Dr. Noori Parveen: సమాజ సేవే పరమావధిగా.. రూ.10కే మెరుగైన వైద్యం అందిస్తున్న నూరి పర్వీన్‌

|

Jan 26, 2021 | 1:57 PM

సమాజ సేవే పరమావధిగా భావించింది ఆ యువ వైద్యురాలు.. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని.. అని ఎదురుచూడలేదు. సంకల్పంతో ముందడుగు.

Dr. Noori Parveen: సమాజ సేవే పరమావధిగా.. రూ.10కే మెరుగైన వైద్యం అందిస్తున్న నూరి పర్వీన్‌
Follow us on

My India My Duty – Dr. Noori Parveen: సమాజ సేవే పరమావధిగా భావించింది ఆ యువ వైద్యురాలు.. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని.. అని ఎదురుచూడలేదు. సంకల్పంతో ముందడుగు వేసి తన కలను సాకరం చేసుకుంటోంది. సామాజ సేవకు ఎలాంటి తారతమ్యం అవసరం లేదని గళమెత్తుతోంది. బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన వైద్యసాయమందించడమే తన కర్తవ్యమంటూ అందరి మన్ననలు పొందుతోంది పాతికేళ్ల యువ వైద్యురాలు నూరి పర్వీన్‌.

సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన బడుగు, బలహీన వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు నడుంబిగించింది నూరి పర్వీన్‌. దీనిలో భాగంగా ఆమె ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్‌లోని కడప పట్టణంలోనే ఒక ప్రైవేట్ క్లినిక్‌ను ఏర్పాటు చేసింది. ఆమె ప్రత్యేకత ఏమిటంటే.. వైద్యం ఖరీదుగా మారిన ఈ రోజుల్లో రూ.10కే వైద్య సేవలు అందిస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల బెడ్‌ ఛార్జీలను రోజుకు ఆమె రూ.50 మాత్రమే ఛార్జ్‌ చేస్తోంది. ఇలా రోజుకు పర్వీన్‌ 50 నుంచి 60 మందికి వైద్య సేవలను అందిస్తూ కడప ప్రాంతంలో సుపరిచితురాలిగా మారింది నూరి పర్వీన్‌. దీంతోపాటు ఆమె ఇతర సేవ కార్యక్రమాలను కూడా ఆమె ముందుండి నడిపిస్తుంటుంది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఆహారం అందించడమే కాకుండా.. తన క్లినిక్‌ ద్వారా వైద్య సేవలు అందించి మానవత్వాన్ని చాటుతూ తన కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటుంది నూరి.

వాస్తవానికి నూరి పర్వీన్ విజయవాడ నగరంలో పుట్టి పెరిగింది. ఆ తరువాత ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేసేందుకు కడప వెళ్లింది. చదువు పూర్తయినప్పటికీ ఆమె కడప పట్టణాన్ని వదిలిపెట్టకుండా ఆ ప్రాంత వాసులకు సేవ చేయాలని నిర్ణయించుకుంది. తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకు చెప్పి వారిని కూడా ఒప్పించింది. తన తల్లిదండ్రుల ప్రేరణతోనే సమాజసేవ చేయాలని నిర్ణయించుకున్నానని పర్వీన్‌ పేర్కొంటోంది. అంతేకాకుండా పేదవారికి విద్య, వైద్య సాయం అందించేందుకు హెల్థీ యంగ్ ఇండియా, నూరీ ఛారిటబుల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. ఓ పక్క సమాజ సేవ చేస్తూనే సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేయాలని ప్రస్తుతం పర్వీన్ భావిస్తోంది. అంతా మంచి జరిగితే మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించి దేశంలోని నిరుపేదలకు రూ.10కే మెరుగైన వైద్య సహాయం చేస్తానని నూరీ పర్వీన్‌ పేర్కొంటోంది.

130 కోట్లకుపైగా జనాభా ఉన్న మన దేశంలో.. ఇలాంటి కొంత మంది ఎలాంటి ప్రభుత్వ సహయం కోసం ఎదురు చూడకుండా.. ఎవరి సాయం ఆశించకుండా సొంత శక్తితో దేశాభివృద్ధికి తోడ్పడుతున్నారు. అందుకే ఈ గణతంత్ర దినోత్సవం రోజున మనందరం కర్తవ్యాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తామని శపథం చేద్దాం. వారిలాగే మీరు కూడా ఏదైనా సమాజ సేవలు చేసినట్లైయితే.. మీరు చేసిన ఆ సేవలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఫేస్‏బుక్‏లో #MyIndiaMyDutyతో షేర్ చేయండి. అలాగే TV9 తెలుగు పేజీతో ట్యాగ్ చేయండి.

My India My Duty, Noori Parveen, Republic Day, Republic Day 2021, Dr Noori Parveen, kadapa, andhra pradesh, vijayawada,