రాజధాని అమరావతికి రైలు కనెక్టివిటీ.. ఎప్పుడు పూర్తి అవుతుందంటే..?

రాజధాని అమరావతికి రైలు కనెక్టివిటీ 2028 లేదా 2029 నాటికి సిద్ధం కానుంది. రూ. 2,047 కోట్ల అంచనా వ్యయంతో 58.10 కి.మీ. పొడవైన ఈ రైలు మార్గాన్ని నాలుగు ప్యాకేజీలుగా నిర్మిస్తున్నారు. ఆధునిక సౌకర్యాలతో కూడిన 9 కొత్త స్టేషన్లు, సరుకు రవాణా కోసం పరిటాల గూడ్స్ టెర్మినల్ ఏర్పాటు చేయనున్నారు.

రాజధాని అమరావతికి రైలు కనెక్టివిటీ.. ఎప్పుడు పూర్తి అవుతుందంటే..?
Amaravati railway connectivity

Updated on: Oct 12, 2026 | 2:50 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రైలు కనెక్టివిటీ కల్పించే బృహత్తర ప్రాజెక్టు శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. 2028 చివరి నాటికి లేదా 2029 ప్రారంభానికి రైల్వే లైన్ పనులను పూర్తి చేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఒక ప్రాంతం అభివృద్ధికి కనెక్టివిటీ అత్యంత ప్రధానం కాబట్టి, అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినప్పటి నుంచే కనెక్టివిటీపై దృష్టి సారించారు. కేంద్రంతో సంప్రదింపుల తర్వాత 2018లోనే ఈ రైల్వే లైన్‌కు మంజూరు లభించింది. సర్వేలు పూర్తి చేసి మార్గాన్ని ఖరారు చేశారు. అయితే, తర్వాత మారిన ప్రభుత్వాల వల్ల ఈ ప్రాజెక్టు కొంత జాప్యానికి గురైంది. 2024లో కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడగానే రైల్వే శాఖతో మాట్లాడి అమరావతి రైల్వే లైన్‌ను తిరిగి పట్టాలెక్కించింది. తొలుత డబుల్ ట్రాక్ అనుకున్నప్పటికీ, ప్రస్తుతం సింగిల్ లైన్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది.

ప్రాజెక్టు వివరాలు, అంచనా వ్యయం

అమరావతి రైల్వే లైన్ ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం వద్ద ప్రారంభమై అమరావతి మీదుగా నంబూరు వరకు విస్తరించనుంది. ఈ రైల్వే లైన్ మొత్తం పొడవు 58.10 కిలోమీటర్లు. దీని నిర్మాణానికి అంచనా వ్యయం రూ.2,047 కోట్లుగా ఉంది. ఈ ప్రాజెక్టును నాలుగు ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టనున్నారు.

ప్యాకేజీ 1:ఎర్రుపాలెం నుంచి పెదపురం వరకు 3.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీనికి సంబంధించిన భూసేకరణ, టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయి కాంట్రాక్టర్ సంస్థను ఎంపిక చేశారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.

ప్యాకేజీ 2: పెదపురం నుంచి కృష్ణా నదిపై నిర్మించే బ్రిడ్జి వరకు ఉంటుంది. దీని కోసం 152.40 హెక్టార్ల భూమి అవసరం కాగా, భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. టెండర్లు కూడా పూర్తయ్యాయి.

ప్యాకేజీ 3: కృష్ణా నదిపై 3.23 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి నిర్మాణంతో పాటు అక్కడి నుంచి వడ్డమాను వరకు రైల్వే లైన్ నిర్మాణం ఉంటుంది. ఇది రాజధాని రెండో విడత భూ సమీకరణ పరిధిలోకి వస్తుంది. టెండర్లు పూర్తయ్యాయి.

