ఫలించిన వైద్యం..పిల్లల మర్రికి కొత్త ఊడలు..!

| Edited By: Srinu

Nov 20, 2019 | 7:35 PM

మహబూబ్‌నగర్‌ ః 18వ శతాబ్ధం ఆరంభం..1706వ సంవత్సరం…బీజాపూర్‌, హైదరాబాద్‌ సుబేదార్‌ అయినటువంటి నిజాం రాజు బిక్షఖాన్‌..హైదరాబాద్‌ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాడు. అప్పుడు మహబూబ్‌నగర్‌ జిల్లా నిజాం పాలనలోకి వెళ్లింది. ఈ ప్రాంతాన్ని పరిశీలించిన మహబూబ్‌ఖాన్‌ పేరు మీద మహబూబ్‌నగర్‌గా పేరు వాడుకలోకి వచ్చిందనేది చరిత్ర. మహబూబ్‌నగర్‌కు గల మరో పేరే పాలమూరు. పాలమూరు జిల్లాకే తలమానికం పిల్లలమర్రి. ఇప్పుడా పిల్లలమర్రి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. అధికారులు అందించిన సెలైన్‌ వైద్యం ఫలించి కొత్త చిగుర్లు వేస్తోంది. మహబూబ్‌నగర్‌ […]

ఫలించిన వైద్యం..పిల్లల మర్రికి కొత్త ఊడలు..!
Follow us on

మహబూబ్‌నగర్‌ ః 18వ శతాబ్ధం ఆరంభం..1706వ సంవత్సరం…బీజాపూర్‌, హైదరాబాద్‌ సుబేదార్‌ అయినటువంటి నిజాం రాజు బిక్షఖాన్‌..హైదరాబాద్‌ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాడు. అప్పుడు మహబూబ్‌నగర్‌ జిల్లా నిజాం పాలనలోకి వెళ్లింది. ఈ ప్రాంతాన్ని పరిశీలించిన మహబూబ్‌ఖాన్‌ పేరు మీద మహబూబ్‌నగర్‌గా పేరు వాడుకలోకి వచ్చిందనేది చరిత్ర. మహబూబ్‌నగర్‌కు గల మరో పేరే పాలమూరు. పాలమూరు జిల్లాకే తలమానికం పిల్లలమర్రి. ఇప్పుడా పిల్లలమర్రి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. అధికారులు అందించిన సెలైన్‌ వైద్యం ఫలించి కొత్త చిగుర్లు వేస్తోంది.
మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి 4 కి.మీ దూరంలో ఆసక్తి గొలిపే దృశ్యం ఒకటి కనిపిస్తుంది. అదే విశాలమైన వటవృక్షం. అదే పిల్లలమర్రిగా పిలువబడే మర్రి మహావృక్షం. ఒకే ఒక్క మర్రిచెట్టు నుండి దాని ఊడల ద్వారా 4 ఎకరాల పరిధిలో మర్రిచెట్లు ఏర్పడ్డాయి. అసలు మొదటి మర్రిచెట్టు మ్రానేదో ఎవరికీ తెలియదు. చివరికి ఎంతమంది శాస్త్రవేత్తలు ఎన్ని పరిశోధనలు జరిపినా ఫలితం మాత్రం శూన్యం. ఇక దూరం నుంచి చూస్తే..పచ్చని చెట్లకు నెలవైన చిన్న పర్వతంలా కనిపించే పిల్లల మర్రి సమీపిస్తున్న కొలది ఆకుపచ్చని అందాల గొడుగు లాగా కనిపిస్తుంది. దీని నీడలో కనీసం వెయ్యిమంది హాయిగా సేద తీరవచ్చు. 8 వందల ఏళ్ల వయసు కలిగిన ఈ మహావృక్షం తాలూకు కొమ్మలే ఊడల్లాగా పిల్లలై ఈ చెట్టుకు పిల్లలమర్రిగా పేరు వచ్చింది.
గత కొంతకాలంగా నిరాదరణకు గురైన పిల్లలమర్రి మహావృక్షం చెదలు పట్టి నిర్జీవంగా మారే పరిస్థితికి చేరింది. చారిత్రక సంపదగా పేరుగాంచిన మహావృక్షాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంగా పర్యాటక శాఖ, పురావస్తు శాఖా అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. గత రెండేళ్లుగా చెట్టుకు చికిత్స నందిస్తూ వచ్చారు. చెదలు పట్టి కుంగిపోతున్న ఊడలకు సెలైన్‌ బాటిళ్ల ద్వారా మందులు ఎక్కించారు. సెలైన్‌ చికిత్సపై మొదట్లో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేసినప్పటికీ సెలైన్‌ చికిత్స మంచి ఫలితాలనిచ్చింది. చెట్టును కాపాడుకోవాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్, అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చెట్టు ప్రాంగణంలోకి ఎవరినీ అనుమతించకుండా..అనేక స్లోగన్స్‌తో ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేశారు. అనంతరం చెట్టుకు సెలైన్‌ బాటిల్స్‌తో చికిత్స అందించారు. చెదలు పట్టిన పదుల సంఖ్యలో ఊడలకు ప్రత్యేకంగా పైపులు అమర్చి వాటికి కెమికల్స్‌ కలిపిన మట్టిని వాడారు. దీంతో రెండేళ్లలో దాదాపు 45 చోట్ల కొత్త ఊడలు ఏర్పడ్డాయి. ఇక పడిపోయిన రెండు భారీ ఊడలు సైతం మళ్లీ చిగురించాయి. అధికారుల ప్రయత్నం.. జీవం కోల్పోతున్న మహావృక్షానికి పూర్వ వైభవం తెచ్చింది. మళ్లీ చిగురిస్తున్న ఆకులతో, కొత్తగా ఏర్పడుతున్న ఊడలతో మహావృక్షం పచ్చగా కళకళలాడుతూ కనిపిస్తుంది.
దేశంలోనే మూడో అతిపెద్ద మహావృక్షంగా పేరుగాంచిన పిల్లల మర్రి సందర్శకులను సైతం ఎంతగానో ఆకర్షిస్తోంది. సెలవుదినాల్లో ముఖ్యంగా ఆదివారం రోజున పర్యాటకులతో ఈ ప్రాంతం రద్దీగా మారుతుంది. అయితే, పిల్లలమర్రి పరిసరాల్లో సదుపాయాలు సరిగా లేవనే ఆరోపణలు వస్తున్నాయి. పిల్లలమర్రిని పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయాలని, సందర్శకులకు అవసరమైన తాగునీరు, ఆహారం, చిన్న పిల్లలకు అవసరమైన ఆటలకు సంబంధించి మరిన్ని చర్యలు చేపట్టాలని పర్యాటకులు కోరుతున్నారు. పిల్లలమర్రి అభివృద్దితో పాలమూరు ప్రజలకు సైతం..ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.