సాధారణంగా జంతువులను చాలా ప్రేమగా చూసుకుంటాం. కుక్క, పిల్లి, గుర్రం లాంటి మూగజీవాలను ఇంట్లో పెంచుకుంటూ తమ ప్రాణం కంటే మిన్నగా, అల్లారుముద్దుగా చూసుకుంటూ ఉంటారు కొంతమంది. ఇక వాటికేదైనా జరిగితే అస్సలు తట్టుకోలేరు. కానీ అమెరికా కొలరాడోలో ఓ గుర్రం పట్ల ఇందుకు భిన్నంగా ప్రవర్తించారు ఓ జంట. మూగజంతువనే జాలి కూడా లేకుండా క్రూరంగా ప్రవర్తించారు. పూర్తిగా మంచు పేరుకుపోయిన రహదారిపై గుర్రాన్ని ట్రక్కుకు కట్టేసి స్పీడ్‌గా నడుపుతూ పైశాచికత్వం ప్రదర్శించారు. పాపం ఆ మూగజీవి కారు వేగాన్ని అందుకోలేక విలవిలలాడిపోయింది. ఎంత విడిపించుకుందామన్నా లాభం లేకపోయింది. కొంతదూరం పరిగెత్తాక అలసిపోయిన ఆ గుర్రం చివరికి నీరసించి కిందపడిపోయింది.
ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పలువురు నెటిజన్లు ఆ జంటపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొలరాడోకు చెందిన జాన్, అంబర్ సాల్డేట్ దంపతులు ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించిన అధికారులు. గుర్రానికి వారి నుంచి విముక్తి కల్పించి వారిపై కేసు నమోదు చేశారు. ఆ దంపతులు జనవరిలో కోర్టుకు హాజరుకావలసి ఉంది. చేసిందంతా చేశాక ఇప్పుడు తీరిగ్గా కళ్లు తెరిచిన ఆ జంట తమ తప్పు తెలుసుకొని క్షమాపణలు కోరారు.