‘ఎందుకు దాక్కుంటున్నారు?.. మోదీపై రాహుల్ ఫైర్

| Edited By: Pardhasaradhi Peri

Jun 17, 2020 | 12:33 PM

భారత-చైనా దళాల మధ్య ఘర్షణ జరిగి 20 మంది భారతీయ సైనికులు మరణించినప్పటికీ.. ప్రధాని మోదీ మౌనంగా ఎందుకు ఉంటున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఆయన సైలెంట్ గా ఎందుకు ఉంటున్నారని..

ఎందుకు దాక్కుంటున్నారు?.. మోదీపై రాహుల్ ఫైర్
Follow us on

భారత-చైనా దళాల మధ్య ఘర్షణ జరిగి 20 మంది భారతీయ సైనికులు మరణించినప్పటికీ.. ప్రధాని మోదీ మౌనంగా ఎందుకు ఉంటున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఆయన సైలెంట్ గా ఎందుకు ఉంటున్నారని, ఎందుకు ‘దాక్కుంటున్నారని’ ట్వీట్ చేశారు. అసలు ఏం జరిగిందో తాము తెలుసుకోదలిచామని, మన సైనికులను హతమార్చడానికి, మన భూభాగాలను చేజిక్కించుకోవడానికి వారికెంత ధైర్యమని అన్నారు. ఘర్షణల్లో మృతి చెందిన భారత సైనికుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ రాహుల్ ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. మీరు బయటికి వఛ్చి వాస్తవమేమిటో చెప్పాలని, భయపడవద్దని ఆయన అన్నారు. భారత సైనికులు ఇరవై మంది మరణించగా.. 43 మంది చైనా సైనికులు గాయపడడమో,  మరణించడమో జరిగిందని ఎఎన్ఐ వార్తా సంస్థ ప్రకటించినప్పటికీ  భారత సైన్యం మాత్రం ఈ అంశాన్ని నిర్దిష్టంగా ప్రస్తావించలేదు.

గాల్వాన్ వ్యాలీలో మన సైనికులు ఇరవై మంది మృతి చెందినట్టు వఛ్చిన వార్త తమను షాక్ కి గురి చేసిందని, అమరులైన వారికి సెల్యూట్ చేస్తున్నామని, ప్రధాని మోదీ దేశ ప్రజలను విశ్వాసం లోకి తీసుకోవాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ ట్వీట్ చేశారు. చైనాకు దీటైన సమాధానం ఇవ్వాల్సిందే అన్నారు. కాగా-బీజేపీ చీఫ్ జె.పి. .నడ్డా.. కేరళలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ.. చైనా సైనికులను మన సైన్యం ధాటిగా ఎదుర్కొందని, ప్రధాని మోదీ నాయకత్వం కింద భారత ప్రాదేశిక సమగ్రతను పణంగా పెట్టే ప్రసక్తి లేదన్నారు.