ఏనుగు మృతిపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ దర్యాప్తు

| Edited By: Pardhasaradhi Peri

Jun 08, 2020 | 4:00 PM

కేరళలో గర్భస్థ ఏనుగు మృతిపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ తనకుతానుగా దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించింది. పలక్కాడ్ జిల్లాలో పేలుడు పదార్థాలు కూర్చిన కోకోనట్ తిని మృతి చెందిన ఏనుగు..

ఏనుగు మృతిపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ దర్యాప్తు
Follow us on

కేరళలో గర్భస్థ ఏనుగు మృతిపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ తనకుతానుగా దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించింది. పలక్కాడ్ జిల్లాలో పేలుడు పదార్థాలు కూర్చిన కోకోనట్ తిని మృతి చెందిన ఏనుగు ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇందుకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అనేకమంది ట్వీట్లు చేశారు. కేరళ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై దర్యాప్తునకు శ్రీకారం చుట్టాయి. ఈ కేసులో అప్పుడే ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.  మరో ఇద్దరు అనుమానితులకోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కూడా చొరవ తీసుకుంది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. తదనంతర చర్యల (యాక్షన్ టేకెన్) నివేదికను సాధ్యమైనంత త్వరగా సమర్పించాలని ఈ కమిటీని ఆదేశించింది. అటవీ వన్యమృగాలను పరిరక్షించేందుకు ఉద్దేశించిన నిబంధనలను ప్రజలు పాటించకపోవడంవల్ల కూడా ఈ విధమైన సంఘటనలు జరుగుతుంటాయని, ఫలితంగా అవి  ప్రమాదాల బారిన పడుతుంటాయని ట్రైబ్యునల్ అభిప్రాయపడింది.

జస్టిస్ కె.రామకృష్ణన్, సాయి బాల దాస్ గుప్తాలతో కూడిన కూడిన బెంచ్.. ఈ ఘటనకు సంబంధించి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ  శాఖలకు, కేరళ ప్రభుత్వానికి, కేంద్రానికి నోటీసులు జారీ చేస్తూ వీటికి జులై 10 లోగా సమాధానాలు పంపాలని ఆదేశించింది. తాము నియమించిన కమిటీ ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతుందని, యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పిస్తుందని బెంచ్ వెల్లడించింది. భవిష్యత్తులో ఈ విధమైన ఘటనలు జరగకుండా దీర్ఘ కాలిక ప్రణాళికను కూడా ఈ కమిటీ సూచిస్తుందని పేర్కొంది. వార్తా పత్రికల్లో వఛ్చిన వార్తలను బట్టి చూస్తే.. అటవీ శాఖ, కేరళ, కేంద్ర ప్రభుత్వాలు ఈ ఉదంతంపై కొంత మేర చర్య తీసుకున్నట్టు కనబడుతోందని ట్రైబ్యునల్ వ్యాఖ్యానించింది. జులై 10 న తదుపరి విచారణ జరుగుతుందని స్పష్టం చేసింది.