Superstar Rajnikanth: రజనీ నెక్స్ట్ స్టెప్ ఏప్రిల్‌లో… మ్యాటర్ ఇదే

|

Mar 05, 2020 | 1:45 PM

ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల దిశగా కీలక అడుగు వేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ నెలలోనే రజనీకాంత్ రాజకీయ పార్టీ వివరాలు వెల్లడించేందుకు రంగం సిద్దమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Superstar Rajnikanth: రజనీ నెక్స్ట్ స్టెప్ ఏప్రిల్‌లో... మ్యాటర్ ఇదే
Follow us on

Superstar Rajnikanth to take crucial political step in April: ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల దిశగా కీలక అడుగు వేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ నెలలోనే రజనీకాంత్ రాజకీయ పార్టీ వివరాలు వెల్లడించేందుకు రంగం సిద్దమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవలి కాలంలో రజనీకాంత్ వేస్తున్న ప్రతీ అడుగు, చేస్తున్న ప్రకటన రాజకీయాల్లో ప్రకంపనలు కలిగిస్తోంది. రజనీకాంత్ అడుగులుపై, ప్రకటనలపైనా రాజకీయ నాయకుల ప్రతిస్పందనలు పెరిగిపోతున్నాయి.

రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఖాయమని ప్రకటించి రెండేళ్ళైంది. పార్టీ వివరాలు మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. అయితే దానికి కారణం.. తమిళనాడులో ఎన్నికలు ఇప్పుడే లేకపోవడమేనని అందరికి తెలిసిందే. వచ్చే సంవత్సరం తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న దరిమిలా.. రాజకీయపరమైన అడుగులను వేగవంతం చేశారు తలైవా. అందుకు అనుగుణంగా యాక్షన్ ప్లాన్ రెడీ అయినట్లు తెలుస్తోంది.

ఏప్రిల్ నెలలో రాజకీయ పార్టీ పేరు.. ఇతర వివరాలను వెల్లడించేందుకు తాజాగా రజనీకాంత్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. రజనీ మక్కల్ మండ్రమ్ (రజనీ పీపుల్స్ ఫోరమ్) జిల్లా బాధ్యులతో రజనీకాంత్ గురువారం భేటీ అయ్యారు. కీలక సమాలోచనలు జరిపారు. పార్టీ విధివిధానాలు ఎలా వుండాలి? పార్టీ ఎన్నికల యాక్షన్ ప్లాన్ ఎలా వుండాలి? రజనీకాంత్ తలపెట్టిన రాష్ట్రవ్యాప్త పర్యటనకు ఎప్పుడు శ్రీకారం చుట్టాలి? ఇలాంటి అంశాలపై రజనీకాంత్ రజనీ మక్కల్ మండ్రమ్ జిల్లా నాయకులతో సంప్రదింపులు జరిపారు.

తాజా అప్ డేట్స్ ప్రకారం.. రజనీకాంత్ తన పార్టీ పేరు, విధివిధానాలను ఏప్రిల్ నెలలో ప్రకటించే పరిస్థితి కనిపిస్తోంది. అయితే.. రజనీకాంత్ ఇంకా రెండు సినిమాలకు కమిట్‌ అయి వున్నారు. అందులో ఒకటి ఆల్‌రెడీ షూటింగ్ జరుపుకుంటుండగా.. మరొకటి మే నెలలో సెట్స్‌పైకి వెళుతుందని తెలుస్తోంది. రెండో సినిమా కమల్‌హాసన్ ప్రొడక్షన్ హౌజ్‌లో నిర్మాణం జరుపుకోనుందని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే.. తమిళనాడు వ్యాప్తంగా పర్యటనకు శ్రీకారం చుట్టాలని రజనీకాంత్ భావిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్త పర్యటనకు ఆరు నుంచి తొమ్మిది నెలల కాలం వెచ్చిస్తే.. ఇక ఎన్నికలు సమీపిస్తాయని, ఆపై పోటీకి సంబంధించిన అంశాలపై దృష్టి సారించవచ్చని తలైవా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కమల్‌హాసన్‌ స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీతో కలిసి పని చేసే అంశాన్ని కూడా రజనీకాంత్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. రజనీకాంత్ జాతీయతా భావజాలానికి దగ్గరగా వుండగా.. దానికి భిన్నంగా కమల్ రాజకీయం ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కలయిక ఎంత వరకు సాధ్యమన్నది సందేహమే.

 ఇదీ చదవండి:మంత్రుల మధ్య బోర్డర్ పంచాయితీ Internal fight among KCR cabinet