GHMC Elections 2020 :బల్దియా పోలింగ్‌: మేయర్‌పీఠంపై బెట్టింగ్‌..ఏపీ–తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో జోరు..

|

Dec 01, 2020 | 10:12 AM

హైదరాబాద్‌ నగరంలో జరుగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రాజకీయంగా కాకరేపుతున్నాయి. పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో రాజధానితో పాటు రాష్ట్రవ్యాప్తంగా జోరుగా బెట్టింగ్‌ కూడా సాగుతోంది. మేయర్‌ పీఠాన్ని అధిరోహించేది ఎవరనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది..

GHMC Elections 2020 :బల్దియా పోలింగ్‌: మేయర్‌పీఠంపై బెట్టింగ్‌..ఏపీ–తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో జోరు..
Follow us on

హైదరాబాద్‌ నగరంలో జరుగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రాజకీయంగా కాకరేపుతున్నాయి. పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో రాజధానితో పాటు రాష్ట్రవ్యాప్తంగా జోరుగా బెట్టింగ్‌ కూడా సాగుతోంది. మేయర్‌ పీఠాన్ని అధిరోహించేది ఎవరనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇదే అదునుగా గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్‌ రాయుళ్లు తమదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. లక్షలు, కోట్లలో బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల సందర్భంగా జంటనగరాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో పందేలు కాస్తున్నారు బెట్టింగ్‌ రాయుళ్లు. ఏపీ–తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో జోరుగా బెట్టింగ్‌ ఊపందుకుంది. పందెం రాయుళ్లు కొందరు రహస్యంగా గ్రూపులుగా ఏర్పడి బెట్టింగ్‌ కాస్తున్నారు. మరికొందరు ఫాంహౌస్‌లు, హోటళ్లలో వ్యవహారం నడిపిస్తున్నారు. ఇంకొందరు తమ సర్కిళ్లలో ఫోన్ల ద్వారా వాట్సప్‌, టెలిగ్రామ్‌ వంటి వాటిలో సీక్రెట్‌గా గ్రూపులు పెట్టి నడిపిస్తున్నారు. మరికొందరు ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ కాస్తున్నారు. ఇక బెట్టింగ్‌లకు ప్రత్యేక యాప్‌లు కూడా అందుబాటులోకి రావటంతో…స్పెషల్‌ కోడ్‌ భాషను వాడుతూ బెట్టింగ్‌ సాగిస్తున్నారు.

ఇకపోతే, పోలింగ్‌ ముగిసిన తర్వాత ఓటింగ్‌ సరళిని బట్టి ఓ అంచనా వస్తుంది. అప్పుడు బెట్టింగ్‌ ఇంకా జోరందుకుంటుందని భావిస్తున్నారు. బయటవారితో పాటు రాజకీయ నాయకులు కూడా ఈసారి ఎక్కువగా ఈ బెట్టింగుల్లో పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో జోరుగా గ్రేటర్‌ మేయర్‌ పీఠంపై బెట్టింగ్‌ కొనసాగుతోంది. మరోవైపు బల్దియా ఎన్నికలపై ఏపీలోని కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ పందాలు కాస్తున్నట్లు తెలుస్తోంది.