కుల్లుమనాలి దసరా వేడుకలకు కరోనా నిబంధనలు ఆటంకం!

|

Oct 23, 2020 | 6:11 PM

దసరా అన్న పదం మన సంస్కృతితో మిళితం అయిపోయింది.. పదం ఏదో సరదాగా కనిపించినా దసరా వెనుక గంభీరమైన అర్థం ఉంది.. అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి అనువైన సమయం ఈ దసరా..

కుల్లుమనాలి దసరా వేడుకలకు కరోనా నిబంధనలు ఆటంకం!
Follow us on

దసరా అన్న పదం మన సంస్కృతితో మిళితం అయిపోయింది.. పదం ఏదో సరదాగా కనిపించినా దసరా వెనుక గంభీరమైన అర్థం ఉంది.. అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి అనువైన సమయం ఈ దసరా.. అమ్మవారు నవరాత్రుల పొడవునా అనేక విశిష్ట రూపాలలో కనిపించి భక్తులను అలరించడం ఈ పండుగ వైశిష్టం.. నవరాత్రి ఉత్సవాల సమయంలో ఆలయాలలో పార్వతీదేవికి ప్రతిరోజూ ఒక్కో విధమైన అలంకరణ చేయడం సంప్రదాయం.. అసలు విజయదశమి అంటేనే ఓ సంబరం.. ఓ సంతోషం.. ఓ ఉత్సాహం.. ఓ ఉత్సవం.. హిమాచల్‌ప్రదేశ్‌లోని కుల్లుమనాలీలో జరిగే విజయదశమి వేడుకల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. ఈ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిపొందాయి.. ఇదో అంతర్జాతీయ పండుగగా మారింది.. ఇప్పుడు కరోనా కారణంగా ఉత్సవం పెద్దగా జరుపుకోవడం లేదు కానీ.. లేకపోతే మహాద్భుతంగా ఉండేది.. కుల్లు లోయలో ఉన్న థాల్పూర్‌ మైదానంలో జరిగే ఈ దసరా ఉత్సవాన్ని వీక్షించడానికి ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు అయిదు లక్షల మంది పర్యాటకులు వచ్చేవారు. ఇప్పుడా ఉత్సవాలన్నీ రద్దయ్యాయి.. రథయాత్రలో కూడా కేవలం వంద మంది మాత్రమే పాల్గొనాలన్న నిబంధన పెట్టింది ప్రభుత్వం.. నిజానికి రాష్ర్ట ప్రభుత్వమే ఈ ఉత్సవాలను నిర్వహిస్తుంటుంది. ఈ వేడుకలకు మూడు వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉంది.. తొమ్మిది రోజుల పాటు జరిగే వేడుకలు రఘునాథస్వామి రథోత్సవంతో ప్రారంభమవుతాయి. మామూలుగా అయితే ఇతర దేవదేవుళ్ల మూర్తులను కూడా రథంలోకి చేర్చి పట్టణమంతా ఊరేగిస్తారు. ఇప్పుడా అవకాశం లేదు.. ప్రకృతి రమణీయతకు తోడు శోభాయమానమైన ఈ వేడుకలు పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేసేవి.. ఏం చేస్తాం..? కరోనా మనకీ దుస్థితి కలిగించింది.. లేకపోతే వారం రోజుల పాటు విందులు వినోదాలు.. ఆటపాటలతో కుల్లు మైదానం పండుగ వాతావరణాన్ని సంతరించుకునేది కదా! ఇప్పుడు సాంస్కృతి కార్యక్రమాలు కూడా రద్దయ్యాయి. సరే… అవేవి లేకపోయినా నవరాత్రులలో ఆరో రోజున గ్రామదేవతలందరూ ఒక్క చోట కొలువు తీరడం మాత్రం జరిగింది. ఈ ఫెస్టివల్‌ కోసం సమీప గ్రామాల నుంచి దాదాపు మూడు వందల దేవతామూర్తులు కుల్లుకు తరలివచ్చాయి. పండుగ అనంతరం రఘునాథ విగ్రహాన్ని పెద్ద ఊరేగింపుతో యథాస్థానానికి చేరుస్తారు.