ఢిల్లీ హింస.. స్కూలునూ వదలని ఆందోళనకారులు.. అంతా బుగ్గి !

| Edited By: Anil kumar poka

Feb 27, 2020 | 5:21 PM

ఢిల్లీలో ఆందోళనకారులు చివరకు స్కూళ్లను కూడా వదలడంలేదు. వాహనాలు, ఇళ్ళు, దుకాణాలు,పెట్రోలు బంకులకు నిప్పు పెడుతూ వఛ్చిన వారు.. బడులను సైతం తమ టార్గెట్ చేస్తున్నారు.

ఢిల్లీ హింస.. స్కూలునూ వదలని ఆందోళనకారులు.. అంతా బుగ్గి !
Follow us on

ఢిల్లీలో ఆందోళనకారులు చివరకు స్కూళ్లను కూడా వదలడంలేదు. వాహనాలు, ఇళ్ళు, దుకాణాలు,పెట్రోలు బంకులకు నిప్పు పెడుతూ వఛ్చిన వారు.. బడులను సైతం తమ టార్గెట్ చేస్తున్నారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని బ్రిడ్జి పూర్ రోడ్డులో గల ఓ సీనియర్ సెకండరీ స్కూలుకు వారు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో వందలాది పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, పరీక్ష పేపర్లు, డాక్యుమెంట్లు, చివరకు ఫర్నిచర్ కూడా దగ్ధమైంది. అయితే పరీక్షల కారణంగా విద్యార్థులంతా ఇళ్లకు వెళ్లడంతో బడి ఖాళీ అయింది. ఒక సెక్యూరిటీ గార్డు తప్పించుకుని పారిపోయాడు. అన్నివైపుల నుంచి సుమారు 300 మందితో కూడిన పెద్ద గుంపు తమ పాఠశాలలోకి చొచ్ఛుకు వచ్చిందని, స్కూల్లోని వస్తువులకన్నింటికీ నిప్పు పెట్టిందని ఈ బడిలో సుమారు 18 ఏళ్ళుగా క్యాషియర్ గా పని చేస్తున్న నీతూ చౌదరి గద్గదిక స్వరంతో తెలిపారు. టీచర్ల లాకర్లను సైతం వారు చిందరవందర చేశారని, చివరకు విద్యార్థుల క్యాంటీన్ లోకి కూడా కొంతమంది ప్రవేశించి ఆహార పదార్థాలను కింద పారేశారని ఆమె చెప్పారు. ఈ బడిలో తమకేమీ మిగలలేదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. విద్యార్థులు, టీచర్ల భవితవ్యం ఏమిటో అర్థం కావడంలేదన్నారు. అగ్నిమాపక సిబ్బందికి తాము ఫోన్ చేసినా ఎవరూ రాలేదని, గంటల తరబడి తాము వేచి చూశామని స్కూలు అధికారులు తెలిపారు.

85  ఏళ్ళ వృద్దురాలి ఇంటికి నిప్పు..

గామ్రీ ఎక్స్ టెన్షన్ ప్రాంతంలో ఆందోళనకారులు ఓ ఇంటిని  దగ్ధం చేయడంతో ఆ ఇంట్లో చిక్కుబడిన 85 ఏళ్ళ వృద్దురాలు మరణించింది. ఈమె నలుగురు మనుమలు, మనుమరాళ్ళు ఇల్లు వదిలి పారిపోయారు. అలాగే ఈమె కొడుకు పనిమీద బయటకు వెళ్లడంతో బతికిపోయాడు. కాలిపోయిన ఆ ఇంట్లో ఈ వృధ్ధురాలి మృత దేహం సుమారు 10 గంటలుగా అలాగే పడి ఉందని పోలీసులు తెలిపారు.