Rajinikanth Political Entry: రజినీకాంత్ రాజకీయాల నుంచి తప్పుకోవడానికి అసలు కారణం ఇదేనా..?

|

Dec 29, 2020 | 7:36 PM

మొన్నటి వరకు రాజకీయాల్లో వస్తానన్న రజినీకాంత్ ఒక్కసారిగా ఎందుకు యూటర్న్ అయ్యారు? డిసెంబర్‌ చివరి నాటికి పార్టీని ప్రకటిస్తానన్న తలైవర్..

Rajinikanth Political Entry: రజినీకాంత్ రాజకీయాల నుంచి తప్పుకోవడానికి అసలు కారణం ఇదేనా..?
Follow us on

Rajinikanth: మొన్నటి వరకు రాజకీయాల్లో వస్తానన్న రజినీకాంత్ ఒక్కసారిగా ఎందుకు యూటర్న్ అయ్యారు? డిసెంబర్‌ చివరి నాటికి పార్టీని ప్రకటిస్తానన్న తలైవర్.. ఇప్పుడెందుకు ఉన్నపళంగా పార్టీ పెట్టనని ప్రకటించారు? తమిళనాట త్వరలో జరగబోయే ఎన్నికల్లో రజినీ ప్రభావం అంతంత మాత్రమేనా? ఆయన నియమించిన ప్రైవేటు సర్వే ఏం చెప్పింది? ఆయన కూతుళ్లు ఎందుకు పార్టీ పెట్టొద్దన్నారు? రజినీకాంత్ రాజకీయాల నుంచి తప్పుకోవడానికి అసలు కారణం ఇదేనా? పూర్తి వివరాలను ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

 

ఆ సర్వే ఏం చెప్పింది..?

మొన్నటి వరకు పార్టీ పెడతానంటూ ప్రకటించి తమిళనాట సంచలనం రేకెత్తించిన సూపర్ స్టార్ రజినీకాంత్.. కొద్దిరోజుల వ్యవధిలోనే అందరి ఆశలను అడియాశలు చేశారు. పార్టీ పెట్టబోనంటూ ప్రకటించి ఆయన అభిమానుల్లో నిరాశను నింపారు. అయితే రజినీ ఈ ప్రకటన చేయడానికి ముందు పెద్ద కసరత్తే చేశారట. తన పార్టీ మక్కల్ సేవై కట్చిని అధికారికంగా ప్రారంభించే ముందు అసలు తన ప్రభావం, పార్టీ ప్రభావం ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఆ క్రమంలో ఓ ప్రైవేట్ ఏజెన్సీతో రజినీకాంత్ సర్వే కూడా చేయించారట. అయితే ఆ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయని సమాచారం.

 

రజినీకి ప్రతికూల అంశాలివేనా..?

త్వరలో తమిళనాట జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ సేవై కట్చి పార్టీకి పెద్దగా సీట్లు రావని సదరు సర్వే తేల్చిందట. ఎన్నికల్లో రజినీకాంత్ ప్రభావం అంతంత మాత్రమే ఉంటుందని, మొత్తంగా 15నుంచి 20 అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే ఆయన చరిష్మా పని చేస్తుందని సర్వే వెల్లడించిందట. పార్టీ కోసం గ్రౌండ్ లెవెల్‌లో ఇంతవరకూ ఏ వర్క్ చేపట్టకపోవడం, ఎన్నికలకు ఇంకా మూడునెలలు కూడా లేకపోవడం ఇందుకు కారణమని చెప్పిందట. ఇవన్నీ ఇలా ఉంటే.. రజినీకాంత్ స్థానికుడు కాదనే అంశం కూడా ఎన్నికల్లో ప్రభావం చూపకపోవడానికి ఒక కారణమని సదరు తేల్చింది. బీజేపీతో రజినీ సఖ్యతగా ఉండడం, కేంద్ర నిర్ణయాలను సమర్ధించడం కూడా రజినీపై వ్యతిరేకతకు కారణమని తెలుస్తోంది.

 

పార్టీ వద్దు అంటూ కూతుళ్ల రిక్వెస్ట్..

కాగా, ఈ సర్వే చెప్పిన అంశాలను పరిశీలించిన రజినీ కూతుళ్లు సౌందర్య, ఐశ్వర్య, అల్లుడు దనుష్ లు పార్టీ పెట్టొద్దని రజినీకి సూచించారట. ఘోర పరాజయం మూటగట్టుకునే బదులు రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదని ఆయనకు తేల్చి చెప్పారట. ఆరోగ్యం కూడా సరిగా లేదని, ఈ వయసులో రాజకీయ భారం సరికాదని వారు విజ్ఞప్తి చేశారట. ఇటీవలే తీవ్ర అస్వస్థతకు గురైన రజినీకాంత్.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇలా రజినీకాంత్ కూడా వీటన్నింటిపై సమగ్రంగా ఆలోచించిన తరువాతే పార్టీ పెట్టబోనని స్పష్టమైన ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా మూడేళ్లుగా రాజకీయ అరంగేట్రం చేయడంపై ఊగిసలాడుతూ వచ్చిన రజినీకాంత్ చివరికి పార్టీ పెట్టబోయేది లేదంటూ తేల్చి చెప్పారు.