Vidura Niti: రామాయణం, మహాభారతం, నీతిశతకాలు, విదురనీతి కథల్లోని నైతిక విలువలు, మాననీయ విలువలు దాగి వున్నాయి. ఏ కాలంలోనైనా మనిషి జీవితం ప్రశాంతంగా గడపాలని కోరుకుంటాడు. సమాజంలో శాంతి ఉన్నప్పుడే ప్రజలు సుఖంగా ఉంటారు. ఇందుకు నీతినియమాలు తోడ్పడతాయి. నీతి తప్పిన సమాజంలో అశాంతి నెలకొంటుంది. అయితే మనిషి సుఖ సంతోషాలతో జీవించాలంటే ఏ విధంగా నడుచుకోవాలో మన భారతీయ ధర్మశాస్త్రాలు చెబుతాయి. మానవుడు ఎలా జీవిస్తే సమాజానికి మేలు జరుగుతుందో విశిదీకరిస్తాయి. మారుతున్న కాలాన్ని బట్టి కొన్ని నీతుల గురించి అభిప్రాయాలూ మారుతున్నాయి… కొన్ని మాత్రం యుగాలు మారినా మారవు. అలా ఎప్పటికీ సమాజానికి ఉపయోగపడే నీతులు చెప్పినవారిలో విదురుడు ముఖ్యుడు. ఒక దాసికి, వ్యాసుడికి జన్మించిన విదురుడు ధృతరాష్ట్రుడికి తోడుగా ఉంటూ హితోక్తులు చెబుతూ, పాండవుల మేలు కోరుతూ ఉండే కృష్ణభక్తుడు. విదురుడి నీతులకు ఏ యుగంలోనైనా విలువ అలాగే చెక్కుచెదరకుండా ఉంటుంది. ఈరోజు విదురుడు మనిషి మాటలను ఎప్పుడు ఎలా ఏ సమయంలో వాడాలో కప్ప, కోకిల గురించి చెప్పిన కథ గురించి తెలుసుకుందాం..
సమయం చూసి మాట్లాడాలి. నోరుంది కదా అని అనవసర.. అసందర్భ ప్రసంగాలెప్పుడు చెయ్యకూడదని మౌనంగా ఉండడం వలన భద్రత, శుభం కలుగుతాయి. వర్షాకాలంలో కప్పలు బెకబెకమని అరుస్తున్నప్పుడు కోకిలలు మౌనంగా ఉండడమే మంచిది. కోకిల వసంతకాలంలో కమ్మగా పాడుతుంది. వర్షాకాలం రాగానే కప్పల సంఖ్య పెరుగుతుంది. అవి బెకబెకమని కర్ణ కఠోరంగా అరుస్థాయి. ఆ సమయంలో కోకిల కమ్మగా పాడినా ఎవరికీ వినిపించదు. అందుకని వానాకాలంలో కోకిల మౌనంగా ఉండటమే మంచిది. మనుష్యులకైనా ఇదే సూత్రం వర్తిస్తుందని విదురుడు చెప్పాడు. అంతేకాదు కొందరు మూర్ఖులు తాము చెప్పేది తప్పైనా ఒప్పుకోక అడ్డదిడ్డంగా వాదిస్తుంటారు. అటువంటి వారికి ఎంత చెప్పినా ఏది మంచో, ఏది చెడో అర్ధంకాదు. తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యరు. అటువంటి సమయంలో మౌనం వల్లనే భద్రత.. రక్షణ, శుభం కలుగుతాయని విజ్ఞులు గమనించాలని తెలిపాడు. మనం మన కర్మేంద్రియాల ద్వారా మన కర్మలు నిర్వర్తిస్తున్నాం. ఏమీ మాట్లాడకుండా .. ఏమీ ఆలోచించకుండా ఉండటం కూడా మౌనమే. ఎటువంటి ఆలోచనలు లేకపోవడంతో మెదడుకు కూడా కాస్త విశ్రాంతి దొరికి కొత్త శక్తిని సంపాదించుకుంటుంది. దాని చురుకుదనం పెరుగుతుంది.
మౌనం కూడా ఒకరకంగా ధ్యానమే…కాబట్టి కాసేపు మౌనంగా ఉండటం వల్ల ఏకాగ్రత సాధించడానికి కావలసిన నైపుణ్యం దొరుకుతుంది. ఆలోచనల పట్ల నియంత్రణ సాధించగలుగుతాం. ఒక స్పష్టత ఏర్పడుతుంది. జరుగుతున్న విషయాల పట్ల సదవగాహన కలుగుతుంది. పరిణతి కలిగిన ఆలోచలనకు ఆస్కారం ఉంటుంది. ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి మౌనం రాచమార్గమని గ్రహించాలి. మౌనం ఆత్మశక్తిని పెంచుతుంది. మౌనధారణ సంస్కారవంతమైన భూషణం. పరిణతి చెందిన మనస్తత్వానికి ఆలోచనాపరిధికి అది నిదర్శనం. చలించే భావసముదాయం వాచకంగా పెదవులు ద్వారా బహిరంగమౌతుంది. సంభాషణ, లేదా చర్చ గాడి తప్పే గడ్డు సమస్యలు ఎదురైనప్పుడు మౌనం కవచంలా కాపాడుతుందని ధృతరాష్ట్రుడికి విదురుడు చెప్పిన కథ. నేటి సమాజానికి ఎప్పటికీ పనికొచ్చే విధంగా ఉపదేశించిన విదురనీతులు అజరామరాలు. అందుకే భారతానికి ‘ధర్మశాస్త్రం’ అనే పేరు వచ్చింది.
Also Read: భారత్‌కు చెందిన 157 పురాతన వస్తువులను, కళాకండాలను తిరిగి ఇచ్చిన అమెరికా..