ప్యాకేజీ 4: వడ్డమాను నుంచి నంబూరు వరకు 28.35 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఈ ప్యాకేజీ పూర్తిగా రాజధాని పరిధిలోకి వస్తుంది. పల్నాడు జిల్లాలో 48.527 హెక్టార్లు, గుంటూరు జిల్లాలో 181.16 హెక్టార్ల భూమి అవసరం. దీని భూసేకరణను CRDA చేపడుతోంది. రూ.599.33 కోట్ల విలువైన ఈ టెండర్లకు నవంబర్ 23 వరకు గడువు విధించారు. ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్) మోడల్‌లో రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తాడికొండ, కొప్పురావూరు ప్రాంతాల్లో భూములు సమీకరిస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా ఈ రూట్ లోనే వెళ్తున్నందున, రెండింటికీ ఒకేసారి భూ సమీకరణ చేస్తున్నారు.

అత్యాధునిక స్టేషన్లు, సౌకర్యాలు అమరావతి రైల్వే లైన్ పరిధిలో 9 కొత్త స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. పెదపురం, చెన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరు వంటి ప్రదేశాల్లో ఈ స్టేషన్లు రానున్నాయి. ఈ స్టేషన్లలో విద్యుదీకరణ, సరికొత్త సిగ్నలింగ్ వ్యవస్థ, ఆధునిక స్టేషన్ భవనాలు, అంతర్జాతీయ స్థాయి ప్లాట్‌ఫామ్‌లు వంటి అధునాతన సౌకర్యాలను కల్పించనున్నారు. ప్రమాదాలను నిరోధించే కవచ్ టెక్నాలజీని కూడా ఈ స్టేషన్లలో పొందుపరచనున్నారు.

పరిటాల గూడ్స్ టెర్మినల్: వాణిజ్యపరమైన ప్రయోజనాలు

ఈ రైల్వే లైన్ కేవలం ప్రయాణికుల రవాణాకే పరిమితం కాకుండా, సరుకు రవాణాకు కూడా కీలకమైన మౌలిక సదుపాయంగా మారనుంది. పరిటాల స్టేషన్ దగ్గర ప్రత్యేకంగా గూడ్స్ టెర్మినల్‌ను నిర్మించనున్నారు. ఇది కృష్ణపట్నం పోర్టు, కాకినాడ పోర్టులతో పాటు నిర్మాణంలో ఉన్న బందరు (మచిలీపట్నం) పోర్టుతో కనెక్టివిటీని కలిగి ఉండనుంది. దీని వల్ల అమరావతి వాణిజ్యపరంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

భవిష్యత్ అనుసంధాన సూచనలు

నిపుణుల సూచనల ప్రకారం, అమరావతి నుంచి పెదకూరపాడుకు లింక్ లైన్ నిర్మిస్తే బీబీ నగర్, గుంటూరు లైన్‌తో అనుసంధానం సాధ్యమై, సికింద్రాబాద్ నుంచి అమరావతికి నేరుగా రైళ్లు నడపవచ్చు. నరసరావుపేట, సత్తెనపల్లి లింక్ లైన్ వేస్తే రాయలసీమ, బెంగళూరు నుంచి రైళ్లు నేరుగా రాజధానికి చేరుకోవచ్చు. వేజండ్ల-చుండూరు రూట్‌ను వినియోగంలోకి తెస్తే చెన్నైకి కనెక్టివిటీ మెరుగుపడుతుంది. స్టేషన్లలో ప్లాట్‌ఫామ్‌ల పొడవును 450 మీటర్ల నుంచి 600 మీటర్లకు పెంచాలని కూడా సూచనలు ఉన్నాయి. రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతున్న ఈ తరుణంలో, రోడ్డు కనెక్టివిటీతో పాటు రైలు కనెక్టివిటీ సిద్ధమవుతుండటం శుభపరిణామం. ఇక ఎయిర్ కనెక్టివిటీ కూడా పూర్తయితే అమరావతి భవిష్యత్ లో రాష్ట్రానికే మణిహారంగా నిలుస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us