ఇండియాకు వెంటిలేటర్లు ఇస్తాం.. కానీ.. చైనా ‘సణుగుడు’

| Edited By: Anil kumar poka

Apr 02, 2020 | 12:04 PM

కరోనా కేసుల కారణంగా ఇండియా, అమెరికా వంటి దేశాలు రోగులకు అత్యవసరమైన వెంటిలేటర్ల కొరతతో అల్లల్లాడుతున్నాయి. వెంటిలేటర్ల అవసరం ఇప్పుడు పలు దేశాలకు ఏర్పడింది.

ఇండియాకు వెంటిలేటర్లు ఇస్తాం.. కానీ.. చైనా సణుగుడు
Follow us on

కరోనా కేసుల కారణంగా ఇండియా, అమెరికా వంటి దేశాలు రోగులకు అత్యవసరమైన వెంటిలేటర్ల కొరతతో అల్లల్లాడుతున్నాయి. వెంటిలేటర్ల అవసరం ఇప్పుడు పలు దేశాలకు ఏర్పడింది. వీటి కొరత వల్ల ఇటు రోగులు, అటు వైద్య సిబ్బంది కూడా సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియాకు వెంటిలేటర్లను సమకూర్చేందుకు తాము సిధ్ధంగా ఉన్నామని, ఆ దేశానికి సహాయ పడతామని చైనా ప్రకటించింది. కానీ దిగుమతి చేసుకోవలసిన విడిభాగాల అవసరం తమకూ ఉందని, ఈ కారణంగా వీటిని ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేయలేకపోతున్నామని చైనా పేర్కొంది. తమకు ఎక్కువ సంఖ్యలో వెంటిలేటర్లు కావాలని ఇండియా వివిధ దేశాలను కోరుతోంది. గత జనవరిలో కరోనా వైరస్ సమస్య తలెత్తినప్పుడు చైనాకు కొన్ని వైద్య సాధనాల ఎగుమతిపై గల నిషేధాన్ని భారత్ సడలించింది. ఆ తరువాత ఫిబ్రవరిలో ఆ దేశానికి 15 టన్నుల మెడికల్ సాయాన్ని పంపింది. నిజానికి మాకు కూడా వెంటిలేటర్ల అవసరం చాలా ఉందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హువా చున్ ఇంగ్ అన్నారు. కానీ విడిభాగాలు తగినన్ని లేక వీటిని ఉత్పత్తి చేసే సంస్థలు సమస్యను ఎదుర్కొంటున్నాయని ఆమె చెప్పారు. ప్రస్తుతం చైనాలో 21 సంస్థలు వెంటిలేటర్లను ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే  వీటి ప్రొడక్షన్ కెపాసిటీ.. కేవలం 2,200 యూనిట్లు మాత్రమే.  గ్లోబల్ ప్రొడక్షన్ లో ఇది జస్ట్ 20శాతం మాత్రమే ఉంది. కానీ చైనా వెంటిలేటర్లు నాసి రకంగా, లోపభూయిష్టంగా ఉన్నాయన్న విమర్శలూ ఉన్నాయి. స్పెయిన్ కు పంపిన ఇలాంటి నాసిరకం వెంటిలేటర్ల కారణంగా బహుశా ఆ దేశంలో కరోనా మృతుల సంఖ్య పెరుగుతోందన్న వార్తలు కూడా వినవస్తున్నాయి.