సీనియర్ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత

| Edited By: Ravi Kiran

Mar 05, 2020 | 1:12 PM

సీనియర్ పాత్రికేయుడు, పత్రికారంగానికి అయిదు దశాబ్దాలుగా విశిష్ట సేవలందించిన పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు.

సీనియర్ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత
Follow us on

సీనియర్ పాత్రికేయుడు, పత్రికారంగానికి అయిదు దశాబ్దాలుగా విశిష్ట సేవలందించిన పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. 1934 ఫిబ్రవరి 8 న గుంటూరు జిల్లా పొత్తూరులో జన్మించిన ఈయన.. ఉమ్మడి ఏపీలో ప్రెస్ అకాడమీ చైర్మన్ గా వ్యవహరించారు. 1957 లో ‘ఆంధ్రజనత’ పత్రికతో పాత్రికేయ ప్రస్థానం ప్రారంభించిన పొత్తూరి.. పలు పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు. ‘ఈనాడు’, ‘ఆంధ్రప్రభ’, ‘వార్త’, ‘ఆంధ్రభూమి’ వంటి పత్రికలకు తన సేవలను అందించారు. 2000 సంవత్సరంలో ‘నాటి పత్రికల మేటి విలువలు’, అనే పుస్తకాన్ని, 2001 లో ‘చింతన’, ‘చిరస్మరణీయులు’ అనే పుస్తకాలను ఆయన రచించారు. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు గురించి వెలువడిన ‘ఇయర్స్ ఆఫ్ పవర్’ పుస్తకానికి సహరచయితగా వ్యవహరించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్ర వాదనకు పొత్తూరి వెంకటేశ్వరరావు మద్దతు తెలిపారు. ఆయన మృతికి తీవ్ర సంతాపం తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్.. నాటి ఉద్యమానికి పొత్తూరి నైతిక మద్దతు ప్రకటించారని, పత్రికా, సామాజిక సేవా రంగాల్లో ఆయన సేవలు మరువలేనివని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ సీఎం జగన్.. పొత్తూరి మరణానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి, ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తదితరులు.. తెలుగు పత్రికా రంగానికి, తెలుగు భాషా వికాసానికి పొత్తూరి చేసిన సేవలను కొనియాడారు. ఆయన కుటుంబానికి తమ సంతాపం తెలిపారు.