Bangladesh Election: షేక్ హసీనా మళ్లీ బంగ్లాదేశ్ ప్రధాని అవుతారా..? మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..

|

Jan 06, 2024 | 12:06 PM

బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌ ఎన్నికలకు సర్వం సిద్ధమయ్యింది. ఆదివారం(జనవరి 7) నాడు బంగ్లాదేశ్ పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ దేశంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికలను బహిష్కరించాలని ప్రతిపక్షాలు పిలుపునివ్వడంతో ఆందోళనాకారులు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున హింసాకాండకు పాల్పడుతున్నారు.

Bangladesh Election: షేక్ హసీనా మళ్లీ బంగ్లాదేశ్ ప్రధాని అవుతారా..? మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
Bangladesh PM Shaik Hasina (File Photo)
Follow us on

బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌ ఎన్నికలకు సర్వం సిద్ధమయ్యింది. ఆదివారం(జనవరి 7) నాడు బంగ్లాదేశ్ పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ దేశంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికలను బహిష్కరించాలని ప్రతిపక్షాలు పిలుపునివ్వడంతో ఆందోళనాకారులు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున హింసాకాండకు పాల్పడుతున్నారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ప్యాసింజర్‌ రైలుకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. రైలులో నాలుగు కోచ్‌లు పూర్తిగా దహనమైపోయాయి. ఘటన జరిగిన సమయంలో రైళ్లో దాదాపు 300 మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ ప్రజలను భయపెట్టేందుకే ఆందోళనకారులు రైలుకు నిప్పు పెట్టారని తెలుస్తోంది.

భారీ బందోబస్తు ఏర్పాట్లు..

హింసాత్మక ఘటనల మధ్య ఆదివారంనాటి బంగ్లాదేశ్ 12వ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆ దేశంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. జనవరి 3 తేదీ నుంచి జనవరి 10 వరకు ఎన్నికలు జరిగే అన్ని ప్రాంతాల్లో భారీఎత్తున భద్రతా బలగాలను మోహరిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్‌పీ) ఎన్నికలను బహిష్కరించడంతో ఎన్నికలను సజావుగా నిర్వహించడం అక్కడి అధికార యంత్రాంగానికి కత్తిమీద సాములా తయారయ్యింది. రాజకీయ ప్రమేయం లేని తాత్కాలిక తటస్థ ప్రభుత్వం చేత ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని బీఎన్పీ‌తో పాటు దాని మిత్రపక్షాలు డిమాండ్ చేశాయి. షేక్ హసీనా ప్రభుత్వంలో ఎన్నికలు పారదర్శకంగా జరిగే అవకాశం లేదన్నది ఖలీదా జియా ఆరోపణ. అయితే తాత్కాలిక తటస్థ ప్రభుత్వ హయాంలో ఎన్నికలు నిర్వహించాలన్న బీఎన్పీ డిమాండ్‌ను షేక్ హసీనా సర్కారు తోసిపుచ్చింది. ఓటమి భయంతోనే ప్రతిపక్షాలు ఎన్నికలను బహిష్కరిస్తున్నాయన్నది అవామీ లీగ్ ఆరోపణ.

300 సీట్లకు ఎన్నికలు..

బంగ్లాదేశ్ పార్లమెంటులో మొత్తం 350 సీట్లు ఉండగా.. ఇందులో 300 మంది సభ్యులను ప్రత్యక్ష ఓటింగ్ విధానంలో ఓటర్లు ఎన్నుకుంటారు. మిగిలిన 50 స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయగా.. ఎన్నికల్లో గెలుపొందిన వారి ఓటింగ్‌తో వీరిని పరోక్ష ఎన్నికల విధానంలో ఎన్నుకుంటారు. ఇప్పుడు 300 మంది సభ్యులను ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దాదాపు 18 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1970 మంది అభ్యర్థులు బరిలో నిలుస్తుండగా.. వీరిలో 90 మంది మహిళలు, 79 మంది మైనార్టీలు కూడా ఉన్నారు. 28 పార్టీలకు చెందిన అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. అవామీ లీగ్ పార్టీ నుంచి అత్యధికంగా 266 సీట్లలో అభ్యర్థులు పోటీచేస్తున్నారు. జాతీయ పార్టీ (జేపీ) కూడా 265 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. 1971లో పాకిస్థాన్ దేశం నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా బంగ్లాదేశ్ ఆవిర్భవించినప్పటి నుంచి ఆ దేశ పార్లమెంటుకు ఇప్పటి వరకు 11 సార్లు సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు.

అంతర్జాతీయ ఎన్నికల పరిశీలక బృందంలో భారత సభ్యులు..

బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని పలు పశ్చిమ దేశాలు షేక్ హసీనా సర్కారుపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో ఎన్నికల సరళని పర్యవేక్షించేందుకు అంతర్జాతీయ ఎన్నికల పరిశీలకుల బృందం ఇప్పటికే ఆ దేశ రాజధాని ఢాకాకు చేరుకుంది. భారత ఎన్నికల కమిషన్‌కు చెందిన ముగ్గురు సభ్యులు కూడా ఇందులో ప్రాతినిధ్యంవహిస్తున్నారు.

వరుసగా నాలుగోసారి ప్రధాని పీఠంపై షేక్ హసీనా గురి..

ప్రస్తుత షేక్ హసీనా సారథ్యంలోని ప్రస్తుత అవామీ లీగ్ ప్రభుత్వ పదవీకాలం ఈ నెల 29వ తేదీతో ముగియనుంది. 2009 నుంచి షేక్ హసీనా ఆ దేశ ప్రధానిగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి వరుసగా నాలుగోసారి బంగ్లాదేశ్ ప్రధాని కావాలని షేక్ హసీనా ఉవ్విళ్లూరుతున్నారు. ప్రతిపక్షాలు ఎన్నికలను బహిష్కరించడంతో ఈ ఎన్నికల్లో ఆమె విజయం ఖాయంగా తెలుస్తోంది. 1996లో షేక్ హసీనా తొలిసారి బంగ్లాదేశ్ ప్రధాని అయ్యారు. అప్పటి నుంచి ఆమె భారత్‌తో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ సుస్థిరత కారణంగానే బంగ్లాదేశ్ గత కొన్నేళ్లుగా మెరుగైన ఆర్థిక పురోగతి సాధిస్తోంది.