బీహార్‌ డీజీపీ పాండే స్వచ్ఛంద పదవీ విరమణ ః రాజకీయాల్లో చేరే అవకాశం

|

Sep 23, 2020 | 2:25 PM

బీహార్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌- డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే అందరూ అనుకున్నట్టుగానే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.. అంత మంచి ఉద్యోగాన్ని వదులుకోవల్సినంత  కష్టం ఏమొచ్చిందని ఆందోళన చెందాల్సిన పనిలేదు..

బీహార్‌ డీజీపీ పాండే స్వచ్ఛంద పదవీ విరమణ ః రాజకీయాల్లో చేరే అవకాశం
Follow us on

బీహార్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌- డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే అందరూ అనుకున్నట్టుగానే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.. అంత మంచి ఉద్యోగాన్ని వదులుకోవల్సినంత  కష్టం ఏమొచ్చిందని ఆందోళన చెందాల్సిన పనిలేదు.. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో చేరడానికే స్వచ్ఛంద పదవీవిరమణ చేశారు.. రేపోమాపో తనకు నచ్చిన రాజకీయ పార్టీలో చేరబోతున్నారు.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ కూడా చేస్తారు. బహుశా బుక్సర్‌ నియోజకవర్గం నుంచి బరిలో దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..

బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను విమర్శించిన బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తిపై అంతెత్తున లేచిన గుప్తేశ్వర్‌ పాండే ఆమెపై విరుచుకుపడ్డారు.. సీఎంను అనేంతదానివా అంటూ కొంచెం  అనకూడని వ్యాఖ్యలే చేశారు. 1987 బీహార్‌ కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి గుప్తేశ్వర్‌ పాండే బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు దర్యాప్తుతో దేశమంతటా తెలిసివచ్చారు. ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేయడం ఇది రెండోసారి.. ఇంతకు ముందు కూడా రాజకీయాల్లో చేరి చట్టసభల్లో అడుగుపెడదామనుకున్నారు.. బీజేపీ టికెట్‌ను గట్టిగా ప్రయత్నించారు.. కానీ ఆశలు నెరవేరలేదు.. తొమ్మిది నెలల పాటు ఖాళీగానే ఉన్నారు.. మళ్లీ తనను విధుల్లోకి తీసుకోవాలంటూ బీహార్‌ సర్కార్‌కు విన్నవించుకున్నారు.. వెంటనే నితీశ్‌కుమార్‌ ఓకే చెప్పేశారు.. అలా 2019 లోక్‌సభ ఎన్నికల ముందు పాండే మళ్లీ విధుల్లో చేరిపోయారు. ఇక ఇప్పుడు కూడా పాండే రాజీనామా చేయడమూ దానికి సంబంధించి హోంశాఖ నోటిఫికేషన్‌ జారీ చేయడమూ అయిపోయాయి.. నిన్నటితో పాండే వర్కింగ్‌ డేస్‌ పూర్తయినట్టు!

రాజకీయాల్లో చేరడానికే రాజీనామా చేసినట్టుగా ఉందని ఓ విలేకరి అడిగితే ఏమో ఎవరూ చెప్పొచ్చారు .. చేరితే చేరవచ్చు అంటూ సమాధానం ఇచ్చారు.. ఇప్పటివరకైతే ఏ పార్టీ అన్నది డిసైడ్‌ చేసుకోలేదు కానీ సమాజ సేవ  చేయాలన్న కోరిక మాత్రం గట్టిగా ఉందన్నారు పాండే. తన భవిష్యత్తు ప్రణాళికను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. ప్రజల డిమాండ్‌ మేరకే, సుశాంత్‌సింగ్‌ కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకే తాను అతడి మరణంపై పాట్నాలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశానని వివరించారు పాండే. రాజీనామాకు రెండు రోజుల ముందు బక్సర్‌లోని జనతాదళ్‌ యునైటెడ్‌ క్యాడర్‌తో పాండే సమావేశమయ్యారు.  అక్టోబర్‌-నవంబర్‌ మాసాలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసమే పాండే రాజీనామా చేశారన్నది బహిరంగ రహస్యం.. తన స్వచ్ఛంద రాజీనామాను కేవలం 24 గంటల్లోనే ప్రభుత్వం ఆమోదించడాన్ని చూస్తుంటే రాజకీయాల్లో చేరడం ఖాయమనిపిస్తోంది.. సాధారణంగా వీఆర్‌ఎస్‌ కోసం ఉన్నతాధికారులు మూడు నెలల ముందుగానే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.. పాండేకు మాత్రం 24 గంటల్లోనే అన్ని అయిపోయాయి. బక్సర్‌ నియోజకవర్గం నుంచే పాండే ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారంటే అక్కడ రాజ్‌పుత్‌లతో పాటు  బ్రాహ్మణ సామాజికవర్గం ఎక్కువ కాబట్టి…!