అమ్మకు దూరమై..అనంత లోకాలకు

| Edited By: Srinu

Nov 20, 2019 | 7:42 PM

సిద్దిపేట జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కనిపెంచిన తల్లికి దూరంగా ఉండాల్సి వచ్చిందనే మనస్తాపంతో ఓ యువకుడు ఏకంగా ఈ లోకాన్నే వదిలివెళ్లాడు. జిల్లాలోని జగదేవపూర్‌ మండలం తీగూల్‌ గ్రామానికి చెందిన నవీన్‌ అనే యువకుడు తన గదిలోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. చెట్టంత ఎదిగిన కొడుకు చేరదీస్తాడని ఆశించిన తల్లికి చివరకు కడుపుకోత మిగిలింది. తీగూల్‌ గ్రామానికి చెందిన ఎల్లం నవీన్‌..చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు. […]

అమ్మకు దూరమై..అనంత లోకాలకు
Follow us on

సిద్దిపేట జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కనిపెంచిన తల్లికి దూరంగా ఉండాల్సి వచ్చిందనే మనస్తాపంతో ఓ యువకుడు ఏకంగా ఈ లోకాన్నే వదిలివెళ్లాడు. జిల్లాలోని జగదేవపూర్‌ మండలం తీగూల్‌ గ్రామానికి చెందిన నవీన్‌ అనే యువకుడు తన గదిలోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. చెట్టంత ఎదిగిన కొడుకు చేరదీస్తాడని ఆశించిన తల్లికి చివరకు కడుపుకోత మిగిలింది.
తీగూల్‌ గ్రామానికి చెందిన ఎల్లం నవీన్‌..చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు. నాటి నుంచి  తల్లి బాలమ్మ కూలి పనులు చేస్తూ..కొడుకు నవీన్‌, కూతురు వరాలును పెంచి పెద్ద చేసింది. తన ఇద్దరు పిల్లలకు అన్నీ తానై చదివించింది. కుమారుడిని ప్రయోజకుడిని చేయాలని ఆశపడింది. తల్లి ఆశలకు అనుగుణంగానే చిన్ననాటి నుండి కష్టపడి చదివిన నవీన్‌.. ఇటీవల టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన టీఆర్‌టీలో ఎస్టీటీ ఉద్యోగం సాధించాడు. కంగ్టి మండలం పర్తుతాండలోని ప్రాథమిక పాఠశాలలో పోస్టింగ్‌ వచ్చింది. అక్టోబర్‌ 30న విధుల్లో చేరాడు.
ఉద్యోగంలో చేరిన నవీన్..పర్తుతాండలోనే నివాసం ఉంటున్నాడు. మండలంలోని ఇతర గ్రామాల్లో ఇటీవల కొత్తగా చేరిన మరో ఇద్దరు ఉపాధ్యాయులు కూడా ఆయన గదిలో చేరారు. ఈ క్రమంలోనే ఈ నెల 18న యథావిధిగా అందరూ తమ తమ ఉద్యోగాలకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో గదికి వచ్చిన నవీన్‌ లోపల గడియ వేసుకుని ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. సాయంత్రం రూమ్‌కి వచ్చిన తోటి ఉపాధ్యాయులు ఎంత ప్రయత్నించినా నవీన్‌ తలుపు తీయకపోగా, లోపలి నుంచి ఉలుకు, పలుకు లేకపోవడంతో కంగారుపడి వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల ఆధ్వర్యంలో  గది తలుపులు పగులగొట్టి చూడగా..నవీన్‌ విగతజీవిగా కనిపించాడు. నవీన్‌ మృతదేహన్ని కిందకు దింపిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు నవీన్‌ రాసిన సూసైడ్‌ లేఖ లభించింది. అందులో తాను అమ్మకు దూరం కావాల్సి వచ్చిందనే బెంగతోనే చనిపోతున్నట్లుగా లేఖలో ఉందని ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు మరింత సమాచారం కోసం దర్యాప్తు చేపట్టారు.