వేలానికి వెంకన్న ఆస్తులు..టీటీడీ సంచలన నిర్ణయం

|

May 23, 2020 | 4:23 PM

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీవారికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న కోట్లాది విలువైన భూములను అమ్మేందుకు నిర్ణయించుకుంది.

వేలానికి వెంకన్న ఆస్తులు..టీటీడీ సంచలన నిర్ణయం
Follow us on

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీవారికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న కోట్లాది విలువైన భూములను అమ్మేందుకు నిర్ణయించుకుంది. తమిళనాడులోని 23 చోట్ల ఉన్న శ్రీవారి ఆస్తులను విక్రయించేందుకు దేవస్థానం బోర్డు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు టీటీడీ నోటిఫికేషన్ జారి చేసింది. నిరార్ధకమైన ఆస్తుల విక్రయాల ద్వారా రూ. 100 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న భూములు నిరుపయోగంగా ఉన్నయని భావించిన టీటీడీ వాటిని వేలానికి పెట్టేందుకు నిర్ణయించుకుంది. ఈ మేరకు గతంలోనే దేవస్థానం పాలక మండలిలో తీర్మానం చేశారు.

వెంకన్న ఆస్తుల అమ్మకం ప్రక్రియ విధివిధానాల కోసం అప్పట్లోనే 8 కమిటీలను ఏర్పాటు చేశారు. అందులోనూ టీమ్ ఏ, టీమ్ బీగా విభజించారు. ఇక స్థలాలను బహిరంగ వేలంలో అమ్మేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసే అధికారాలను టీటీడీ అధికారులకు అప్పగించారు. ఇదిలా ఉంటే, స్వామివారి ఆస్తుల అమ్మకంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్తులు అమ్ముకోవాల్సిన అగత్యం ఏంటని టీడీపీ, జనసేన నేతలు మండిపడుతున్నారు. దేవస్థానం భూములను ప్రజా ప్రయోజనాలకు అవసరమైన కార్యక్రమాల కోసం వినియోగించాలని, నిరుపయోగంగా ఉన్నాయనే సాకుతో అమ్మటం సరికాదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సీఎం జగన్‌కు లేఖ రాశారు.