Big Breaking: జగన్‌పై అమిత్‌షాకు ఫిర్యాదు.. ఆయనేం చేశారంటే?

|

Mar 13, 2020 | 4:53 PM

ఏపీకి చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై అమిత్‌షాకు పిర్యాదు చేశారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పూర్తిగా అప్రజాస్వామికంగా జరుగుతుందంటూ... కేంద్ర హోం శాఖ జోక్యం చేసుకోవాలని బీజేపీ ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్...

Big Breaking: జగన్‌పై అమిత్‌షాకు ఫిర్యాదు.. ఆయనేం చేశారంటే?
Follow us on

BJP telugu MPs met Amith Shah: ఏపీకి చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై అమిత్‌షాకు పిర్యాదు చేశారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పూర్తిగా అప్రజాస్వామికంగా జరుగుతుందంటూ… కేంద్ర హోం శాఖ జోక్యం చేసుకోవాలని బీజేపీ ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ అమిత్‌షాకు నివేదించారు. ఈ మేరకు సాక్ష్యాలతో కూడిన లేఖను వీరు ముగ్గురు శుక్రవారం అమిత్‌షాకు అంద జేశారు.

అనంతరం ముగ్గురు ఎంపీలు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ చేస్తున్న అక్రమాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని జీవీఎల్ నరసింహారావు తెలిపారు. నామినేషన్లు దాఖలు చేయనీయకుండా అడ్డుకుంటూ దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, నామినేషన్లు దాఖలు చేసిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు వివరించారు.

అభ్యర్థులను బెదిరించి నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని, బెంగాల్, కేరళ తరహా పరిస్థితులను ఏపీలో బీజేపీ నేతలు ఎదుర్కొంటున్నారని అమిత్‌షా దృష్టికి తీసుకెళ్ళామని జీవీఎల్ తెలిపారు. ఈ తరహా అప్రజాస్వామిక విధానాలను ఇకపై సహించేది లేదని, అందుకే కేంద్రం జోక్యాన్ని కోరామని ఆయన వివరించారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగుల విషయంలో హైకోర్టు ఆదేశాలను సైతం ఏపీ ప్రభుత్వం అమలు చేయడం లేదని, సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు, హోర్డింగులను తొలగించకుండా అలాగే ఉంచారని జీవీఎల్ ఆరోపించారు.

స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను పట్టించుకోవడం లేదని, పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని, బీజేపీ అభ్యర్థులను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని జీవీఎల్ అంటున్నారు. మరో ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాల్సిన బాధ్యత రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ పైన ఉందని అన్నారు. దేశంలో వైసీపీకి ఎక్కడ లేని విధంగా మెజారిటీ వచ్చిందని, దాంతో చక్కటి పాలన అందించాల్సిం పోయి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ.. ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేస్తూ జగన్ పరిపాలిస్తున్నారని రమేశ్ ఆరోపించారు. ఇంకో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్.. ఏపీలో రాచరికపు పాలన తెచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తగిన విధంగా స్పందిస్తానని అమిత్‌షా తమకు హామీ ఇచ్చారని బీజేపీ ఎంపీలు అంటున్నారు.