Telangana: ‘టచ్‌లో 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..’ సెగలు రేపుతోన్న కేసీఆర్ కామెంట్స్

|

Apr 24, 2024 | 1:53 PM

టీవీ9 లైవ్‌షోలో సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదన్నారు. కేసీఆర్‌ మాటల వెనక ఆంతర్యం ఏంటి అన్నది ఇప్పుడు అంతుబట్టడం లేదు.

Telangana: టచ్‌లో 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. సెగలు రేపుతోన్న కేసీఆర్ కామెంట్స్
KCR in TV9 Studio
Follow us on

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాంబు పేల్చారు. ఎప్పటికప్పుడు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందనే అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో కేసీఆర్ ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చేలా కామెంట్స్ చేశారు. టీవీ9 లైవ్‌షోలో అనేక అంశాలపై మాట్లాడిన కేసీఆర్ కాంగ్రెస్‌లోని 25 మంది ఎమ్మెల్యేలు తమతో కలిసి వస్తామని అంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అంతా గోలగోలగా ఉందని.. మీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ వారిలో మాట్లాడుతున్నారని గులాబీ బాస్ చెప్పడం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీస్తోంది. వాళ్లు కలిసి వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా ? అన్న ప్రశ్నకు ఏదైనా జరగొచ్చంటూ కేసీఆర్ చేసిన కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్‌ను మరింత హీటెక్కించాయి. కేసీఆర్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకమేనా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అసలు కేసీఆర్ వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

స్వయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని చెప్పడం సరికొత్త చర్చకు దారి తీస్తోంది. కేసీఆర్ చెప్పింది నిజమే అయితే.. ఆ 25 మంది ఎమ్మెల్యేలు ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ ప్రభుత్వంలో అసంతృప్తిగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు.. వారిలో బీఆర్ఎస్‌ నేతలతో టచ్‌లోకి వెళ్లింది ఎవరు ? అన్నది ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లోనూ ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఓ వైపు పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధిస్తామని కాంగ్రెస్ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో పక్కచూపులు చూసే నేతలు సొంత పార్టీ గెలుపు కోసం పని చేస్తారా ? అన్న అంశం కూడా కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారుతోంది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందని బీఆర్ఎస్ చెబుతుంటే.. కాంగ్రెస్ నేతలు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీ ఉండదని కౌంటర్ ఇస్తున్నారు. అంతేకాదు.. బీఆర్ఎస్ నుంచి 20-25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి వాళ్లు చెబుతున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ వర్గాల్లోనూ డిస్కషన్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే తాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టబోమని అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ప్రభుత్వం కూలిపోతే తాము నిలబెట్టమని అన్నారు. ఎన్నికల ద్వారానే తెలంగాణలో అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..