ఎమ్మార్వో ఆఫీసులో పెట్రోల్‌ స్ప్రే ..!

| Edited By: Srinu

Nov 21, 2019 | 4:35 PM

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ ఎమ్మార్వో విజయారెడ్డిపై రైతు సురేష్‌ పెట్రోల్‌ పోసి, సజీవ దహనం చేసిన సంఘటన ఇంకా మర్చిపోలేదు. తాజాగా మరో తహసీల్దార్‌ కార్యాలయంలో రైతు పెట్రోల్‌తో దాడి చేశాడు. ఈ సంఘటన మరోమారు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. కరీంనగర్‌ జిల్లా లంబాడిపల్లెకి చెందిన కనకయ్య అనే రైతు తహసీల్దార్‌ కార్యాలయంలోని సిబ్బందిపై పెట్రోల్‌ చల్లాడు. దీంతో ఆఫీసులోని కంప్యూటర్లు, వీఆర్వో అనిత, కంప్యూటర్‌ ఆపరేటర్‌ జగదీష్‌, అటెండర్‌ దివ్య, ఇతర సిబ్బందిపై పెట్రోల్‌ […]

ఎమ్మార్వో ఆఫీసులో పెట్రోల్‌ స్ప్రే ..!
Follow us on

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ ఎమ్మార్వో విజయారెడ్డిపై రైతు సురేష్‌ పెట్రోల్‌ పోసి, సజీవ దహనం చేసిన సంఘటన ఇంకా మర్చిపోలేదు. తాజాగా మరో తహసీల్దార్‌ కార్యాలయంలో రైతు పెట్రోల్‌తో దాడి చేశాడు. ఈ సంఘటన మరోమారు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. కరీంనగర్‌ జిల్లా లంబాడిపల్లెకి చెందిన కనకయ్య అనే రైతు తహసీల్దార్‌ కార్యాలయంలోని సిబ్బందిపై పెట్రోల్‌ చల్లాడు. దీంతో ఆఫీసులోని కంప్యూటర్లు, వీఆర్వో అనిత, కంప్యూటర్‌ ఆపరేటర్‌ జగదీష్‌, అటెండర్‌ దివ్య, ఇతర సిబ్బందిపై పెట్రోల్‌ పడింది. ఇంతలో అతడిని మిగతా సిబ్బంది అడ్డుకున్నారు. అయితే, ఆ కార్యాలయ సిబ్బంది భూమి పట్టా మంజూరు చేయట్లేదని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. కనకయ్యకు 4.2 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, 18 గుంటలకే పాస్‌బుక్‌ ఇచ్చారని, మిగతా భూమికి సంబంధించిన పాస్‌బుక్‌ కోసం అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైన రైతు పెట్రోల్‌ దాడికి పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ భయానక వాతావరణం నెలకొంది. కాగా, అధికారులు మాత్రం కనకయ్య భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య భూ వివాదం ఉందని, విచారణ చేసిన తర్వాత రైతు కనకయ్యకు న్యాయం చేస్తామని ఆర్డీవో ఆనందరావు తెలిపారు.
జరిగిన విషయంపై జేసీ శ్యామ్‌ ప్రసాద్‌ లాల్‌..కలెక్టర్ సర్ఫరాజ్‌ అహ్మద్‌ దృష్టికి తీసుకెళ్లారు. కనకయ్యపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. కార్యాలయానికి చేరుకున్న పోలీసులు రైతు కనకయ్యను అదుపులోకి తీసుకున్నారు. రైతు చేసిన పనికి తహసీల్దార్‌ కార్యాలయంలో సిబ్బంది ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పని చేయలేమని వారు చెబుతున్నారు.