ప్రపంచ దేశాలను డెంగ్యూ వ్యాధి కబళిస్తోంది. అనేక దేశాల్లో ఈ వైరస్ ప్రబలిపోయింది. డెంగ్యూ వ్యాధితో బాధితులు పెరిగిపోతున్నారు. ఆసియా దేశాల్లో విజృంభిస్తున్న ఈ వ్యాధి బారిన పడి మృత్యువాత పడుతున్న వారెందరో ! బంగ్లాదేశ్, కొలంబియా, లావోస్, మలేసియా, సింగపూర్, శ్రీలంక.. ఒకటేమిటి ? అనేక దేశాల్లో ఏటా వేళా కొద్దీ డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఈ కేసులు రెట్టింపయ్యాయి. వియత్నాం, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ వంటి దేశాలే కాదు.. అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనా ప్రకారం.. అమెరికా దేశాలనూ ఈ వ్యాధి వణికిస్తోంది. బ్రెజిల్, నికరాగువా వంటి చోట్లా వింత వైరస్ ఆయా ప్రభుత్వాలకు పెను సమస్యగా మారింది. దోమల్లో నాలుగు రకాలుంటాయని, అయితే వీటిలో ‘ ఎమీస్ ‘ అనే ఆడదోమ వల్లే ఈ వైరస్ వ్యాపిస్తోందని అంటున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, ప్రజల ఆహారపు అలవాట్లు, ప్రకృతి వైపరీత్యాలు ఈ వైరస్ కు కారణమవుతున్నాయి. 1970 దశకం నుంచే డెంగ్యూ ప్రారంభమైనట్టు నిపుణులు చెబుతున్నారు. జనసాంద్రత పెరిగిపోవడం, అశుభ్రత, మురికి నీటి కాలువలు ఈ రకం దోమలకు ‘ వరం ‘గా మారాయని అంటున్నారు. డెంగ్యూ వ్యాధి చికిత్సకు అనువైన టీకా మందును ఇప్పటివరకు కనుగొనలేకపోయారు. అయితే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, దోమతెరలను విరివిగా వాడడం, ఫాగింగ్ చల్లడం వంటివి తప్పనిసరి.. ఇలాంటి చర్యలతో ఈ వ్యాధిని కొంతవరకు అదుపు చేయవచ్చు. పైగా ఇండియా వంటి దేశాల్లో ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు వర్క్ షాపులవంటివి నిర్వహించాల్సి ఉంటుంది. మెడికల్ కేర్ ఎంతగా తీసుకుంటే అంతగా ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. చెన్నై వంటి నగరాల్లో కేవలం డెంగ్యూ బాధితులకు ఆసుపత్రుల్లో ప్రత్యేకమైన వార్డులను ఏర్పాటు చేశారు. అలాగే ఈ వ్యాధి చికిత్సకు అవసరమయ్యే 108 రకాల మందులను సదా అందుబాటులో ఉంచుతున్నారు. ఈ విధమైన చర్యలను ఇతర దేశాలు కూడా తీసుకున్న పక్షంలో డెంగ్యూ వ్యాధికి చాలావరకు చెక్ పెట్టవచ్ఛు.