హిందుత్వపై మీ సర్టిఫికెట్‌ అవసరం లేదు ః గవర్నర్‌కు థాక్రే కౌంటర్‌

|

Oct 14, 2020 | 11:31 AM

పశ్చిమ బెంగాల్‌ కథే మహారాష్ట్రలోనూ పునరావృతమవుతోంది.. ముఖ్యమంత్రి-గరవ్నర్‌ మధ్య గొడవలు ముదురుతున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే అయితే గవర్నర్‌ బి.ఎస్‌.కోషియారీపై అంతెత్తున లేచారు..

హిందుత్వపై మీ సర్టిఫికెట్‌ అవసరం లేదు ః గవర్నర్‌కు థాక్రే కౌంటర్‌
Follow us on

పశ్చిమ బెంగాల్‌ కథే మహారాష్ట్రలోనూ పునరావృతమవుతోంది.. ముఖ్యమంత్రి-గరవ్నర్‌ మధ్య గొడవలు ముదురుతున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే అయితే గవర్నర్‌ బి.ఎస్‌.కోషియారీపై అంతెత్తున లేచారు.. గొడవంతా ప్రార్థన స్థలాలను తెరవాలా వద్దా అన్న దానిపై వచ్చింది.. ప్రార్థనాస్థలాలను తెరవాలంటూ గవర్నర్‌ కోషియారీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రేకు ఓ పెద్ద లేఖ రాశారు.. అందులో తమరు అకస్మాత్తుగా లౌకకవాదిగా ఎలా మారిపోయారు? అంటూ సీఎంను గవర్నర్‌ ప్రశ్నించారు.. హిందుత్వంపై తమరి సర్టిఫికెట్‌ తనకేమీ అవసరం లేదంటూ ఉద్ధవ్‌ ఘాటుగా బదులిచ్చారు.. మహారాష్ట్రలో ప్రార్థన స్థలాలను మళ్లీ తెరవాలంటూ ఓ మూడు బృందాలు తనకు లేఖల రూపంలో విన్నవించుకున్నాయంటూ గవర్నర్‌ లేఖలో ప్రస్తావిస్తే.. అందుకు జవాబుగా … ఆ మూడు బృందాలు యాధృచ్చికంగా బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులేవేనంటూ ఉద్ధవ్‌ వ్యంగ్యంగా అన్నారు. మీరు చెప్పగానే ప్రార్థనాస్థలాలను తెరవలేమని, కరోనా వైరస్‌ వ్యాప్తిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఓ నిర్ణయం తీసుకుంటామని ఉద్దవ్‌ కుండబద్దలు కొట్టారు. అయినా ప్రార్థనస్థలాలను తెరిస్తే హిందుత్వ వాదులు, తెరవకపోతే లౌకికవాదులు ఎలా అవుతారో గవర్నర్‌గా చెబితే బాగుంటుందన్నారు థాక్రే. తాను ఆచరించే హిందుత్వకు గవర్నర్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత తనమీద ఉందని చెప్పారు. మరోవైపు గవర్నర్‌ లేఖపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ కూడా మండిపడ్డారు.. హిందుత్వ పునాదుల మీదనే శివసేన నిర్మితమైనదని రౌత్‌ అన్నారు. ఇతరుల నుంచి పాఠాలు నేర్చుకోవలసిన ఆవశ్యకత తమకు లేదన్నారు. ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌ కూడా గవర్నర్‌ లేఖపై అభ్యంతరం చెప్పారు.. ఆయన వాడిన భాష బాగోలేదన్నారు. అన్ని మతాలను సమదృష్టితో చూడాలని రాజ్యాంగం చెబుతున్నదని, సీఎం హోదాలో ఉన్నవారు అందుకు తగినట్టుగా నడుచుకోవాలని పవార్‌ అన్నారు.. ఓ రాజకీయపార్టీ నేతను ఉద్దేశించి గవర్నర్‌ లేఖ రాసినట్టుగానే ఉంది తప్ప ముఖ్యమంత్రికి రాసినట్టుగా లేదని శరద్‌ పవార్‌ అన్నారు.. గవర్నర్‌ తీరుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కంప్లయింట్‌ కూడా చేశారు..