Rajyasabha polls: అధినేతలిద్దరికి అగ్నిపరీక్ష

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఆరు రాజ్యసభ సీట్లకు గాను ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల ప్రహసనం మొదలైంది. గతంలోనే షెడ్యూలును విడుదల చేసిన ఎన్నికల సంఘం తాజాగా శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి..

Rajyasabha polls: అధినేతలిద్దరికి అగ్నిపరీక్ష
Follow us

|

Updated on: Mar 06, 2020 | 2:16 PM

Poll process for Rajyasabha seats started: తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఆరు రాజ్యసభ సీట్లకు గాను ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల ప్రహసనం మొదలైంది. గతంలోనే షెడ్యూలును విడుదల చేసిన ఎన్నికల సంఘం తాజాగా శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి.. ఎన్నికల ప్రాసెస్‌ను ప్రారంభించింది. శుక్రవారం నుంచి మార్చి 13వ తేదీ వరకు రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ కార్యదర్శులు నామినేషన్లు స్వీకరిస్తారు. అయితే, ఆరుగురు ఎలాంటి పోటీ లేకుండానే ఎన్నికయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మార్చి 18న విజేతలను ప్రకటించే పరిస్థితి కనిపిస్తోంది.

ఏపీలో నాలుగు, తెలంగాణలో రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్న విషయం తెలిసిందే. అయితే రెండు చోట్ల అధికార పార్టీలైన వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలకే ఈ ఆరు సీట్లు దక్కనున్నాయి. రెండు అసెంబ్లీల్లోను తిరుగులేని మెజారిటీ వున్న అధికార పార్టీలు ఖాళీ అవుతున్న రాజ్యసభ సీట్లను దక్కించుకోనున్నాయి. అయితే… అభ్యర్థుల ఎంపిక రెండు అధికార పార్టీల అధినేతలకు తలనొప్పిని కలిగిస్తున్నాయి. రెండు పార్టీల్లో భారీ సంఖ్యలో ఆశావహులు అధినేతల దగ్గరికి క్యూ కడుతుండడమే ఇందుకు కారణం.

తెలంగాణలో ఖాళీ అవుతున్నవి కేవలం రెండు సీట్లు కాగా.. పది మంది కంటే ఎక్కువ సంఖ్యలో ఆశావహులు ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావులను కలుస్తున్నారు. ఇంతకాలం ప్రగతిభవన్‌ చుట్టూ తిరిగిన ఆశావహులు.. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో కేసీఆర్‌ను కలిశారు. వీరిలో మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఒకరు కాగా.. మరికొందరు కూడా కేసీఆర్‌ను కలిశారు. వీరిలో నాయిని మాత్రం మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ ఛైర్మెన్ పదవి తనకెందుకని ప్రశ్నించారు. కేసీఆర్ ఛాన్సిస్తే.. ఢిల్లీకే పోతానంటూ.. తాను రాజ్యసభకు వెళ్ళేందుకే ఆసక్తిగా వున్నట్లు వెల్లడించారు.

అయితే.. తెలంగాణలో అదనంగా రెండు ఎమ్మెల్సీ సీట్లు కూడా ఖాళీ అయిన నేపథ్యంలో పలువురు అయితే రాజ్యసభ లేకుండా ఎమ్మెల్సీ అన్న ధోరణిలో పైరవీ చేసుకుంటున్నారు. మాజీ ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతారాం నాయక్, గుండు సుధారాణితో పాటు మాజీ ఎమ్మెల్సీ సలీమ్..కేటీఆర్, కేసీఆర్ తో పాటు ఇతర మంత్రులను శుక్రవారం కలిశారు. మరోవైపు ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత, కేసీఆర్ బంధువు వినోద్ కుమార్ కూడా రాజ్యసభ రేసులో వున్నట్లు సమాచారం.

ఇక ఏపీ విషయానికి వస్తే.. వైసీపీకి నాలుగు స్థానాలు దక్కనుండగా.. అందులో ఒకటి రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ విఙ్ఞప్తి మేరకు పరిమల్ నత్వానీకే వైసీపీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మిగిలిన మూడింటిలో ఒకటి అయోధ్య రామిరెడ్డికి ఖరారు కాగా.. మరో రెండింటికి మూడు పేర్లను వైసీపీ అధినేత జగన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. మండలి రద్దు నేపథ్యంలో మంత్రి పదవులను కోల్పోతున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఇటీవల పార్టీలో చేరిన బీదా మస్తాన్ రావులలో ఇద్దరికి రాజ్యసభ టిక్కట్ దక్కనున్నట్లు తెలుస్తోంది. ఆఖరి నిమిషంలో ఏమైనా మార్పు జరిగితే జగన్ బంధువు, టీటీడీ బోర్డు ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డికి అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తోంది.

ఏదిఏమైనా అత్యంత ఆసక్తికరంగా మారిన తెలుగు రాష్ట్రాల రాజ్యసభ ఎన్నికలపై మార్చి 13 నాటికి గానీ క్లారిటీ వచ్చే పరిస్థితి లేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.