పర్యాటకులు లేక కళావిహీనంగా మారిన దాల్‌ సరస్సు

| Edited By: Pardhasaradhi Peri

Jun 27, 2020 | 3:01 PM

కశ్మీర్‌ను దర్శించడానికి వసంతమే అవసరం లేదు.. అక్కడ ఆరు రుతువులు ఆమనులే!

పర్యాటకులు లేక కళావిహీనంగా మారిన దాల్‌ సరస్సు
Follow us on

ఒకప్పుడు జనసందోహంతో.. పర్యాటకులతో కళకళలాడుతూ భూతల స్వర్గంలా భాసిల్లిన కశ్మీర్‌ ఇప్పుడు కళావిహీనంగా మారింది.. జనసంచారంలేక బోసిపోయింది.. కరోనా వైరస్‌ పర్యాటకరంగంపై పెను ప్రభావాన్నే చూపించింది.. అంతా బాగుంటే ఈ సమయానికి దాల్ సరస్సు పడవలతో సందడిగా ఉండేది.. కశ్మీర్‌ను దర్శించడానికి వసంతమే అవసరం లేదు.. అక్కడ ఆరు రుతువులు ఆమనులే! ఎప్పుడైనా ఆస్వాదించదగిన ప్రదేశమే! కాకపోతే కరోనా వైరస్‌ భయంతో ఇప్పుడక్కడకు వెళ్లేవారే లేరు.. కశ్మీర్‌లో పర్యాటక పరిశ్రమ పూర్తిగా స్తంభించి పోయింది. అయినప్పటికీ దాల్‌ లేక్‌ సరస్సులో పడవలు నడిపేవారిలో చాలా మంది ఇంకా చిగురంత ఆశతోనే ఉన్నారు.. 65 ఏళ్ల ఆలీ మొహమద్‌ ఈ ఆశాజీవులలో ఒకరు.. బాల్యం నుంచే దాల్‌ సరస్సులో పడవను నడుపుతున్న మొహమద్‌ ఇంతటి దారుణమైన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదంటున్నాడు.. ప్రతిరోజూ చిన్నపాటి ఆశతో సరస్సు దగ్గరకు వస్తున్నాడు.. ఎవరైనా యాత్రికులు ఉన్నారేమోనని వెతుకుతున్నాడు.. చిన్నపాటి పని దొరక్కపోదా అని ఆశపడుతున్నాడు.. సంధ్య చీకట్లు ముసుకునేంతవరకు ఇదే రకమైన ఎదురుచూపులు.. ఆ తర్వాత ఎప్పటిలాగే ఖాళీ చేతులతో ఇల్లు చేరుకుంటున్నాడు..

కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌కు వంద రోజులు పూర్తయ్యాయి. పర్యాటకరంగంపై ఆధారపడి జీవితం గడుపుతున్న వారి పరిస్థితి దుర్భరంగా మారింది.. దాల్‌ లేక్‌ ఎప్పటిలాగే స్వచ్ఛంగా అందంగా ఉన్నా పడవలు మాత్రం కళ తప్పాయి.. అందమైన ఆ తటాకం దగ్గర ఆడుకుంటున్న పిల్లలు, టూరిస్టుల కోసం ఎదురుతెన్నులు చూస్తున్న సరంగులు తప్ప ఇంకో మనిషి కనిపించడం లేదు..

నిజానికి నిరుడు ఆగస్టు అయిదున కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌ 370ని రద్దు చేసినప్పటి నుంచి కశ్మీర్‌లో పర్యాటకులు తగ్గిపోయారు.. ఒక విధంగా చెప్పాలంటే కశ్మీర్‌ ఇప్పుడు రెండో లాక్‌డౌన్‌ను ఎదుర్కొంటోంది. ఏడాదిలో రెండు లాక్‌డౌన్‌లు రావడంతో కశ్మీర్‌లోని పర్యాటకరంగం పూర్తిగా కుదేలయ్యింది. హౌజ్‌బోట్లు, హోటల్స్‌ ఖాళీగా ఉంటున్నాయి.. వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కశ్మీర్‌ ప్రజలు మాత్రం కరోనా వైరస్‌తో జాగ్రత్తగా ఉంటున్నారు.. ప్రభుత్వం చెప్పిన విధంగా నిబంధనలను పాటిస్తున్నారు. మార్చి నుంచే శ్రీనగర్‌లో లాక్‌డౌన్‌ మొదలయ్యింది.. అలీ మొహమద్‌కు రెండు నెలల పాటు ఇంటిపట్టునే ఉండాల్సి వచ్చింది.. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితి ఇప్పుడాయనది! కూడబెట్టుకున్నదంతా కరిగిపోయింది. లాక్‌డౌన్‌ ఆంక్షలను పాటిస్తూ వస్తున్నా టూరిస్టులు మాత్రం పడవలలో షికారు చేసేందుకు జంకుతున్నారు.. గతాన్ని తల్చుకుని ఆనందపడుతున్న అలీ మొహమద్‌కు వర్తమాన పరిస్థితులు భవిష్యత్తు పట్ల భయాన్ని కలిగిస్తున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు రోజుకు కనీసం వెయ్యి రూపాయలనైనా సంపాదించేవాడనని, ఇప్పుడు రూపాయి కూడా సంపాదించలేకపోతున్నానని బాధతో చెబుతున్నాడాయన! పరిస్థితులు ఎప్పుడు కుదుటపడతాయో చెప్పలేకపోతున్నారు. కశ్మీర్‌ సాధారణ స్థితికి ఎప్పుడు చేరుకుంటుందో ఎవరికీ తెలియదు.. మొన్నటి వరకు జమ్ము కశ్మీర్‌లో ఆరున్నర వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.. 90 మంది కరోనాతో మరణించారు.. చనిపోయినవారిలో 79 మంది కశ్మీరీలే! దాల్‌ సరస్సు చుట్టుపక్కల కనీసం అయిదువేల కుటుంబాలు నివసిస్తున్నాయి. తమ బాగోగులను ప్రభుత్వం పట్టించుకోవాలని వీరంతా వేడుకుంటున్నారు.