అరుణాచల్ లో బీజేపీలోకి జేడీ-యూ ఎమ్మెల్యేల జంప్, నితీష్ ప్రభుత్వానికి ముప్పు లేదంటున్న సుశీల్ మోడీ

| Edited By: Anil kumar poka

Dec 29, 2020 | 6:41 PM

అరుణాచల్ ప్రదేశ్ లో జేడీయూకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలలో ఆరుగురు తమ పార్టీ నుంచి బీజేపీలో చేరిపోవడం ..జేడీ-యూ అధ్యక్షుడు, బీహార్ సీఎం నితీష్ కుమార్ ని తీవ్రంగా కలచి వేసింది.

అరుణాచల్ లో బీజేపీలోకి జేడీ-యూ ఎమ్మెల్యేల జంప్, నితీష్ ప్రభుత్వానికి ముప్పు లేదంటున్న సుశీల్ మోడీ
Follow us on

అరుణాచల్ ప్రదేశ్ లో జేడీయూకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలలో ఆరుగురు తమ పార్టీ నుంచి బీజేపీలో చేరిపోవడం ..జేడీ-యూ అధ్యక్షుడు, బీహార్ సీఎం నితీష్ కుమార్ ని తీవ్రంగా కలచి వేసింది. ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో మా పార్టీకి మిత్ర పక్షంగా ఉండి..అరుణాచల్ లో మా పార్టీ వారిని చేర్చుకుంటారా అని ఆయన తన సన్నిహితుల వద్ద విచారం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనితో బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం కూడా అయిన సుశీల్ కుమార్ మోడీ..డ్యామేజీ కంట్రోల్ కి దిగారు. బీహార్ లో నితీష్ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని, ఆయన అభయమిచ్చారు. ఈ రాష్టంలో జేడీ-యూ, బీజేపీ కూటమిని ఎవరూ చీల్చలేరన్నారు. ఇక్కడ ఈ ప్రభుత్వం పూర్తికాలంలో అధికారంలో ఉంటుందన్నారు

బీహార్ లో బీజేపీ, జేడీ-యూ, హిందుస్థాన్ అవామ్ మోర్చా (సెక్యులర్), వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ ల కూటమి అధికారంలో ఉంది. నితీష్ కుమార్ నిన్న తన పార్టీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి వైదొలగి ఆ పోస్టును మరో నేత అయిన ఆర్ సీ పీ సింగ్ కు అప్పగించారు. రాష్ట్రంలో బీజేపీ-జేడీ-యూ బంధం తెగదని అంటూ సింగ్ ని సుశీల్ మోడీ అభినందించారు. ఏది ఏమైనా తమ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగడానికి ఒక రోజు ముందే అరుణాచల్ లో జరిగిన ‘ఘటన’ ను  నితీష్ మరిచిపోలేకపోతున్నారు.