Prakasam District: విద్యార్ధినిలకు హాస్టల్ ఆవరణలో కనిపించిన వింత జంతువు.. ఏంటిది..?

| Edited By: Ram Naramaneni

Aug 02, 2024 | 12:37 PM

ఇటు జనావాసాలకు, అటు అటవీప్రాంతానికి సమీపంలో ఉన్న తమ హాస్టల్‌లో అప్పుడప్పుడు చిన్నచిన్న పెంపుడు జంతువులు రావడం సహజమే అయినా ఈ జంతువు మాత్రం చిన్నసైజు డైనోసార్‌లా ఉండటంతో విద్యార్దినులు దాన్ని చూసి భయంతో పరుగులు పెట్టారు. ఆ తర్వాత....

Prakasam District: విద్యార్ధినిలకు హాస్టల్ ఆవరణలో కనిపించిన వింత జంతువు.. ఏంటిది..?
Alugu
Follow us on

ఉదయాన్ని కాలేజికి వెళ్ళేందుకు సిద్దమై హాస్టల్‌ నుంచి బయటకు వచ్చిన ఇంజనీరింగ్‌ విద్యార్ధినిలకు హాస్టల్ ఆవరణలో ఒంటినిండా పొలుసులతో భయం గొలిపే విధంగా ఉన్న జంతువు కనిపించింది. ఇటు జనావాసాలకు, అటు అటవీప్రాంతానికి సమీపంలో ఉన్న తమ హాస్టల్‌లో అప్పుడప్పుడు చిన్నచిన్న పెంపుడు జంతువులు రావడం సహజమే అయినా ఈ జంతువు మాత్రం చిన్నసైజు డైనోసార్‌లా ఉండటంతో విద్యార్దినులు దాన్ని చూసి భయంతో పరుగులు పెట్టారు… హాస్టల్‌ ఆవరణలో కలియతిరుగుతూ పురుగులను, చీమలను పట్టుకుని తింటున్న ఆ జీవి అరుదైన జాతికి చెందిన అలుగుగా కొందరు గుర్తించారు. వెంటనే ఈ సమాచారాన్ని హాస్టల్‌ సిబ్బందికి చేరవేశారు.

ఇలా చిక్కింది…

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామ సమీపంలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలోని లేడీస్ హాస్టల్‌లో అరుదైన జంతుజాతికి చెందిన అలుగు ప్రత్యక్షమైంది. అలుగు జంతువు హాస్టల్ ఆవరణలో తిరుగుతుండటంతో విద్యార్ధినిలు భయాందోళనలకు గురయ్యారు. ఒంటి నిండా పొలుసులతో బోన్‌సాయ్‌ డైనోసార్‌లాగా ఉన్న అలుగు జంతువును చూసి విద్యార్ధినిలు తొలుత ఆందోళన చెందారు… అయితే అలుగు హానికర జంతువు కాదని తెలుసుకుని అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే హాస్టల్‌ వాచ్మెన్‌, సిబ్బందిని అలుగును పట్టుకుని ఓ ఖాళీ డ్రమ్ములో ఉంచారు… దానికి కూరగాయలను ఆహారంగా ఉంచారు… కాలేజీ యాజమాన్యానికి సమాచారాన్ని అందచేశారు… అలుగు జంతువును పరిశీలించిన కాలేజి యాజమాన్యం మార్కాపురం ఫారెస్ట్ ఆఫీస్ సమాచారం ఇచ్చారు… సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది కాలేజిలో పట్టుకున్న అలుగును స్వాధీనం చేసుకున్నారు… ఈ అలుగును దోర్నాల ఫారెస్ట్ లో వదులుతామని కాలేజీ యాజమాన్యానికి తెలిపారు ఫారెస్ట్ అధికారులు.

ఒక్కో అలుగు కోటి రూపాయలు పలుకుతుంది…

ప్రపంచంలో ఎక్కువగా అక్రమ రవాణా జరుగుతున్న జంతువుల్లో అలుగు ప్రధమ స్థానంలో ఉంది… సాధు జంతువుగా ఉన్న అలుగును పట్టుకోవడం సులువు కావడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో దీనికి ఎక్కువగా డిమాండ్‌ ఉంది… దీంతో అలుగును అక్రమ రవాణా చేసేందుకు స్మగ్లర్లు ఎక్కువగా విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు… ఒక్కో అలుగు 80 లక్షల వరకు ధర పలుకుతుందట… కొన్ని సందర్భాల్లో కోటి రూపాయలకు పైగా దీని ధర ఉంటుందట… ప్రధానంగా చైనా, వియత్నాంలలో దీని మాంసానికి డిమాండ్‌ ఎక్కువ… అలాగే విదేశాల్లో ఔషధ ప్రయోజనాల కోసం ఈ అలుగును వినియోగిస్తారు… ఎంతో ధృడంగా ఉండే దీని ఒంటిపై ఉన్న పొలుసులతో వివిధ రకాల ఆభరణాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, వాలెట్లు తయారు చేస్తారు… చీమలు, చెదపురుగులను తింటూ అలుగు తన మనుగడ సాగిస్తుంది… ఇతర జంతువులకు కానీ, మనుషులకు కానీ ఎలాంటి హానీ చేయదు… ఎవరైనా తనను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ముడుచుకుపోతుంది… దీంతో దీన్ని ఈజీగా పట్టుకుని అక్రమ రవాణా చేస్తున్నారు… ఈ జంతువుకు భయం కూడా ఎక్కువే… వీటిని విక్రయించేందుకు స్మగ్లర్లు సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్స్ కూడా ఉపయోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..