Corona Vaccine Distribution: దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీకి సర్వం సిద్ధం.. తెలంగాణలో టీకా లెక్క ఎలా ఉందంటే..!

కోవిషీల్డ్‌ టీకాను దేశం నలుమూలలకు సరఫరా చేసేందుకు రంగం సిద్ధమైంది.ఈ నేపథ్యంలో తెలంగాణలో కోవిడ్ టీకా పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

Corona Vaccine Distribution: దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీకి సర్వం సిద్ధం.. తెలంగాణలో టీకా లెక్క ఎలా ఉందంటే..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 04, 2021 | 7:56 PM

కరోనా మహమ్మారిని నుంచి త్వరలోనే దేశ ప్రజలు విముక్తి కలుగనుంది. కోవిడ్ టీకా అత్యవసర వినియోగానికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతులు ఇచ్చేసింది. మరోవైపు పుణేలోని సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌లో తయారయ్యే కోవిషీల్డ్‌ టీకాను దేశం నలుమూలలకు సరఫరా చేసేందుకు రంగం సిద్ధమైంది.ఈ నేపథ్యంలో తెలంగాణలో కోవిడ్ టీకా పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా అయిదు దశల్లో కొనసాగనున్న కరోనా టీకా పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ సిద్ధం చేసి ఉంచామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

సీరమ్‌ వారి కోవిషీల్డ్‌ టీకాను దేశం నలుమూలలకు సరఫరా చేసేందుకు రంగం సిద్ధమైంది. దీనితో పాటు మరేదైనా టీకా అందుబాటులోకి వస్తే ఈ రెండింటినీ కూడా అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. అందుబాటులో ఉన్న టీకాల సంఖ్య, లాజిస్టిక్స్‌… చూసుకొని రాష్ట్రాలకు పంపిణీని కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. కోవిడ్‌ టీకాలు ప్రస్తుతం అందరికీ కొత్తగా కనిపించినా, ఇతరత్రా టీకాల నిర్వహణ భారతీయులకు అనుభవమేనంటున్నారు ఆరోగ్య సిబ్బంది.

రాష్ట్రంలో అత్యవసర కరోనా టీకా 5 దశల్లో చేరనుంది. ఇవేంటో ఓసారి చూద్దాం…

  1. ప్రత్యేక ఇన్సులేటెడ్‌ కార్గో విమానాల్లో టీకాలు ముందుగా హైదరాబాద్ కోఠిలోని స్టేట్‌ వ్యాక్సిన్‌ సెంటర్‌కు చేరతాయి.
  2. స్టేట్‌ వ్యాక్సిన్‌ సెంటర్‌లో కోటిన్నర వ్యాక్సిన్ల నిల్వకు నాలుగు వాక్‌ ఇన్‌ కూలర్లు ఏర్పాటు చేశారు.
  3. స్టేట్‌ వ్యాక్సిన్‌ సెంటర్‌ నుంచి 10 రీజినల్‌ వ్యాక్సిన్‌ సెంటర్లకు టీకా తరలింపు చేస్తారు.
  4. రీజినల్‌ వ్యాక్సిన్‌ సెంటర్ల నుంచి జిల్లాల్లోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలకు కరోనా టీకాలను చేరవేస్తారు.
  5. అక్కడి నుంచి తెలంగాణలోని 10 వేల వ్యాక్సిన్‌ కేంద్రాలకు టీకా పంపిణీ చేయనున్నారు.

మన దేశంలో ఏటా దాదాపు 2.5 కోట్ల మంది నవజాత శిశువులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకాలు అందిస్తున్నారు. వీటన్నింటి ఉత్పత్తి, పంపిణీలకు సంబంధించి పక్కా ప్రణాళిక, వ్యవస్థలు ఇప్పటికే సిద్దంగా ఉన్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ సిద్ధం చేసి… పుణేలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేస్తున్న కోవిషీల్డ్‌ టీకాకు కూడా ఇదే వ్యవస్థను ఉపయోగించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌ కోఠిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనరేట్‌ ప్రాంగణంలో స్టేట్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్‌ ఉంది. ఇక్కడ కోటిన్నర వ్యాక్సిన్లను భద్రపరిచేలా ఏర్పాట్లు చేశారు. అందుకోసం నాలుగు వాకిన్‌ కూలర్లు ఇప్పటికే సిద్ధం చేశారు. 40 క్యూబిక్‌ మీటర్లతో ఈ వాక్‌ ఇన్‌ కూలర్లు ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా కరోనా టీకాలను ఇక్కడి నుంచే ఆయా కేంద్రాలకు అంచెలంచెలుగా పంపిణీ చేయనన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

