బురేవీ తుపాను ముప్పు, కేరళ, తమిళనాడులో భారీ వర్షాలు, రెడ్ అలెర్ట్ జారీ

| Edited By: Anil kumar poka

Dec 03, 2020 | 12:51 PM

కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు బురేవీ తుపాను ముప్పు చేరువవుతోంది. తమిళనాడులో పంబన్, కన్యాకుమారి మధ్య ఇది గురువారం రాత్రికిగానీ, శుక్రవారం తెల్లవారు జాముకు గానీ కేంద్రీకృతమవుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

బురేవీ తుపాను ముప్పు, కేరళ, తమిళనాడులో భారీ వర్షాలు, రెడ్ అలెర్ట్ జారీ
Follow us on

కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు బురేవీ తుపాను ముప్పు చేరువవుతోంది. తమిళనాడులో పంబన్, కన్యాకుమారి మధ్య ఇది గురువారం రాత్రికిగానీ, శుక్రవారం తెల్లవారు జాముకు గానీ కేంద్రీకృతమవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఈ ప్రాంతాలతో బాటు చెన్నైలో గురువారం ఉదయం భారీ వర్షం పడింది. కేరళలో ఆరు జిల్లాలు ఈ తుపానుకు గురి కానున్నాయి. తిరువనంతపురంతో బాటు కొల్లం, కొట్టాయం, అళపుజ,  ఇడుక్కి, ఎర్నాకులం జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. శ్రీలంకలోని ట్రింకోమలిని బురేవీ తుపాను దాటిందని, పెనుగాలులతో కేరళ, తమిళనాడు రాష్ట్రాల దిశగా కదిలిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ప్రధాని మోదీ కేరళ, తమిళనాడు ముఖ్యమంత్రులతో  ఫోన్ లో మాట్లాడి తాజా పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ముఖ్యంగా కేరళకు తగినంత సాయం చేసందుకు  సిధ్ధంగా ఉన్నామన్నారు. తాము ఇప్పటికే రెండున్నరవేల సహాయక శిబిరాలను ఏర్పాటు చేశామని, సుమారు వెయ్యిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. ఎనిమిది ఎన్డీ ఆర్ ఎఫ్ బృందాలు తమ రాష్ట్రానికి చేరుకున్నాయని వెల్లడించారు. తమిళనాడులో నాలుగువందలమందికి పైగా పల్లపు ప్రాంతాలవారిని సహాయక శిబిరాలకు చేర్చారు. రామచంద్రాపురం, కన్యాకుమారి  జిల్లాల్లో సహాయక శిబిరాలు క్రిక్కిరిసి ఉన్నాయి. మొత్తం 18 ఎన్డీ ఆర్ ఎఫ్ టీమ్ లు రెడీగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇటీవలి  నివర్ తుపాను నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తమిళనాడుకు మళ్ళీ బురేవీ సైక్లోన్ ముప్పు వెన్నాడుతోంది.