ఉద్యమించిన ఉత్తరాఖండ్ రైతులు, బ్యారికేడ్ల ధ్వంసం, మూడు బోర్డర్స్ మూసివేసిన పోలీసులు

| Edited By: Anil kumar poka

Nov 30, 2020 | 12:18 PM

ఛలో ఢిల్లీ పేరిట వేలాది రైతులు సాగిస్తున్న ఆందోళనకు ఉత్తరాఖండ్ అన్నదాతలు కూడా జత కలిశారు. ఈ రాష్ట్రం నుంచి వందలాది మంది ఘాజీపూర్-ఘజియాబాద్ ప్రాంతం నుంచి ముందుకు కదిలారు.

ఉద్యమించిన ఉత్తరాఖండ్ రైతులు, బ్యారికేడ్ల ధ్వంసం, మూడు బోర్డర్స్ మూసివేసిన పోలీసులు
Follow us on

ఛలో ఢిల్లీ పేరిట వేలాది రైతులు సాగిస్తున్న ఆందోళనకు ఉత్తరాఖండ్ అన్నదాతలు కూడా జత కలిశారు. ఈ రాష్ట్రం నుంచి వందలాది మంది ఘాజీపూర్-ఘజియాబాద్ ప్రాంతం నుంచి ముందుకు కదిలారు. మధ్యలో పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను వీరు ధ్వంసం చేశారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గుంపులు,గుంపులుగా రావడంతో వీరిని అడ్డుకునేందుకు ఖాకీలు టిక్రి, సింఘు, సరిహద్దులను మూసివేశారు. ఢిల్లీ బోర్డర్ వద్ద గల కీలక పాయింట్ వద్ద కూడా పెద్దఎత్తున బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఘాజీపూర్-ఘజియాబాద్-ఢిల్లీ-యూపీ మధ్య సరిహద్దుల మూసివేతతో సాధారణ ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. అటు సింఘు వద్ద అధికారులు సోమవారం  వైద్య శిబిరాన్ని నిర్వహించడం విశేషం. ప్రతి రైతుకు తాము కరోనా టెస్టులు నిర్వహిస్తామని, ఎవరికి పాజిటివ్ సోకినా ఇతరులకు కూడా సంక్రమిస్తుందని, చివరకు అది పెను ముప్పునకు దారి తీస్తుందని ఓ డాక్టర్ చెప్పారు.

కాగా రైతు చట్టాలు ప్రభుత్వ పెద్దలకు మిత్రులైన బిలియనీర్లకే తోడ్పడతాయని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. రైతులు ఢిల్లీ బాట పట్టిన నాలుగు రోజుల అనంతరం ఆమె ఈ మేరకు ట్వీట్ చేస్తూ పేరుకు వీటిని రైతు చట్టాలని అంటున్నారని, కానీ ఇవి బిలియనీర్ చట్టాలని దుయ్యబట్టారు. అన్నదాతలు ఏం చెబుతున్నారో ప్రభుత్వం ఆలకించాలన్నారు. వీరికి మద్దతుగా అన్ని పార్టీలూ కలిసిరావాలని ఆమె కోరారు. పార్టీ నేత రాహుల్ గాంధీ కూడా ఇలాగే ట్వీట్ చేశారు.