టీకా లెక్క పక్కాగా ప్రభుత్వ , ప్రైవేటు వేర్వేరు విధానాల్లో సేకరించడంలో నిమగ్నమైంది. ముందుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అవసరమైన సమాచారాన్ని కొవిన్ యాప్ లో పొందుపరుస్తోంది. ఇప్పటికే జిల్లాల వారిగా రాష్ట్రంలో సుమారు 15 లక్షల మందికి టీకాలు ప్రభుత్వ , ప్రైవేటు వైద్యంలో వేర్వేరుగా అందించే అమాశం ఉండటంతో ఆ మేరకు కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ప్రభుత్వ , ప్రైవేటు వైద్య సిబ్బంది కలిపి 2,87,218 మంది నమోదయ్యారు. రాష్ట్రం మొత్తమ్మీద కొవిడ్ టీకాను పొందడానికి వైద్యారోగ్యశాఖ కసరత్తు చేసింది. అర్హులైన వైద్య సిబ్బంది హైదరాబాద్ లోనే 28,79 శాతం మంది ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ గుర్తించింది. మేడ్చల్ జిల్లాల్లోనే 42 % మంది ప్రభుత్వ వైద్య సిబ్బంది 125,0077 మంది ఉండగా 46.77 శాతం మంది ప్రైవేటు మెడికల్ సిబ్బంది ఉన్నారు.

టీకా పొందే వైద్యసిబ్బంది అధికంగా ఉన్న తొలి 10 జిల్లాలు ప్రభుత్వ ప్రైవేటు వైద్య సిబ్బంది వివరాలు ఇలా…

  1. హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ వైద్య సిబ్బంది – 16,518 మంది, ప్రైవేట్ వైద్య సిబ్బంది – 60,288 మంది
  2. రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ సిబ్బంది – 5,899 , ప్రైవేట్ సిబ్బంది – 19,312 మంది
  3. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ సిబ్బంది – 6,886, ప్రైవేట్ వైద్య సిబ్బంది – 7,514 మంది
  4. వరంగల్ పట్టణంలో ప్రభుత్వ వైద్య సిబ్బంది – 5,766 మంది, ప్రైవేట్ వైద్య సిబ్బంది – 5,688 మంది
  5. కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వంలో 3,671 మంది, ప్రైవేట్ మెడికల్ సిబ్బంది – 7,514 మంది
  6. మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వ సిబ్బంది – 2,000 మంది, ప్రైవేట్ సిబ్బంది – 8,050 మంది
  7. నల్గొండ జిల్లాలో ప్రభుత్వ సిబ్బంది – 17,827 ఉండగా, ప్రైవేట్ వైద్య సిబ్బంది – 2,022 మంది
  8. నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ సిబ్బంది – 5,821మంది కాగా, ప్రైవేట్ సిబ్బంది – 3,170
  9. సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ సిబ్బంది – 5,475 మంది అయితే, ప్రైవేట్ సిబ్బంది – 8,196 మంది
  10. సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ వైద్య సిబ్బంది – 5,266 మంది ఉండగా, ప్రైవేట్ వైద్య సిబ్బంది 3,289 మంది ఉన్నారు.

ఇదిలావుంటే, కరోనా వ్యాక్సిన్‌ వేయించుకునే వినియోగదారులకు టైమింగ్‌ స్లాట్‌ కేటాయించనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. టీకా వేయించుకునేవారికి వారి నివాస స్థలానికి దగ్గరలో ఉన్న కరోనా టీకా కేంద్రంలోనే వ్యాక్సినేషన్‌కు అనుమతించడం జరుగుతుంది. ఈ మేరకు వారి నివాస స్థలానికి సంబంధించిన పిన్‌కోడ్‌, టీకా కేంద్రం కోడ్‌, చిరునామాతో పాటు టీకా వేసే తేదీ, సమయంతో కూడిన స్లాట్‌ వివరాలను మెసేజ్‌ రూపంలో టీకా వేసుకునేవారికి పంపిస్తామని వైద్యాధికారులు తెలిపారు. మెసేజ్‌ వచ్చిన వారే నిర్ణీత తేదీలో స్లాట్‌ సమయానికి టీకా కేంద్రానికి వెళ్లి టీకా వేసుకోవాల్సి ఉంటుందని హైదరాబాద్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి తెలిపారు.