కానరాని లోకాలకు చేరిన కార్మిక, కర్షక నేత

కార్మిక కర్షక లోకం ఓ పెద్ద దిక్కును కోల్సోయింది. నర్సన్న అంటే నేనున్నా అంటూ కదలి వచ్చే నేత కానరాని లోకాలకు చేరుకున్నాడు.

కానరాని లోకాలకు చేరిన కార్మిక, కర్షక నేత
Follow us

|

Updated on: Oct 22, 2020 | 6:34 AM

కార్మిక కర్షక లోకం ఓ పెద్ద దిక్కును కోల్సోయింది. నర్సన్న అంటే నేనున్నా అంటూ కదలి వచ్చే నేత కానరాని లోకాలకు చేరుకున్నాడు. కార్మికుల కష్టాల్లో ముందుండి పోరాటం చేశారు. మనసున్న నేతగా ఎదిగిన మన్ననలు పొందారు. తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రి, కార్మిక నాయకుడు, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత నాయిని నర్సింహారెడ్డి (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాయిని.. బుధవారం అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో 12.25 గంటలకు మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.

జన నేతగా ఎదిగిన నాయిని తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా, ఉద్యమ సహచరుడిగా, మంత్రివర్గ సభ్యుడిగా రాజకీయాల్లో చేదోడు వాదోడుగా నిలిచాడు నాయిని. నాయిని నర్సింహారెడ్డి 1934 మే 12న నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం నేరడుగొమ్ము గ్రామంలో దేవయ్యరెడ్డి, సుభద్రమ్మ దంపతులకు జన్మించారు. ఆయనకు భార్య అహల్యారెడ్డి, కుమారుడు దేవేందర్‌రెడ్డి, కూతురు సమంతరెడ్డి ఉన్నారు. హెచ్‌ఎస్‌సీ వరకు విద్య నభ్యసించిన నాయిని.. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.

1969లో జయప్రకాశ్‌నారాయణ శిష్యుడిగా జనతాపార్టీలో చేరి.. రాజకీయజీవితాన్ని ప్రారంభించారు. 1978, 1985లో జనతాపార్టీ తరఫున ముషీరాబాద్‌ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ అవిర్భావంతో పార్టీలో చేరిన ఆయన కేసీఆర్ కు దన్నుగా నిలిచారు. 2004లో టీఆర్‌ఎస్‌ తరపున ముషీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది.. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ అవిర్భావం తరువాత 2014 జూన్‌ 2న ఏర్పడిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర మొదటి హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గవర్నర్‌ కోటాలో శాసనమండలికి ఎంపికైన ఆయన పదవీకాలం 2020 ఏప్రిల్‌తో ముగిసింది. నాయిని నర్సింహారెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించిన నాటినుంచి తుదిశ్వాస విడిచేవరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటే నడిచారు.

1970లో హైదరాబాద్‌ వచ్చిన నాయిని నర్సింహారెడ్డి ముషీరాబాద్‌ నియోజకవర్గం సమీపంలోని బర్కత్‌పురలో స్థిరపడ్డారు. హైదరాబాద్‌ కేంద్రంగా కార్మిక ఉద్యమాలు చేసిన ఆయన నాడు ముంబైలో రిక్షా పుల్లర్‌ యూనియన్‌కు కూడా నాయకత్వం వహించారు. 1977 ఎమర్జెన్సీ సమయంలో హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, ముంబై తదితర ప్రాంతాల్లో పలు ఆందోళనల్లో పాల్గొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో రైల్వేచరిత్రలోనే మొట్టమొదటిసారిగా సంపూర్ణ రైల్వే బంద్‌ను జయప్రదం చేయడంలో కీలకంగా వ్యహరించారు.

హైదరాబాద్‌లోని వీఎస్టీలో దేశంలోనే మొట్టమొదటిసారిగా కార్మికుల కోసం రవాణా, క్యాంటీన్‌ వసతిని ఏర్పాటుచేయించారు. హైదరాబాద్‌లోని వీఎస్టీలో కార్మికనేతగా ప్రత్యేక గుర్తింపు పొందిన నాయిని.. కార్మికుల కోసం అలుపెరుగని పోరాటం చేశారు. హైదరాబాద్‌తోపాటు శివారుల్లోని పలు కంపెనీల్లో ఆయన కార్మిక సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. వీఎస్టీలో కార్మిక సంఘానికి సలహాదారుడిగా కొనసాగుతున్న నాయిని నర్సింహారెడ్డి కార్మికుల సంక్షేమం కోసం చివరిదాకా పాటుపడ్డారు.