Amaravati: అమరావతిలో ఆ నిర్మాణాల పరిస్థితి ఏంటి..? సీఆర్డీఏకు నివేదిక అందించనున్న ఐఐటీ నిపుణుల బృందం

|

Aug 04, 2024 | 8:33 AM

అమరావతిలో అసంపూర్తిగా మిగిలిన కట్టడాల పరిస్థితి ఏంటి ? ఆ నిర్మాణాలను కొనసాగించే అవకాశం ఉంటుందా ? లేక వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టాలా ? ఈ అంశంమీదే.. రెండ్రోజుల పాటు ఐఐటీ నిపుణుల బృందం రాజధాని ప్రాంతంలో పర్యటించింది. నివేదిక సిద్ధం చేసి సీఆర్డీఏకు ఇవ్వనుంది.

Amaravati: అమరావతిలో ఆ నిర్మాణాల పరిస్థితి ఏంటి..? సీఆర్డీఏకు నివేదిక అందించనున్న ఐఐటీ నిపుణుల బృందం
Amaravati
Follow us on

మధ్యలోనే ఆగిపోయిన కట్టడాల పటిష్టతను పరిశీలించేందుకు ఐఐటీ మద్రాస్‌ నిపుణుల బృందం అమరావతిలో పర్యటించింది. ఈ ప్రాంతంలో గత ఐదేళ్లుగా ఎండకు ఎండి, వానకు తడిసిన నిర్మాణాలను పరిశీలించింది. సెక్రటేరియట్‌, హెచ్‌వోడీ భవనాలు, హైకోర్టు నిర్మాణాల పటిష్ఠతపై ఈ బృందం అధ్యయనం చేయనుంది. ఐకానిక్‌ టవర్ల వద్ద రాఫ్ట్‌ ఫౌండేషన్‌ నిపుణులు పరిశీలించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో కలిసి నీటిలో మునిగిన నిర్మాణాల పరిశీలన చేపట్టారు. ఈ నిర్మాణాలను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత నిపుణుల బృందం సీఆర్డీఏకు నివేదిక ఇవ్వనుంది.

సచివాలయం, హెచ్​ఓడీ భవనాలు, హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణాలకు సంబంధించిన ఫౌండేషన్ బేస్‌మెంట్లను పరిశీలించారు నిపుణులు. ఐఐటీ మద్రాస్‌లోని స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రోఫెసర్ మెహర్ ప్రసాద్, కొరోజన్ విభాగంలో నిపుణుడైన ప్రోఫెసర్ రాధాకృష్ణ పిళ్లై, ఫౌండేషన్, మెటీరియల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన నిపుణుడు ప్రోఫెసర్ సుభాదీప్ బెనర్జీలు అమరావతిలోని ఈ భవనాలకు సంబంధించిన ర్యాఫ్ట్ ఫౌండేషన్‌ను పరిశీలించారు. ఎన్డీఆర్ఎఫ్​ బృందాలు ఏర్పాటు చేసిన బోట్లలో నీట మునిగిన సచివాలయం, హెచ్‌ఓడీ ఐకానిక్ టవర్లకు చెందిన పిల్లర్లు, రాఫ్ట్ ఫౌండేషన్ ప్రాంతానికి వెళ్లారు.

ఐదేళ్లుగా నీటిలోనే ఉన్న నిర్మాణాలు..

ఈ రాఫ్ట్ ఫౌండేషన్ వేసిన ప్రాంతం అంతా గడచిన ఐదేళ్లుగా పూర్తిగా నీటిలో మునిగి ఉన్నట్టు నిపుణులు గుర్తించారు. ఈ ప్రాంతంలో దాదాపు అర టీఎంసీకి పైగా నీరు నిల్వ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నీటిలో మునిగిపోయి ఉన్న రాఫ్ట్ పౌండేషన్, బేస్ మెంట్ల వద్ద నిర్మాణాల్లో వినియోగించిన ఇనుము పూర్తిగా తుప్పు పట్టిందని.. వాటి పటిష్టతపై సాంకేతికంగా పరీక్షలు నిర్వహించాల్సి ఉందని నిపుణులు భావిస్తున్నారు. నీట మునిగిన ప్రాంతాల్లో భూ సామర్థ్యపు పరీక్షలు నిర్వహించాల్సి ఉందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఐకానిక్ టవర్లు దాదాపు 40 నుంచి 46 అంతస్తులుగా నిర్మించాలని ప్రణాళిక చేసినందున ఆ మేరకు ఎంత భారాన్ని ప్రస్తుతం ఉన్న ప్రాంతం మోయగలుగుతుందన్న దానిపై పరీక్షలు చేయాల్సి ఉందని తెలుస్తోంది.

కట్టడాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్ నిపుణులు

ఫౌండేషన్ దశలో నిలిచిపోయిన సెక్రటేరియట్, శాఖాధిపతుల టవర్లు, హైకోర్టు కట్టడాలకు సంబంధించి పునాదుల సామర్ధ్యాన్ని పరిశీలించే బాధ్యతను ప్రభుత్వం ఐఐటీ మద్రాస్‌కు అప్పగించారు. ఇక ఐఏఎస్‌ అధికారుల నివాసాలు, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్ల నాణ్యతను అంచనా వేసే బాధ్యతను హైదరాబాద్‌ ఐఐటీకి అప్పగించింది. వీరు రెండు రోజుల పాటు అమరావతిలో పర్యటించి ఆయా కట్టడాలను పరిశీలించి వాటి నాణ్యత, సామర్థ్యాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..