రైతుల నిరసనలు, నేడు సుప్రీంకోర్టు విచారణ, 2024 వరకు ఆందోళనకు సిధ్దమంటున్న అన్నదాతలు, రేపు మళ్ళీ చర్చలు

| Edited By: Pardhasaradhi Peri

Jan 18, 2021 | 9:01 AM

రైతు చట్టాలను రద్దు చేయాల్సిందేనని అన్నదాతలు, ఆ ఒక్కటీ తప్ప మరే డిమాండయినా తీర్చేందుకు రెడీ అంటున్న కేంద్రం వైఖరితో ప్రతిష్టంభన..

రైతుల నిరసనలు, నేడు సుప్రీంకోర్టు విచారణ, 2024 వరకు ఆందోళనకు సిధ్దమంటున్న అన్నదాతలు, రేపు మళ్ళీ చర్చలు
Follow us on

రైతు చట్టాలను రద్దు చేయాల్సిందేనని అన్నదాతలు, ఆ ఒక్కటీ తప్ప మరే డిమాండయినా తీర్చేందుకు రెడీ అంటున్న కేంద్రం వైఖరితో ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. వివాదాస్పద బిల్లులపైనా, ఈ నెల 26 న రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని ఆపేలా చూడాలంటూ ఢిల్లీ పోలీసుల తరఫున కేంద్రం దాఖలు చేసిన ఇంజంక్షన్ పైనా సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరపనుంది. అలాగే తాము ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల పానెల్ నుంచి ఒకరు వైదొలగగా తలెత్తిన పరిస్థితిపై కూడా కోర్టు దృష్టి సారించనుంది. ఇక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని పట్టు బడుతున్న తాము 2024 మే వరకు కూడా ఆందోళన చేయడానికి సిధ్ధమేనని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ ప్రకటించారు.(దేశంలో తదుపరి లోక్  సభ ఎన్నికలు 2024 ఏప్రిల్ -మే ప్రాంతంలో జరగనున్నాయి). ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల నిరసనను ఆయన సిధ్ధాంతపరమైన విప్లవంగా అభివర్ణించారు.కనీస మద్దతుధరపై లీగల్ గ్యారంటీ కావాలని తాము కోరుతున్నామని ఆయన చెప్పారు. నాగపూర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన..ధనిక రైతులే ఈ నిరసనలో పాల్గొంటున్నారన్న ఆరోపణలను ఖండించారు. గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్న రైతులు కూడా ఈ ఆందోళనలో పాల్గొనేందుకు ముందుకు వస్తున్నారని, పైగా వివాదాస్పద చట్టాలను కేంద్రం రద్దు చేసేంతవరకు మేము గ్రామాల లోకి రాకూడదని ఆయా గ్రామ అన్నదాతలు కోరుతున్నారని తెలిపారు.

సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ముందు తాము హాజరయ్యే ప్రసక్తే లేదని తికాయత్ మళ్ళీ స్పష్టం చేశారు. కొంతమంది రైతులకు, జర్నలిస్టులకు జాతీయ దర్యాప్తు సంస్థ సమన్లు జారీ చేయడాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. ఆందోళనలో పాల్గొంటున్నవారు కోర్టు కేసులు ఎదుర్కొనేందుకు, జైళ్లకు వెళ్లేందుకు కూడా సిధ్ధపడి ఉండాలన్నారు. తమ ఆస్తులను స్వాధీనం చేసుకున్నా వారు బెదరకూడదన్నారు. కాగా-ఈ నెల 26 న తాము ఢిల్లీలోని ఔటర్ రింగ్ రోడ్డులో ట్రాక్టర్ ర్యాలీని నిర్వహిస్తామని, అది శాంతియుతంగా సాగుతుందని మరో నేత యోగేంద్ర యాదవ్ వెల్లడించారు. సాధారణ పరేడ్ కు ఇది ఎంత మాత్రం అడ్డంకి కాబోదన్నారు. ఇలా ఉండగా మంగళవారం కేంద్రంతో రైతులు తిరిగి (పదో దఫా) చర్చలు జరపనున్నారు.

Also Read:

Covid Vaccination: తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ కీలక నిర్ణయం.. వ్యాక్సినేషన్ కేంద్రాల సంఖ్య భారీగా పెంపు..

నాలుగో టెస్ట్: భోజన విరామానికి ఆసీస్ 149/4.. క్రీజులో స్టీవ్ స్మిత్.. ఆధిక్యం 182..

Andhra Pradesh High Court: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో నేడు విచారణ.. ధర్మాసనం స్పందనపై తీవ్ర ఉత్కంఠ..