మారిన రాహుల్ నిర్ణయం ! మళ్ళీ నేతలతో టచ్ !

|

Jun 25, 2019 | 3:08 PM

లోక్ సభ ఎన్నికల్లో ఘోర ఓటమితో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ..వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల కాంగ్రెస్ నేతలతో ఆయన పలు సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ వారాంతంలో ఇవి ప్రారంభమవుతాయని అంటున్నారు. తన పదవికి రాజీనామా విషయంలో పట్టుబట్టిన రాహుల్.. ఆ పట్టు సడలించుకుని తిరిగి క్రియాశీల రాజకీయాల్లో ఎంట్రీ అయితే పార్టీలో నూతనోత్సాహం పెల్లుబుకడం ఖాయమని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. […]

మారిన రాహుల్ నిర్ణయం ! మళ్ళీ నేతలతో టచ్ !
Follow us on

లోక్ సభ ఎన్నికల్లో ఘోర ఓటమితో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ..వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల కాంగ్రెస్ నేతలతో ఆయన పలు సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ వారాంతంలో ఇవి ప్రారంభమవుతాయని అంటున్నారు. తన పదవికి రాజీనామా విషయంలో పట్టుబట్టిన రాహుల్.. ఆ పట్టు సడలించుకుని తిరిగి క్రియాశీల రాజకీయాల్లో ఎంట్రీ అయితే పార్టీలో నూతనోత్సాహం పెల్లుబుకడం ఖాయమని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. రాహుల్ తన పదవిలో కొనసాగాలని కోరుతున్నవారికందరికి ఇది ఆశా కిరణమే. ఈ సమావేశాల అనంతరం తిరిగి పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశమవుతుందని, ఆ భేటీలో రాహుల్ పదవిలో కొనసాగుతారా లేదా అన్నదానిపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
రాహుల్ గాంధీ ఈ నెల 27 న మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలతోనూ, మరుసటిరోజున హర్యానా, ఢిల్లీ నాయకులతోనూ సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపైనా, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలపైనా చర్చిస్తారని ఈ వర్గాలు తెలిపాయి. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో పార్టీ పనితీరుపై నివేదికలు సమర్పించాల్సిందిగా అన్ని రాష్ట్రాల పార్టీ జనరల్-సెక్రెటరీ ఇన్-చార్జీలను కోరారని, వారు పార్టీ సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి కూడా అయిన కె.సి.వేణుగోపాల్ కు వాటిని అందజేయాల్సిఉంటుందని అంటున్నారు. వివిధ రాష్ట్ర శాఖల నాయకత్వాలను మార్చే అవకాశం కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే సోమవారం యూపీ, కర్ణాటక శాఖలను పార్టీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. మరి కొన్ని రాష్ట్రాల పార్టీ నాయకత్వాలను కూడా నేడో, రేపో మార్చవచ్చుననే సంకేతాలు వస్తున్నాయి. ఆయా రాష్ట్రాల ఇన్-చార్జీలు ఇఛ్చిన సిఫారసుల ఆధారంగా సీనియర్ నాయకత్వం ఈ దిశగాచర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అటు-రాహుల్ మళ్ళీ కాంగ్రెస్ పునర్వైభవానికి పటిష్టమైన కార్యాచరణను రూపొందించవచ్చునని కూడా పలువురు నేతలు ఆశిస్తున్నారు.