SIM Swap Scam: సైనికుడి ఖాతా నుంచి రూ. 2.87లక్షలు స్వాహా.. ‘సిమ్ స్వాప్’ పై అప్రమత్తంగా లేకుంటే అంతే మరి..

|

Aug 21, 2024 | 3:48 PM

సిమ్ స్వాప్ స్కామ్ అనేది మీకు తెలియకుండా, మీ ప్రమేయం లేకుండా చేసే మోసం. దీనిలో స్కామర్లు ఒక సిమ్ కార్డ్ నుంచి మరొక సిమ్ కార్డ్‌కి ఫోన్ నంబర్‌ను తరలించడానికి మొబైల్ నెట్‌వర్క్ విధానాన్ని ఉపయోగించుకుంటారు. అలా చేయడం ద్వారా, వారు బాధితుడి ఫోన్ నంబర్‌ను హైజాక్ చేస్తారు. మీ ఫోన్లో సిమ్ కార్డు డియాక్టవేట్ అయ్యి, వేరే సిమ్ యాక్టివేట్ అవుతుంది.

SIM Swap Scam: సైనికుడి ఖాతా నుంచి రూ. 2.87లక్షలు స్వాహా.. ‘సిమ్ స్వాప్’ పై అప్రమత్తంగా లేకుంటే అంతే మరి..
Sim Swap Scam
Follow us on

ప్రస్తుతం ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న ప్రధాన అంశం సిమ్ స్వాపింగ్. నేరగాళ్లు చాలా సులభంగా డూప్లికేట్ సిమ్ లను తీసుకొని ఖాతాలను కొల్లగొట్టేస్తున్నారు. ఇదే విధంగా కొంత కాలం క్రితం ఓ సైనికుడి ఖాతా నుంచి డబ్బు దోచేశారు. ఆ సైనికుడు వాడే సిమ్ ఎయిర్ టెల్. నేరగాళ్లు ఎయిర్ టెల్ కు కాల్ చేసి.. సులభంగా డూప్లికేట్ సిమ్ తీసుకున్నారు. దీంతో ఆ సైనికుడి ఖాతా నుంచి ఏకంగా రూ. 2,87,630 కాజేశారు. దీంతో ఆ సైనికుడు తన ప్రూఫ్స్ సక్రమంగా తనిఖీ చేయకండా డూప్లికేట్ సిమ్ ఇచ్చారని ఎయిర్ టెల్ పై ఫిర్యాదు చేశారు. తన ఎస్బీఐ ఖాతా నుంచి ఆ డూప్లికేట్ సిమ్ తో డబ్బును గుర్తుతెలియని వ్యక్తులు విత్ డ్రా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే మొదటిగా జమ్మూ కశ్మీర్ లో పనిచేసే ఆ సైనికుడు ఎయిర్ టెల్ కే ఫిర్యాదు చేశారు. అయితే ఎయిర్ టెల్ ఆ డబ్బు విషయంలో తామేమి చేయలేమని తేల్చి చెప్పడంతో ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లా ఫోరమ్‌లో వినియోగదారు ఫిర్యాదును దాఖలు చేశారు. అతను ఉపయోగిస్తున్న అదే ఎయిర్‌టెల్ నంబర్‌తో డూప్లికేట్ సిమ్‌ని ఉపయోగించి పేటీఎం, ఎయిర్ టెల్ మనీ, స్నాప్ డీల్, ఎం పైసా వంటి యాప్‌ల ద్వారా తన బ్యాంక్ ఖాతా నుంచి మోసపూరితంగా డబ్బు విత్ డ్రా అయినట్లు సైనికుడు వివరించారు.

దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన తర్వాత, అల్మోరా డిస్ట్రిక్ట్ ఫోరమ్ సైనికుడికి మోసపూరితంగా ఉపసంహరించుకున్న మొత్తం, పరిహారం, న్యాయపరమైన ఖర్చులను చెల్లించాలని ఎయిర్‌టెల్‌ను ఆదేశించింది. దీనిపై ఎయిర్‌టెల్ ఉన్నత న్యాయస్థానాలలో సవాలు చేసింది. రాష్ట్ర వినియోగదారుల కమిషన్ తరువాత జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్సీఆర్డీసీ) ముందు కేసు విచారణ చేసింది. ఎన్‌సీడీఆర్‌సీ జిల్లా ఫోరమ్ ఆదేశాలను సమర్థించింది. సైనికుడికి సుమారు రూ. 4.83 లక్షల పరిహారం చెల్లించాలని ఎయిర్‌టెల్‌ను ఆదేశించింది.

సిమ్ స్వాప్ అంటే..

సిమ్ స్వాప్ స్కామ్ అనేది మీకు తెలియకుండా, మీ ప్రమేయం లేకుండా చేసే మోసం. దీనిలో స్కామర్లు ఒక సిమ్ కార్డ్ నుంచి మరొక సిమ్ కార్డ్‌కి ఫోన్ నంబర్‌ను తరలించడానికి మొబైల్ నెట్‌వర్క్ విధానాన్ని ఉపయోగించుకుంటారు. అలా చేయడం ద్వారా, వారు బాధితుడి ఫోన్ నంబర్‌ను హైజాక్ చేస్తారు. మీ ఫోన్లో సిమ్ కార్డు డియాక్టవేట్ అయ్యి, వేరే సిమ్ యాక్టివేట్ అవుతుంది. దీంతో టూ-ఫాక్టర్ అథెంటికేషన్ వంటి చేసేసుకుంటారు. తద్వారా బాధితుడి వ్యక్తిగత, ఆర్థిక, సోషల్ మీడియా ఖాతాలను ఎంచక్కా వినియోగించుకుంటారు. నిమిషాల్లో మీ ఖాతాలోని డబ్బులను కొల్లగొట్టేస్తారు.

ఎలా రక్షణ పొందాలి..

  • ఈ సిమ్ స్వాప్ మోసాలు ఎక్కువవుతున్న తరుణంలో వ్యక్తులు తమను తాము సురక్షితంగా ఉంచుకోవడం ముఖ్యం. సిమ్ వినియోగం విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం.
  • మీరు ఒకవేళ దీర్ఘకాల నెట్‌వర్క్ సమస్యలు, ఆకస్మిక డియాక్టివేషన్, సిమ్ మార్పును అభ్యర్థిస్తూ నకిలీ కాల్‌లు వస్తే వెంటనే అప్రమత్తం కావాలి.
  • ఎవరైనా 4-5 గంటల వ్యవధిలో అకస్మాత్తుగా నెట్‌వర్క్ డియాక్టివేట్ అయిపోతే.. వెంటనే టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌కు ఫిర్యాదు చేయాలి. తనిఖీ చేయాలి.
  • కస్టమర్‌లు ఒక టెలికాం సర్వీస్ ప్రొవైడర్ నుంచి మరొకదానికి పోర్ట్ చేస్తున్నప్పుడు సంబంధిత బ్యాంకులో సిమ్ స్వాప్ కేసులు ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.
  • మోసగాళ్లు తెలివిగా మీ వ్యక్తిగత సమాచారం సేకరిస్తారు. అంటే మీ చిరునామాలు, పాన్, ఆధార్ నంబర్లు, ఫోన్ నంబర్లను సేకరించి, మీ సిమ్ స్వాప్ కు పాల్పడతారు. కాబట్టి ఆ సమాచారాన్ని ఎక్కడ స్టోర్ చేయొద్దు. ఎవరితోనూ పంచుకోవద్దు.
  • ప్రభుత్వం కూడా కొన్ని కీలక మార్పులు స్విప్ స్వాప్ విషయంలో చేపట్టింది. సిమ్ స్వాప్ తర్వాత అదనపు ప్రామాణీకరణను తీసుకొచ్చింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..