తెలంగాణకు ఊరట: 4 రోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి ‘టిమ్స్’ సేవలు

రాష్ట్రంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. మరోవైపు కరోనా పేషెంట్ల ఉధృతితో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి కిక్కిరిపోతోంది. కరోనా పోరులో అలుపెరుగకుండా పోరాడుతున్న వైద్యులు, సిబ్బంది వైరస్ బారినపడుతున్నారు. ఇటువంటి తరుణంలో తెలంగాణ ప్రజలకు మరింత ఊరటనిస్తూ గచ్చిబౌలిలోని టిమ్స్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు.

తెలంగాణకు ఊరట: 4 రోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి ‘టిమ్స్’ సేవలు
Follow us

|

Updated on: Jun 24, 2020 | 6:55 PM

రాష్ట్రంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. మరోవైపు కరోనా పేషెంట్ల ఉధృతితో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి కిక్కిరిపోతోంది. కరోనా పోరులో అలుపెరుగకుండా పోరాడుతున్న వైద్యులు, సిబ్బంది వైరస్ బారినపడుతున్నారు. ఇటువంటి తరుణంలో తెలంగాణ ప్రజలకు మరింత ఊరటనిస్తూ గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రిసెర్చి(టిమ్స్) ఆస్పత్రి మరో నాలుగు రోజుల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. బుధవారం మంత్రి ఈటల టీమ్స్ ఆస్పత్రిని సందర్శించారు.

ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ…ఇప్పటికే టిమ్స్‌లో అవుట్ పేషెంట్ విభాగం నడుస్తోందని చెప్పారు. టిమ్స్ ఆస్పత్రిలో అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ ఉపయోగిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. అంతేకాక, ఇక్కడ వెయ్యి పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. మరో 50 పడకలకు వెంటిలేటర్ల సౌకర్యం ఉందని తెలిపారు. ఇప్పటికే టిమ్స్‌లో పని చేసే వైద్య సిబ్బంది, డాక్టర్లకు మంచి క్యాంటిన్ సదుపాయం ఏర్పాటు చేశామని చెప్పారు. ఆరోగ్య రంగంలో కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పోటీపడుతున్నట్లు మంత్రి ఈటల వెల్లడించారు.

ముఖ్యంగా కరోనా పరీక్షల విషయంలో ప్రజలు పూర్తి అవగాహనతో ఉండాలన్నారు. అనవసరంగా ఎవరూ ఆస్పత్రుల చుట్టూ తిరగొద్దని మంత్రి ఈటల సూచించారు. కరోనా లక్షణాలు ఉంటే తప్ప ఎవరూ పరీక్షలు చేయించుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సొంత డబ్బుతో అయినా అనవసరంగా ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా పరీక్షలు చేయించుకోవద్దని కోరారు. గాంధీ ఆస్పత్రిలో వందలాది ఇన్‌పేషంట్లకు చికిత్స అందిస్తున్నామన్నారు. అలాంటి ఆస్పత్రిపై కొందరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తూ… బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గాంధీ వైద్యులు, సిబ్బందిపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.