అక్కడ లక్ష్మీ సరస్వతులు పార్వతీదేవి కూతుళ్లు

|

Oct 23, 2020 | 6:23 PM

దేవి నవరాత్రులను భక్తి పూర్వకంగా.. అత్యంత వైభవంగా జరుపుకుంటారు బెంగాలీలు! అసలు దుర్గాపూజ అనగానే మనకు చటుక్కున మెదిలేది బెంగాలే! బెంగాల్‌లో జరిగినంత గొప్పగా దసరా వేడుకలు మరెక్కడా జరగవంటే అతిశయోక్తి కాదు..!

అక్కడ లక్ష్మీ సరస్వతులు పార్వతీదేవి కూతుళ్లు
Follow us on

దేవి నవరాత్రులను భక్తి పూర్వకంగా.. అత్యంత వైభవంగా జరుపుకుంటారు బెంగాలీలు! అసలు దుర్గాపూజ అనగానే మనకు చటుక్కున మెదిలేది బెంగాలే! బెంగాల్‌లో జరిగినంత గొప్పగా దసరా వేడుకలు మరెక్కడా జరగవంటే అతిశయోక్తి కాదు..! దసరా ముందు ఆరు నెలలు నవరాత్రులను ఎలా జరుపుకోవాలనే విషయమై ఆలోచనలు చేస్తారట! దసరా తర్వాతి ఆరు నెలల పాటు పండుగ జరుపుకున్న వైనాన్ని చెప్పుకుని మురిసిపోతుంటారట! బెంగాలీలకు ఇంతకు మించిన పెద్ద పండుగ లేదు..

జగన్మాత ఒక్కరే అయినా ప్రాంతాన్ని బట్టి ఆమెను కొలుచుకునే విధానం మారుతూ ఉంటుంది.. ఆరాధించే అమ్మవారు ఒకరే అయినా కోట్లాది మంది భక్తులు కోటి రకాలుగా సేవించుకుంటారు. బెంగాల్‌లో శక్తి ఆరాధన కొంచెం భిన్నంగా ఉంటుంది.. లక్ష్మీ సరస్వతులను బెంగాలీలు పార్వతీదేవి కూతుళ్లుగా భావిస్తారు. అలా భావించి పూజించడానికి ఓ కథ ఉంది.. పదహారో శతాబ్దంలో ఉత్తర బెంగాల్‌ను పరిపాలించిన తాహేర్‌పూర్‌ మహారాజు ఆస్థానంలో పండితులుండేవారు.. వారి సాయంతో రాజు అమ్మవారు కేంద్రబిందువుగా ఓ ఆకర్షణీయమైన గాథను సృష్టించాడు.. ఆ కథ ప్రకారం దుర్గామాతకు కార్తికేయుడు, గణపతి అనే ఇద్దరు కొడుకులు.. లక్ష్మి, సరస్వతి అనే ఇద్దరు కూతుళ్లు.. ఈ నలుగురు సంతానంతో ప్రతి ఏడాది దుర్గామాత ఓ నాలుగు రోజుల పాటు పుట్టింట్లో గడుపుతుంది.. శివుడు వారితో రాడు.. ప్రతి బెంగాలీ ఇల్లు దుర్గాదేవి పుట్టిల్లే కాబట్టి అందరి ఇంట్లో ఆమ్మవారు కొలువుతీరతారు.. బెంగాలీలంతా దుర్గమ్మ రాక కోసం ఎదురుచూస్తుంటారు.. కొడుకులు..కూతుళ్లతో పుట్టింటికొచ్చిన దుర్గమ్మను బెంగాలీలు సాదరంగా ఆహ్వానిస్తారు. నాలుగు రోజుల తర్వాత సాగనంపుతారు.

దుర్గ కుటుంబానికి ప్రతినిధులుగా సింహం.. నెమలి.. ఎలుక…హంస.. గుడ్లగూడ బొమ్మలు ప్రతి బెంగాలీ ఇంట్లోనూ ఉంటాయి.. బెంగాల్‌లో విజయదశమి శాంతికి పర్యాయపదం.. విజయదశమి సందర్భంగా అన్ని రకాల శత్రుత్వాలను ..మాట పట్టింపులను.. భేదాభిప్రాయాలను పక్కకు పెట్టి పాత పగలను మరచిపోయి అందరినీ స్నేహదృష్టితో చూస్తారు.. శాంతి జలంతో అందరూ ప్రక్షాళితులవుతారు. శత్రువులు మిత్రులు పరస్పరం ఆలింగనం చేసుకుంటారు.. ఒకరినొకరు తీపి తినిపించుకుంటారు. వివిధ రూపాలలో అలంకరించిన దుర్గాదేవి విగ్రహాలను హుగ్లీనదిలో నిమజ్జనం చేస్తారు. కోల్‌కతాలో ఉన్న కాళీమత ఆలయం అయితే విజయదశమి రోజున భక్తులతో పోటెత్తుతుంది.. 51 శక్తి పీఠాలలో ఇది ఒకటి! అమ్మవారి పాదాగ్రం పడిన చోటునే కాళీక్షేత్రం వెలిసింది.. కోల్‌కతా వాసులకు కాళీమాత ఇష్టదైవమే కాదు..ఇలవేలువు కూడా! కాళీమాతలోనే దుర్గాదేవిని.. లక్ష్మీదేవిని.. సరస్వతీదేవిని చూసుకుంటారు. మాగో అని ఆ అమ్మను పిలుచుకుంటారు.