Cyber Fraud: అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు

|

Jul 27, 2024 | 7:29 AM

కానీ ప్రస్తుతం చిన్న చిన్న పట్టణాలు, పల్లెల్లో కూడా సైబర్ నేరాల బాధితుల సంఖ్య పెరుగుతోంది. రోజురోజుకీ సైబర్‌ మోసాలకు గురవుతోన్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ) నేతృత్వంలో రాష్ట్రంలో ఏర్పాటైన సైబర్‌క్రైమ్‌ పోలీస్‌స్టేషన్లకు పెరుగుతోన్న ఫిర్యాదుల సంఖ్యే దీనికి సాక్ష్యంగా చెప్పొచ్చు. రోజురోజుకీ సైబర్‌ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో...

Cyber Fraud: అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
Cyber Fraud
Follow us on

ఎలాగైనా డబ్బు సంపాదించాలని అత్యాశ. అందుకు తోడు చేతిలో స్మార్ట్ ఫోన్‌. ప్రపంచంలో ఉన్న సమాచారమంతా అర చేతిలో వాలిపోతున్న రోజులు. స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తే రాత్రికి రాత్రి లక్షాదికారి కావొచ్చు. ఇదిగో ఈ అత్యాశనే కొందరు నేరస్థులు ఆయుధంగా మలుచుకుంటున్నారు. అమాయకులను బురిడి కొట్టించి లక్షలు దోచేస్తున్నారు. అయితే మొన్నటి వరకు ఇలాంటి నేరాలు కేవలం హైదరాబాద్‌, ముంబయి, బెంగళూరు వంటి పెద్ద పెద్ద పట్టణాలకు మాత్రమే పరిమితం అనుకునే వాళ్లం.

కానీ ప్రస్తుతం చిన్న చిన్న పట్టణాలు, పల్లెల్లో కూడా సైబర్ నేరాల బాధితుల సంఖ్య పెరుగుతోంది. రోజురోజుకీ సైబర్‌ మోసాలకు గురవుతోన్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ) నేతృత్వంలో రాష్ట్రంలో ఏర్పాటైన సైబర్‌క్రైమ్‌ పోలీస్‌స్టేషన్లకు పెరుగుతోన్న ఫిర్యాదుల సంఖ్యే దీనికి సాక్ష్యంగా చెప్పొచ్చు. రోజురోజుకీ సైబర్‌ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో మరో సైబర్‌క్రైమ్‌ పోలీస్ స్టేషన్స్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో ఎప్పటినుంచో ఈ ఠాణాలుండగా.. టీజీసీఎస్‌బీ నేతృత్వంలో వరంగల్, కరీంనగర్, రామగుండం, ఖమ్మం, సిద్దిపేట, నిజామాబాద్‌ కమిషనరేట్లలో వీటిని ఏర్పాటు చేశారు.

ఇలాంటి చిన్న చిన్న పట్టణాల్లో కూడా సైబర్‌ నేరాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం ప్రజల అత్యాశను ఆసరగా చేసుకొని మోసాలు పాల్పడుతున్నారు. తాజాగా తెలంగాణలోని నగరాల్లో జరిగిన ఉదాంతాలే దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మొన్నటికి మొన్న మంచిర్యాల జల్లా బెల్లంపల్లికి చెందిన ఓ వ్యాపారికి స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులకు సంబంధించి శిక్షణ ఇస్తామంటూ వాట్సాప్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. దీంతో వెంటనే స్పందించిన అతన్ని ‘ఓక్‌ట్రీ క్యాపిటల్‌ గ్రూప్‌’ అనే వాట్సాప్‌ గ్రూప్‌లో యాడ్‌ చేశారు. అనంతరం నెమ్మదిగా అతన్ని నమ్మించి పలు బ్యాంకు ఖాతాల్లోకి డబ్బును పంపించుకున్నారు. దీంతో కొంత కాలానికి డబ్బులు విత్‌ డ్రా చేసుకుందామనే సరికి 30 శాతం సర్వీస్‌ ట్యాక్స్‌తో పాటు 7.5 శాతం ఇన్‌కమ్‌ట్యాక్స్‌ చెల్లించమని అడగ్గానే అనుమానం వచ్చి రామగుండం సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే అప్పటికే అతను ఏకంగా రూ. 56 లక్షలు కోల్పోయాడు.

కాగా ఇలాంటి ఓ సంఘటన నిజామాబాద్‌లో కూడా జరిగింది. బ్లాక్‌ ట్రేడింగ్‌లో శిక్షణ పేరుతో డొంకేశ్వర్‌కు చెందిన రైల్వేఉద్యోగికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మెసేజ్‌ వచ్చింది. 100 రోజుల్లోనే డబ్బు డబుల్ అవుతుందని అనడంలో రూ. లక్ష పెట్టుబడి పెట్టాడు. అనంతరం రూ. 5 వేలు విత్‌డ్రా చేశాడు. లాభాలు ఎక్కువగా వస్తాయని ప్రచారం చేయడంతో మరో రూ. 35 లక్షలు పెట్టుబడి పెట్టాడు. తీరా మోసపోయానని తెలిసి నిజామాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

మోసపోకండి..

కేవలం మన అత్యాశనే ఆసారాగా ఇలాంటి నేరాలు పెరిగిపోతున్నాయి. నిజానికి స్టాక్ మార్కెట్‌లో ఒక్క రోజులో లక్షాధికారి కావడం అనేది అసాధ్యం. అందులోనూ ముక్కు ముహం తెలియని వ్యక్తులు చెప్పగానే డబ్బులు జమ చేయడం మరీ మూర్ఖత్వమే అవుతుంది. ఒకవేళ నిజంగానే స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే అందుకోసం ఎన్నో రకాల అథెంటికేషన్‌ సంస్థలు అందుబాటులో ఉన్నాయి. వాళ్లు కొంతమేర ఛార్జీలు వసూలు చేసి మీకు సలహాలు ఇస్తుంటారు. ఇక వాట్సాప్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే మెసేజ్‌ల విషయంలో ఏమాత్రం అనుమానం ఉన్నా స్పందిచక పోవడమే ఉత్తమం. అలాగే గుర్తు తెలియని గ్రూప్స్‌లో యాడ్‌ చేస్తే వెంటనే ఎగ్జిట్ అవ్వాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..