.3 లక్షల ఉద్యోగాల సృష్టి జరగనుందని చంద్రబాబు అన్నారు.  303 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని, సమ్మిట్‌కు ముందు 5 దేశాల్లో 11 రోడ్‌ షోలు నిర్వహించామన్నారు. ప్రాంతీయ సదస్సుల్లో 194 ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా రూ.86,522 కోట్ల ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. ప్రాంతీయ, ప్రధాన సదస్సులతో 3.48 లక్షల ఉద్యోగాలు రానున్నాయన్నారు. కియా సంస్థ రూ.18,878 కోట్లతో ఉత్పత్తి సామర్థాన్ని పెంచబోతోందన్నారు. కియా ద్వారా 12 వేల ఉద్యోగాలు వస్తాయని,  క్వాంటమ్ టెక్నాలజీకి అమరావతిలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. అనంతపురంలో రక్షణ రంగ పరిశ్రమలకు ప్రోత్సాహకం కల్పిస్తామని చంద్రబాబు తెలియజేశారు.

అటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపీలో జరుగుతున్న అభివృద్ధిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ క్లారిటీ ఇచ్చారు. ఏపీలో వేగంగా హైవేలు, కారిడార్ల నిర్మాణం జరుగుతోందన్నారు. హైదరాబాద్ టూ మచిలీపట్నం వయా విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే.. రాయపూర్ -విశాఖ కారిడార్ ప్రాజెక్ట్ 96శాతం పూర్తి అయ్యాయన్నారు. విశాఖ-మచిలీపట్నం కారిడార్.. బెంగళూరు – విజయవాడ కారిడార్.. ఖరగ్‌పూర్ – అమరావతి కారిడార్.. విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల అభివృద్ధితో పాటు అనేక ప్రాజెక్టులు చేపట్టామన్నారు నితిన్ గడ్కరీ. అవన్నీ పూర్తైతే ఏపీ స్వరూపమే మారిపోతుందన్నారు. అటు విజన్, పాలసీ మేకింగ్‌లో చంద్రబాబుని GPS లాంటి వ్యక్తిగా పోల్చారు మంత్రి లోకేష్‌. లక్ష్యం చూపించేది చంద్రబాబు అయితే.. ఆ మార్గంలో వెళ్లేది తాము అని అన్నారు. పరిశ్రమలు పెట్టేందుకు ఎవరు ముందుకు వచ్చినా ప్రోత్సహిస్తామని భరోసా ఇచ్చారు. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీని ఏపీకి తరలించే అంశంపై మంత్రి లోకేష్, నటుడు రానా మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. పరిశ్రమను విశాఖకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని లోకేష్ అన్నారు. తాను కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్నారు రానా.

Loading...
Unable to load recommendations.
Follow Us